మక్కా నుంచి మదీనా వైపు సాగిన ఆ మహా హిజ్రత్ (వలస) పయనం సత్యానికి, అసత్యానికి నడుమ జరుగుతున్న పోరాటం. ఖురైష్ శత్రువులు ద్వేషంతో రగిలిపోతూ, ప్రవక్త ముహమ్మద్, వారి పరమ ఆప్తుడు అబూ బకర్ అల్-సిద్దీక్ (రజి)ల ప్రాణాలు తీయడమే ధ్యేయంగా అడవులను, కొండలను జల్లెడ పడుతున్నారు. ఆ ప్రాణసంకట స్థితిలో, వారిద్దరూ భయంకరమైన సౌర్ గుహ అంతర్భాగంలో ఆశ్రయం పొందారు. శత్రువుల అడుగుజాడలు గుహ ముఖద్వారం వరకూ వచ్చాయి. వారు వేసే ప్రతి అడుగు శబ్దం గుహ గోడలను తాకుతున్నది. మరణం అతి సమీపంలో నిలబడి ఉంది. అబూ బకర్ (రజి) గుండె గొంతుకలోకి వచ్చింది. ఆయన వణుకుతున్న స్వరంతో గుసగుసలాడారు : ‘ఓ అల్లాహ్ ప్రవక్తా! వారు ఒక్క క్షణం తమ కాళ్ల వైపు వంగి చూసినా… మనం దొరికిపోతాం!’ కానీ, శాంతికి ప్రతిరూపమైన ప్రవక్త ముఖంలో ఎక్కడా ఆందోళన లేదు.
అగాధమైన విశ్వాసంతో, ప్రశాంతమైన గంభీరతతో ఆయన అబూ బకర్ (రజి) వైపు చూసి ఇలా అన్నారు : ‘ఓ అబూ బకర్! ఇద్దరు ఉన్నచోట మూడోవాడుగా అల్లాహ్ ఉన్నప్పుడు… నీవు ఏమని భయపడుతున్నావు?’ (సహీహ్ బుఖారీ) అంతే! సర్వాంతర్యామి అయిన అల్లాహ్ ఆజ్ఞ జారీ అయింది. విశ్వాన్ని శాసించే ఆ పరమేశ్వరుడు శత్రువుల నెత్తుటి కళ్లను కప్పివేసేందుకు ఏ సైన్యాన్నో దించలేదు. ఒక చిన్న సాలీడు ఆ గుహ ద్వారానికి అడ్డంగా సన్నని దారాలతో వలను అల్లింది; ఒక పావురం ప్రశాంతంగా వచ్చి అక్కడ గూడు కట్టి గుడ్లు పెట్టింది. ద్వారం ముందుకు వచ్చిన శత్రువులు ఆ అతుకుల వలను, నిశ్చింతగా ఉన్న పావురాన్ని చూశారు. ‘ఇక్కడ మనుషులు ఉంటే ఈ వల చిరిగిపోయేది కదా! లోపల ఎవరూ లేరు’ అని భావించి అక్కడి నుంచి వెనుతిరిగారు. శత్రువుల కత్తుల కన్నా… అల్లాహ్ నేసిన సాలీడు వలే అత్యంత శక్తిమంతంగా నిలిచింది. మిమ్మల్ని రక్షించడానికి అల్లాహ్కు ఆయుధాలు, ఆర్భాటాలు అవసరం లేదు. ఆయన తలచుకుంటే… ఈ సృష్టిలోనే అత్యంత బలహీనమైన సాలీడు దారాన్ని కూడా శత్రువులను తుత్తునియలు చేసే అజేయమైన కవచంగా మార్చగలడు. నీ విశ్వాసం దృఢంగా ఉంటే, ఆ భగవంతుడే నీకు తోడుగా నిలుస్తాడు!