మోర్తాడ్/బాన్సువాడ, డిసెంబర్ 17: స్థానిక సమరంముగిసింది.. మూడో విడత పల్లె పోరు ప్రశాంతంగా సాగింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని 20 మండలాల్లో బుధవారం జరిగిన ఎన్నికల్లో భారీగా ఓటింగ్ నమోదైంది. పల్లె జనం ఓటు వేసేందుకు ఉత్సాహంగా తరలివచ్చారు. ఉదయం నుంచే పో లింగ్ కేంద్రాల్లో బారులు తీరారు. చలి కారణంగా ఉదయం మందకొడిగా ప్రారంభమైన ఓటిం గ్ ప్రక్రియ ఆ తర్వాత ఊపందుకున్నది. నిజామాబాద్ జిల్లాలోని 12 మండలాలు, కామారెడ్డి జిల్లాలో 8 మండలాల పరిధిలో ఉదయం 7 నుంచి మధ్యా హ్నం ఒంటి గంట వరకు ఎన్నికలు జరిగా యి. మధ్యాహ్నం తర్వాత ఓట్ల లెక్కింపు నిర్వహిం చి ఫలితాలు ప్రకటించారు. చాలా గ్రామాల్లో స్వల్ప ఓట్లతో గెలుపోటములు తారుమారయ్యాయి.
నిజామాబాద్లో..
జిల్లాలోని మోర్తాడ్, కమ్మర్పల్లి, భీమ్గల్, వేల్పూర్, బాల్కొండ, ముప్కాల్, మెండోరా, ఏర్గట్ల, ఆర్మూర్, ఆలూర్, నందిపేట్, డొంకేశ్వర్ మండలాల్లోని 146 సర్పంచ్, 1,130 వార్డు స్థానాలకు జరిగిన ఎన్నికల్లో భారీగా పోలింగ్ నమోదైంది. మొత్తం 3,06,795 మంది ఓటర్లకు గాను 2,34,314 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. నందిపేట మండలంలో అత్యధికంగా 78.74 శాతం మంది, ఆర్మూర్ మండలంలో అత్యల్పంగా 73.99శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.
కామారెడ్డిలో 80.62% పోలింగ్ ..
జిల్లాలోని 8 మండలాల పరిధిలో 142 సర్పంచ్, 1,020 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా, 80.62 శాతం పోలింగ్ నమోదైంది. బిచ్కుంద మండలంలో అత్యధికంగా 89.83 శాతం నమోదు కాగా, బాన్సువాడ మండలంలో అత్యల్పంగా 74.36 శాతం మంది ప్రజలు ఓటేశారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు ప్రకటించారు.
