ఖలీల్‌వాడి, జనవరి 28: పల్లెల పాలన ప్రత్యేక అధికారుల చేతుల్లోకి వెళ్లనున్నది. గ్రామపంచాయతీ పాలక మండళ్ల గడువు ఈ నెల 31తో ముగియనున్నది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సంసిద్ధంగా లేదు. మరోవైపు, సర్పంచుల పదవీకాలం పొడిగించే అవకాశమున్నా ఆసక్తి చూపడం లేదు. బదులుగా పాలనా పగ్గాలను ప్రత్యేక అధికారులకు అప్పగించాలని సర్కారు సూత్రప్రాయంగా నిర్ణయించింది. అందుకు అనుగుణంగా జిల్లా యంత్రాంగం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. విభాగాల వారీగా అధికారులను గుర్తించడం కూడా దాదాపు పూర్తయింది. ఫిబ్రవరి 1 నుంచి ప్రత్యేక అధికారుల సారథ్యంలోనే పాలన కొనసాగనున్నది. అయితే, స్పెషలాఫీసర్లు వస్తే అభివృద్ధి ఆగిపోతుందని, పనులు ఎక్కడికక్కడే నిలిచి పోతాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నిజామాబాద్ జిల్లాలో 530 గ్రామపంచాయతీలు, కామారెడ్డి జిల్లాలో 526 జీపీలు ఉన్నాయి. ఆయా పంచాయతీలకు 2019 జనవరిలో ఎన్నికలు నిర్వహించారు. ఫిబ్రవరి 1వ తేదీన కొలువుదీరిన పాలకవర్గాల గడువు ఈ నెల 31తో ముగియనున్నది. అయితే, గడువు తీరేలోపు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా, కాంగ్రెస్ ప్రభుత్వం సుముఖత చూపడం లేదు. ఇటీవలే అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం స్థానిక సంస్థలను ఎదుర్కొనేందుకు ముందుకు రావడం లేదు. ఇప్పట్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని మంత్రి సీతక్క ఇటీవల స్పష్టం చేశారు. దీంతో ఇప్పట్లో ఎన్నికలు జరిగే పరిస్థితి కనిపించడం లేదు. లోక్‌సభ ఎలక్షన్ల తర్వాతే స్థానిక సంస్థల సమరానికి ప్రభుత్వం తెర తీయనున్నట్లు భావిస్తున్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలను ఆపలేదు. గడువులోపు ఎన్నికలు నిర్వహించింది. కానీ అందుకు విరుద్ధంగా కాంగ్రెస్ ప్రభుత్వం లోకల్‌బాడీ ఎలక్షన్ల నిర్వహణకు సుముఖత చూపడం లేదు. మరోవైపు, సర్పంచుల గడువు పొడిగించేందుకు అవకాశమున్నా ఆ దిశగా ఆలోచించడం లేదు.
పాలకమండళ్ల గడువు ముగియనుండడంతో ప్రత్యేక అధికారులకు బాధ్యతలు అప్పగించాలని సర్కారు నిర్ణయించింది. ఆ మేరకు అధికారులు ఆ దిశగా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే విభాగాల వారీగా అధికారులను గుర్తించి, వారికి బాధ్యతలు అప్పగించేందుకు సన్నాహాలు చేపట్టారు. ప్రత్యేక అధికారులను నియమించేందుకు మండలాల వారీగా అధికారుల జాబితాను ఇప్పటికే రూపొందించారు. తహసీల్దార్, ఎంపీడీవో, పంచాయతీరాజ్, ఇరిగేషన్, ఆర్అండ్బీ, మిషన్ భగీరథ ఏఈలతో పాటు ఎంపీవోలు, డిప్యూటీ తహసీల్దార్లు, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు, సూపరింటెండెంట్లు, సూపర్వైజర్లతో కూడిన జాబితాను సిద్ధం చేశారు. ఆయా అధికారులకు గ్రామాల వారీగా బాధ్యతలు అప్పగించనున్నారు.
‘ప్రత్యేక’ ప్రణాళికలు సిద్ధం..
ఈ నెలాఖరుతో సర్పంచుల పదవీకాలం ముగియనున్నది. గ్రామాల్లో పాలనకు ఇబ్బందులు లేకుండా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని 530 గ్రామపంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించనున్నాం. ఇప్పటికే అధికారుల జాబితాను కూడా రూపొందించాం.
– జయసుధ, డీపీవో, నిజామాబాద్