కామారెడ్డి, మే 14 : ఉమ్మడి జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం నుంచే భానుడు తన ప్రతాపం చూపుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఉపాధి హామీ కూలీలు పనులు చేయడం కష్టసాధ్యంగా మారింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉపాధి హామీ కూలీలకు వందరోజుల పని కల్పించి, పని ప్రదేశంలో అన్ని రకాల సౌకర్యాలు కల్పించింది. వేసవి కాలంలో టెంటు, తాగునీటిని అందుబాటులో ఉంచి, కూలీలకు ఎలాంటి ఇబ్బందులు కలుగుకుండా చర్యలు తీసుకున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఉపాధి కూలీలకు సౌకర్యాలు కరువయ్యాయి. అన్నిసౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వం ఆదేశించినా క్షేత్రస్థాయిలో అమలుచేసేవారే కరువయ్యారు. ఎండలో పనిచేసేవారు సేదదీరడానికి కనీసం టెంట్, తాగునీటి సౌకర్యం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఎండ తీవ్రతకు ఇప్పటికే పలువురు కూలీలు వడదెబ్బ బారిన పడి మృతిచెందగా..మరికొందరు అస్వస్థతకు గురవుతున్నారు. ఉపాధి పనులు జరిగే చోట మెడికల్ కిట్లు అందుబాటులో ఉంచకపోవడంతో దవాఖాలను ఆశ్రయించాల్సి వస్తున్నది. దీంతో కొన్ని సమయాల్లో దవాఖానకు వెళ్లేలోపు కొందరు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నా పట్టించుకునేవారే కరువయ్యారు. రాజంపేట మండలం తలమడ్ల గ్రామంలో ఉపాధి కూలీలకు కనీసం నీడ, తాగునీటి సౌకర్యం కల్పించడంలేదు. దీంతో కూలీలు మండుటెండలోనే పని చేస్తున్నారు. కామా రెడ్డి జిల్లా వ్యాప్తంగా సుమారు 30 వేలమందికి పైగా ఉపాధి కూలీలు పనులు చేస్తున్నారు. మే నెలలో ఎండ తీవ్రంగా ఉండడంతో పనిచేసే చోట కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నామని ఉపాధి కూలీలు వాపోతున్నారు.
ఉపాధి హామీ కూలీలకు పనిచేసే చోట సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం ఎలాంటి సౌకర్యాలు కల్పించిన దాఖలాలు లేవు. సేద దీరడానికి నీడ, తాగునీటి సౌకర్యం కల్పించడంలేదు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఏమైనా గాయాలైనప్పుడు, వడ దెబ్బ తగిలితే మెడికల్ కిట్లు అందుబాటులో ఉంచడంలేదు. తాగునీరు కావాలన్నా ఎవరికి వారే ఇంటి నుంచే తెచ్చుకోవాల్సిన పరిస్థితి. పంచాయతీల్లో బడ్జెట్ లేకపోవడంతో వసతులు కల్పించడం లేదని అధికారులు చెబుతున్నారు. తమకు కనీసం పనిచేసే చోట టెంట్, తాగునీటి సౌకర్యం కల్పించాలని ఉపాధి కూలీలు కోరుతున్నారు.
2016లో టెంట్లు వేసుకోవడానికి తాటిపత్రిలు ఇచ్చారు. వాటినే ఇప్పటివరకు వాడుకుంటున్నారు. అవి పాడైపోయాయి. కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఇవ్వలేదు. తాగునీటి సౌకర్యం పంచాయతీ సిబ్బంది కల్పించాలి. కానీ వారు పట్టించుకోవడంలేదు. మెడికల్ కిట్లు కూడా పంచాయతీ వారే అందుబాటులో ఉంచాలి.