జిల్లా ప్రజలకు అత్యంత ఖరీదైన వైద్య సేవలు మరింత చేరువ కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేసి జీజీహెచ్‌లో ఇప్పటికే సూపర్ స్పెషాలిటీ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ప్రైవేటుకు దీటుగా మోకాలి చిప్పల మార్పిడి ఆపరేషన్లు నిర్వహించి నంబర్ వన్ స్థానంలో నిలిచింది. ప్రస్తుతం గుండె జబ్బులకు చికిత్స అందించే అత్యాధునిక క్యాథ్ ల్యాబ్ సౌకర్యం కూడా నిజామాబాద్ దవాఖానలో అందుబాటులోకి రానున్నది. ఇందుకోసం రూ. 6.50 కోట్ల నిధులను కేటాయించింది. ఇప్పటికే హైదరాబాద్ నుంచి వచ్చిన బృందం క్యాథ్ ల్యాబ్ ఏర్పాటుకు కావాల్సిన స్థలాన్ని పరిశీలించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ల్యాబ్ ఏర్పాటైతే ప్రైవేటులో లక్షలాది రూపాయలు ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా నిరుపేదలకు ప్రభుత్వ దవాఖానలోనే గుండె సంబంధిత శస్త్ర చికిత్సలు ఉచితంగా పొందే అవకాశం ఏర్పడుతుంది. వచ్చే ఏడాది మార్చి నాటికి ల్యాబ్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. హైదరాబాద్ తర్వాత క్యాథ్ ల్యాబ్‌ను నిజామాబాద్ ప్రభుత్వ దవాఖానలోనే ఏర్పాటు చేస్తుండడం విశేషం. ఈ ల్యాబ్‌ను ఏర్పాటు చేస్తుండడంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
-ఖలీల్‌వాడి, డిసెంబర్ 29
ఖలీల్‌వాడి, డిసెంబర్ 27 : నిజామాబాద్ జిల్లా ప్రజలకు అత్యాధునిక వైద్య సదుపాయాలు మరింత చేరువ కానున్నాయి. అత్యంత ఖరీదైన వైద్యం ప్రభుత్వ దవాఖానలో అందుబాటులోకి రాబోతున్నది. రాష్ట్ర ప్రభుత్వం నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ దవాఖానలో ఇప్పటికే అనేక సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చింది. కొవిడ్‌తో పాటు వివిధ రోగుల కోసం ప్రత్యేక వార్డులను కేటాయించింది. ఇటీవలే మోకాళ్ల కాలి చిప్పల మార్పిడి ఆపరేషన్లు నిర్వహించి నంబర్ వన్ స్థానంలో నిలిచింది.
ప్రస్తుతం గుండెకు సంబంధించిన క్యాథ్‌ల్యాబ్‌ను కేటాయించనున్నారు. దీంతో హైదరాబాద్‌కు వెళ్లకుండా ఇక్కడే శస్త్ర చికిత్సలు చేసే అవకాశం ఏర్పడుతుంది. గుండెకు భద్రత కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ దవాఖానలో క్యాథ్ల్యాబ్ని అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ నుంచి వచ్చిన పరిశీలకులు క్యాథ్‌ల్యాబ్‌కు కావాల్సిన స్థలాన్ని పరిశీలించి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ల్యాబ్‌కు కావాల్సిన పరికరాల కోసం ప్రతిపాదనలు పంపించారు. ఈ ల్యాబ్‌కు రూ. 6.50 కోట్లు ఖర్చు అవుతుంది. ఖర్చుకు వెనుకాడకుండా ప్రజారోగ్యమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది. దీంతో పాటు 2డీ ఈకో, కొత్తగా టీఈఈ పరికరం అందుబాటులోకి తెచ్చింది. దీనికి సుమారు రూ. 20 లక్షలు ఖర్చు చేశారు. హైదరాబాద్ తర్వాత నిజామాబాద్‌లోనే క్యాథ్ ల్యాబ్‌ను ఏర్పాటు చేస్తుండడంపై జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గుండెకు సంబంధించిన శస్త్ర చికిత్సలు
నిజామాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు ఒక్కో ఇంజక్షన్‌కు రూ. 40 వేలు ఖర్చు చేసి 100 మందిని కాపాడారు. యాంజియోగ్రామ్ చేసేటప్పుడు గుండెకు సంబంధించిన హోల్స్ మూసుకుపోతే హైదరాబాద్‌కు వెళ్లకుండా క్యాథ్‌ల్యాబ్ ద్వారా ఆపరేషన్ చేయించుకునే వీలు ఉంటుంది. అది కూడా ఉచితంగా చేస్తారు. దీనికి ప్రైవేటులో రూ. లక్ష నుంచి 3 లక్షల వరకు ఖర్చు అవుతుంది.
క్యాథ్‌ల్యాబ్‌లో బైపాస్ సర్జరీలకు అవకాశం
మనిషిలోని గుండెలో మూడు వాల్స్ బ్లాక్ అయిప్పుడు సీనియర్ గుండె వైద్యనిపుణులతో బైపాస్ సర్జరీ చేసుకోవచ్చు. దీనికి ప్రైవేటులో రూ. 5లక్షలపైనే ఖర్చు అవుతుంది. క్యాథ్ ల్యాబ్ ఏర్పాటైతే ఉచితంగా సేవలను పొందవచ్చు. చిన్న పిల్లలకు గుండె కవాటాలు మూసుకుపోయినప్పుడు క్యాథ్‌ల్యాబ్‌లో బెలూన్ వంటి పరికరాన్ని పంపి కవాటాలు తెరిపించవచ్చును. అలాగే గుండె గదుల మధ్య గోడలకు రంధ్రాలు ఏర్పడితే మూసివేయవచ్చును.
2డీ ఈకో, టీఈఈ ద్వారా
2డీఈకో ద్వారా గుండె ఎలా పని చేస్తుందో తెలుసుకోవచ్చు. టీఈఈ ద్వారా నోటి ద్వారా గుండెలోకి పైప్ పంపి ఎక్కడ రక్తం గడ్డ కట్టిందో తెలుసుకునే వీలు ఉంటుంది. ప్రస్తుతం ఇది ప్రభుత్వ దవాఖానలో అందుబాటులో ఉంది.
నిజామాబాద్ ప్రభుత్వ దవాఖానలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నది. ప్రస్తుతం క్యాథ్ ల్యాబ్‌ను సైతం అందుబాటులోకి తీసుకురావడానికి సర్వం సిద్ధం చేసింది. 2023 ఫిబ్రవరి 28 నాటికి పూర్తి చేసుకొని మార్చి నెలలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశాలతో ఇటీవల హైదరాబాద్ నుంచి వచ్చిన నిపుణులు పరిశీలించి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తున్నది.
త్వరలోనే అందుబాటులోకి క్యాథ్‌ల్యాబ్ సేవలు
నిజామాబాద్ జిల్లా దవాఖానలో అత్యంత ఖరీదైన క్యాథ్‌ల్యాబ్ సౌకర్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నది. మూడు నెలల్లో పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకు వస్తాం. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సౌకర్యాలను కల్పించింది. రూ. కోట్లు ఖర్చు అయినా ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనేది ప్రభుత్వ లక్ష్యం.
-ప్రతిమారాజ్, ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్