మోర్తాడ్, మే 9 : నిజామాబాద్ జిల్లా మెండోరా మండలంలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో రోజురోజుకూ నీటిమట్టం తగ్గుతున్నది. యాసంగి పంటలకు ప్రధాన కాలువలైన కాకతీయ, సరస్వతీ, లక్ష్మి వరదకాలువలతో పాటు ఎత్తిపోతలకు ప్రణాళిక ప్రకారం అధికారులు నీటిని విడుదల చేశారు. అనుకున్న ప్రకారం యాసంగి పంటలకు నీటివిడుదల చేయడంతో కాలువలు, ఎత్తిపోతల పరిధిలోని రైతులు సంతోషం వ్యక్తం చేశారు.
ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు (80.5 టీఎంసీలు) కాగా ప్రస్తుతం ప్రాజెక్ట్‌లో 1060 అడుగుల (11.23టీఎంసీలు) నీరు నిల్వ ఉన్నది. ప్రాజెక్ట్‌లోకి 289 క్యూసెక్కుల స్వల్ప ఇన్‌ఫ్లో కొనసాగుతుండగా.. కాకతీయకాలువకు 100 క్యూసెక్కులు, మిషన్‌భగీరథకు 231 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. 359 క్యూసెక్కుల నీరు ఆవిరి రూపంలో వెళ్తున్నట్లు పేర్కొన్నారు.