పెద్ద కొడప్గల్ (పిట్లం), ఫిబ్రవరి 26: హత్య కేసు విషయంలో రాజీ కాలేదని కన్నతల్లిని ఓ కుమారుడు హత్యచేశాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో చోటు చేసుకున్నది. స్థానిక ఎస్సై రాజు తెలిపిన వివరాల ప్రకారం.. పిట్లం మండల కేంద్రానికి చెందిన సాబేరా బేగం (60)కు నలుగురు కొడుకులు. 2021లో ఆమె రెండో కుమారుడు షాదుల్, మూడో కుమారుడు ముజీ బ్ మధ్య ఆస్తి వివాదం తలెత్తగా.. ముజీబ్ను షాదుల్ కత్తితో పొడిచి చంపేశాడు. ఈ కేసు ప్రస్తుతం కోర్టులో ట్రయల్ నడుస్తున్నది.
నిందితుడు షాదు ల్ తన తల్లి సాబేరా బేగంను కేసులో రాజీ కావాలని ఆమెను కోరగా అంగీకరించలేదు. దీంతో షాదు ల్ ఈ నెల 24న తల్లితో గొడవపడి ఆమె తలపై రోకలిదుడ్డుతో బాదాడు. తీవ్రగాయాలు కావడంతో చికిత్స నిమిత్తం నిజామాబాద్ దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. మృతురాలి పెద్ద కొడుకు అబ్దుల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.