నిజామాబాద్, ఏప్రిల్ 14, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కేసీఆర్ ప్రాజెక్టుకు కాంగ్రెస్ గ్రహణం పట్టుకుంది. నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని సిద్ధాపూర్ రిజర్వాయర్ నిర్మాణం రేవంత్ సర్కారులో ముందుకు పడటం లేదు. నిజాంసాగర్ ప్రాజెక్టు నాన్ కమాండ్ ఏరియాలో రైతుల పరిస్థితి అధ్వానంగా ఉంటుంది. వానాకాలం మినహా యాసంగిలో పంటలు పండించడం ఈ ప్రాంతాల్లో గగనం. అలాంటి ఏరియాకు సాగు నీళ్లను తీసుకెళ్లేందుకు కేసీఆర్ ప్రభుత్వం 20 22, ఫిబ్రవరి 16న సిద్ధాపూర్ రిజర్వాయర్‌కు శంకుస్థాపన చేసింది. రూ.119 కోట్ల అంచనాతో మొదలైన ఈ ప్రాజెక్టు పనులు బీఆర్ఎస్ హయాంలో శరవేగంగా జరిగింది. తదనంతరం రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో సిద్ధాపూర్ రిజర్వాయర్‌కు బ్రేక్ పడింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతున్నప్పటికీ బీఆర్ఎస్ హయాంలో గిరిజన రైతుల మేలు కోసం నిర్మించతల పెట్టిన ప్రాజెక్టుకు మోక్షం లభించడం లేదు. బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై అసెంబ్లీ ఎన్నికల్లో బాన్సువాడ ఎమ్మెల్యేగా పోచారం శ్రీనివాస్ రెడ్డి విజయం సాధించారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీ మారుతున్నట్లుగా ప్రకటించారు. పెండింగ్ నిధులు రాబట్టుకోవడం, మిగిలిన పోయిన పనులను పూర్తి చేయించుకోవడమే ధ్యేయంగా హస్తం పార్టీలో చేరినప్పటికీ మాజీ స్పీకర్ ్డఆశించిన ఫలితం దక్కడం లేదు. తన నియోజకవర్గంలో కేసీఆర్ హయాంలో బీజం వేసిన సిద్ధాపూర్ రిజర్వాయర్‌కు కనీస నిధులు తెచ్చుకోలేక విలవిల్లాడాల్సి వస్తోంది.
బీఆర్ఎస్ పాలనలో సిద్ధాపూర్ రిజర్వాయర్ పనులు జోరుగా జరిగాయి. కాంగ్రెస్ పార్టీలో పోచారం చేరిన తర్వాత నిధులు తీసుకు వస్తానని హామీ ఇచ్చారు. ఇప్పుడు బిల్లులు మంజూరు కాకపోవడంతో కాంట్రాక్టర్లు పనులు వదిలేస్తున్నారని స్వయంగా ఒప్పుకున్నారు. సిద్దాపూర్ ప్రాజెక్టులకు నిధుల లేమి, కేసీఆర్ హయాంలో బాన్సువాడకు మంజూరైన నర్సింగ్ కళాశాల బిల్డింగ్ విషయంలోనూ ఇబ్బంది తలెత్తిందని చెప్పుకు రావడం చర్చనీయాంశం అవుతోంది. బీఆర్ఎస్లో ఉంటే జీవోలు సులభంగా వచ్చేవి అని పోచారం ఒప్పుకున్నారు. ఇంట్లో కూర్చుంటే జీవోలు వచ్చాయని చెప్పడం కేసీఆర్ పరిపాలన దక్షతను చెప్పకనే చెబుతోంది. నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీ మారినప్పటికీ బాన్సువాడకు ఆశించిన స్థాయిలో నిధులు రాబట్టుకోవడంలో పోచారం వైఫల్యం చెందుతున్నారనే ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ గూటికి చేరుతున్న క్రమంలో ప్రజల అవసరాల నిమిత్తమే కండువా మార్చుకున్నట్లుగా మాజీ స్పీకర్ స్వయంగా వెల్లడించారు. 2024, జూన్‌లో పార్టీ మారినప్పటి నుంచి నేటి వరకు ఆశించిన స్థాయిలో నిధుల వరద రాలేదు. సిద్ధాపూర్ రిజర్వాయర్‌ను పూర్తి చేయించాలనే సంకల్పం తీసుకున్నప్పటికీ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో సహకారం లభించడం లేదు. కాంగ్రెస్ సర్కారులో ప్రభుత్వ సలహాదారుగా క్యాబినెట్ ర్యాంక్ పదవిని అనుభవిస్తున్నప్పటికీ కనీసం నియోజకవర్గానికి ఆశించిన స్థాయిలో నిధులు విడుదల కాకపోవడంపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తం అవుతోంది. బాన్సువాడ అభివృద్ధికి అన్ని విధాలుగా కేసీఆర్ సహకరించారు. పోచారం ప్రతిపాదనలకు చిటికెలో ఆమోదం తెలిపారు. పరిపాలన అనుమతులకు, నిధుల విడుదలకు నిమిషాల్లో పచ్చజెండా వచ్చేది. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్‌కు, మంత్రులకు డజన్ సార్లు ఫోన్లు చేస్తే కూడా పోచారంకు స్పందన రావడం లేదు.
కేసీఆర్ ప్రభుత్వంలో బాన్సువాడ నియోజకవర్గంలో సుమారుగా రూ.10వేల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. 2018 జనవరిలో బాన్సువాడ మున్సిపాలిటీగా రూపాంతరం చెందింది. ప్రొ.జయశంకర్ మినీ స్టేడియాన్ని రూ.2కోట్లతో నిర్మించారు. కల్కి చెరువును పర్యాటక కేంద్రంగా మార్చడంతో పాటుగా రూ.7కోట్లతో మినీ ట్యాంక్ బండ్, రూ.2కోట్లతో మున్సిపాలిటీ నూతన భవనం, రూ.80లక్షలతో రెవెన్యూ సముదాయం, రూ.2కోట్లతో సమీకృత మార్కెట్, రూ.4కోట్లతో ఆక్సిజన్ పార్కు, పిల్లల ఆట కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అటవీ ప్రాంతం గుండా బాన్సువాడ – కామారెడ్డి రహదారి నిర్మాణం. బాన్సువాడ పట్టణంలో అమెరికా తరహాలో క్లిప్ బౌన్ పేయర్ సాంకేతికతను రోడ్లు వేయించారు. వాగులు, వంకల్లో, మంజీర నదిపై వంతెనలు, గ్రామాలు, తండాల్లో రూ.600కోట్లతో రోడ్ల నిర్మాణాలు జరిగాయి. నిజాంసాగర్ ప్రాజెక్టు కింద నాన్ కమాండింగ్ ఏరియాకు రూ.119 కోట్లతో సిద్దాపూర్ రిజర్వాయర్, రూ.150కోట్లతో చందూర్ లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకు వచ్చారు. నిజాంసాగర్ ప్రధాన కాలువ మరమ్మత్తులు, కట్ట బలోపేతం కోసం రూ.150కోట్లతో పనులు పూర్తి చేశారు. బాన్సువాడ సామాజిక ఆసుపత్రిని జిల్లా ఆసుపత్రిగా రూపాంతరం, మాతా శిశు సంరక్షణ కేంద్రం ఏర్పాటైంది. నర్సింగ్ కళాశాల మంజూరు, కోటగిరిలో 50 పడకల అసుపత్రిగా అప్‌గ్రేడ్ చేశారు. కార్పొరేట్ హంగులతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, బాలికల, బాలుర రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటు అయ్యాయి. రుద్రూర్లో పుడ్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కాలేజీ, వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల, కేజీబీవీలు, ఆదర్శ పాఠశాలలు కోకొల్లలుగా నెలకొల్పబడ్డాయి. బాన్సువాడ నియోజకవర్గంలో 11వేల డబుల్ బెడ్ రూం ఇళ్లు మంజూరు కాగా రూ.1100 కోట్లతో నిర్మాణాలు చేపట్టారు. 10వేలకు పైగా ఇళ్లను నిర్మించి అర్హులైన వారికి హక్కు పత్రాలు అందించారు. తెలంగాణ తిరుమల తిరుపతి ఆలయంగా ప్రసిద్ది గాంచిన బీర్కూర్ మండలంలోని తిమ్మాపూర్ వెంకన్న కొండను కేసీఆర్ ఆశీస్సులతో అద్భుతంగా తీర్చిదిద్దారు.