నిజామాబాద్, అక్టోబర్ 28, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఎడాపెడా కురుస్తోన్న వానలతో రైతు పరిస్థితి ఆందోళనకరంగా మారింది. వానాకాలం సీజన్ ముగిసినప్పటికీ వానలు వీడకపోవడంతో రైతులు తలలు పట్టుకుంటున్నారు. చేతికి వచ్చిన పంటను కోయలేక భిక్కుభిక్కుమంటూ ఎదురు చూస్తున్నారు. వరి కోసిన రైతులంతా తేమ శాతం తగ్గించుకునేందుకు రోడ్లపై పాట్లు పడుతున్నారు. పీఏసీఎస్, ఐకేపీ కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్తే సిబ్బంది నిర్వాకంతో ధాన్యం వర్షానికి తడిసి పోతోంది.
టార్ఫలిన్ కవర్లు సరిపడా అందుబాటులో పెట్టకపోవడంతో సమస్య ఎదురవుతోంది. మోంథా తుఫాన్ ప్రభావంతో మంగళవారం కురిసిన వానలతో పలు ప్రాంతాల్లో రైతులకు నష్టం వాటిల్లింది. రాబోయే వారం రోజుల్లో వర్షాలు ఉన్నందున వరి కోతలను నిలిపేసుకోవడమే మంచిదని అధికార యంత్రాంగం సూచిస్తోంది. గ్రామ స్థాయిలో రైతులకు అవగాహన కల్పించాలంటూ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.
కోసిన ధాన్యాన్ని ఆరబెట్టుకునేందుకు కల్లాలు లేకపోవడంతో చాలా మంది రోడ్లపై కుప్పలు పోస్తున్నారు. ఆకస్మికంగా కురిసే వానలతో ధాన్యం తడిసి పనికి రాకుండా పోతోంది. తేమ శాతం పేరుతో కేంద్రాల్లో కొనుగోళ్లకు ససేమిరా అంటుండడంతో దిక్కుతోచని స్థితిలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. కొనుగోళ్లు జరిగినప్పటికీ ట్యాబ్ ఎంట్రీ సరిగా లేకపోవడంతో నిజామాబాద్ జిల్లాలో రూ.170కోట్లు చెల్లింపులు జరగాల్సి ఉన్నది. కామారెడ్డి జిల్లాలో రూ.30కోట్లు మేర పెండింగ్ ఉన్నాయి.
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు రూ.275కోటు విలువ చేసే 1.15లక్షల మెట్రిక్ టన్నులు మేర ధాన్యాన్ని సేకరించారు. ఇందులో 6552 మెట్రిక్ టన్నులు దొడ్డు రకం, 1.08లక్షలు సన్న రకం ధాన్యం ఉంది. 704 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేయగా ఇప్పటి వరకు 657 కేంద్రాలు ప్రారంభమయ్యాయి. 354 సెంటర్లకు ధాన్యం రాక మొదలవ్వగా కొనుగోలు షురూ అయ్యా యి. 3218 మంది రైతులకు రూ.100కోట్లు చెల్లింపులు పూర్తయ్యాయి. మిగిలిన ధాన్యానికి చెల్లింపులు జరగాలంటే ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేయాలి. పీఏసీఎస్, ఐకేపీ సెంటర్లలో సిబ్బంది నిర్లక్ష్యం మూలంగా నమోదు ప్రక్రియ సత్వరం జరగడం లేదు.
ఫలితంగా రైతుకు కనీస మద్ధతు ధర జమ కావడానికి జాప్యం జరుగుతోంది. కామారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు 2,500 మంది రైతుల నుంచి 20వేల మెట్రిక్ టన్నులు వరకు ధాన్యాన్ని సేకరించారు. ఇందులో 6వేల మెట్రిక్ టన్నులు దొడ్డు రకం, మిగిలినది సన్న రకం ధాన్యం ఉంది. 190 ఐకేపీ, 233 పీఏసీఎస్ కేంద్రాలను ప్రారంభించారు. ప్రస్తుతం 124 చోట్ల కొనుగోళ్ల సందడి నెలకొన్నట్లుగా అధికారులు చెబుతున్నారు. కామారెడ్డిలో రూ.40కోట్లు విలువ చేసే ధాన్యాన్ని కొనుగోలు చేయగా రూ.12కోట్లు మేర కనీస మద్ధతు ధరకు చెల్లింపులు పూర్తి చేశారు.
ధాన్యం తడిసి పోయిన రైతులకు అపార నష్టం వాటిల్లుతోంది. మరోవైపు వారం రోజుల పాటు వర్షాలు పడే అవకాశాలున్నట్లుగా వాతావరణ అంచనాలు వెలువడుతున్నాయి. మోంథా తుఫాన్ ప్రభావం ఉత్తర తెలంగాణపైనా ఉండటంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా తడిసి ముద్దవుతోంది. చీటికి మాటికి కురుస్తున్న వర్షాలతో రైతులంతా ఆగమాగం అవుతున్నారు. ధాన్యాన్ని కోయలేక, పొలాల్లో వదిలేయలేక సతమతం అవుతున్నారు. ఆలస్యంగా వరి కోతకు పెడితే చేతికి ధాన్యం రావడం కంటే గింజ రాలిపోయే ప్రమాదం ఏర్పడుతుందనే భయం రైతుల్లో నెలకొన్నది.
ఆలస్యమైతే వర్షపు చినుకులకు గింజ నేల రాలి తమ శ్రమ మట్టిపాలవుతుందనే భయం కూడా రైతులను నిద్ర పోనివ్వడం లేదు. పొంచి ఉన్న వర్షం ముప్పుతో హార్వేస్టర్లతో పంట కోయడం కూడా ఇబ్బందిగానే మారింది. కోసిన ధాన్యాన్ని తరలించడం కష్టతరంగా మారింది. ఇన్ని ఇబ్బందుల మధ్య కోతలు వాయిదా వేసుకుంటే మంచిదనే ఆలోచనతో క్షేత్ర స్థాయిలో రైతులను కామారెడ్డి జిల్లా కలెక్టర్ అప్రమత్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పాలకులు మాత్రం రైతుల అవస్థలను కనీసం పట్టించుకోవడం లేదు. వర్షానికి తడిసిన కర్షకుడి కన్నీటిని ఆలకించకపోవడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.