కరువు సీమలో ప్రగతి సిరులు పరుచుకున్నాయి. ఉమ్మడిరాష్ట్రంలో ఆగమైన బతుకులు తెలంగాణ సిద్ధించాక బాగుపడ్డాయి. కండ్ల ముందు కనిపిస్తున్న ప్రగతి ఫలాలను చూసి పరవశం చెందుతున్నాయి. వెనుకబడిన కామారెడ్డి.. జిల్లాగా ఆవిర్భవించడంతో అభివృద్ధి వరద పారింది. దశాబ్దాల కరువు మాయమైంది. పల్లెలు, పట్టణాల్లో ‘ప్రగతి’ పరుగులు పెడుతున్నది. కార్పొరేట్ తరహా విద్య, వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటికే నర్సింగ్ కళాశాల ప్రారంభం కాగా, వచ్చే ఏడాది నుంచి మెడికల్ కాలేజీ ప్రారంభం కానున్నది. ఏండ్ల సంది పడావుగా ఉన్న భూములు కొత్తకళను సంతరించుకున్నాయి. ఎడారిగా మారిన నిజాంసాగర్.. సీఎం కేసీఆర్ కృషితో జీవం పోసుకున్నది. నాగమడుగు ఎత్తిపోతలతో మంజీర జీవనదిగా మారనున్నది. ఏండ్లుగా నీళ్ల కోసం గోసపడ్డ రైతులు.. నేడు జలసిరులను చూసి మురిసిపోతున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో జిల్లా సాగు రంగంలో దూసుకు పోతున్నది. దగాపడ్డ దళిత జీవితాలకు కేసీఆర్ పాలనలో సరికొత్త వెలుగులు వచ్చాయి. కుల వృత్తులు సాఫీగా మనుగడ సాగిస్తున్నాయి. డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి బాన్సువాడ చిరునామాగా మారింది. స్వయం పాలనకు కొత్త కలెక్టరేట్, పోలీసు భవనాలు నిలువెత్తు నిదర్శనంగా నిలిచాయి. ఇదంతా కేవలం ఎనిమిదేండ్లలో జరిగిన మార్పు.. ఇదీ సీఎం కేసీఆర్ చేసి చూపిన అభివృద్ధి మార్కు.
నిజామాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కామారెడ్డి ప్రాంతం దశాబ్దాలుగా కరువు, కాటకాలతో కొట్టుమిట్టాడింది. ఇక్కడి రైతుల్లో సగానికి ఎక్కువ మంది సాగుకు నీళ్లు లేక భూములను పడీత్గా వదిలేసుకున్న అనుభవాలను ఎదుర్కొన్న వారే. వైవిధ్యమైన పంటలకు నెలవైన ఈ ప్రాంతంలో సాగు నీటి గోస అంతా ఇంతా కాదు. అలాంటి ప్రాంతంలో సీఎం కేసీఆర్ ముందు చూపు ఆలోచనలతో ఒక విధంగా ఇరిగేషన్ సర్క్యూట్‌గా మారిపోయింది. మిషన్ కాకతీయ పథకాలతో చెరువులు బాగుపడి నూతన శోభను సంతరించుకున్నాయి. ఆయకట్టు రైతులంతా రెండు పంటలు పండిస్తూ ఆనందంగా జీవిస్తున్నారు. సమైక్య పాలకుల నిర్వాకంతో బోసిపోయిన నిజాంసాగర్‌కు ఊపిరిపోసి లక్షలాది మందికి సీఎం భరోసా అందించారు. తాజాగా నాగమడుగు ఎత్తిపోతల పథకంతో మరో విధంగా జుక్కల్ ప్రాంతంలో 40వేల ఎకరాలకు నీళ్లు తీసుకురావడంతో కామారెడ్డి నలుమూలల జలకళ సంతరించుకోబోతున్నది. ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోజకవర్గాలకు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా సాగు నీటి గోస తీరబోతున్నది.
వైద్య సేవలను విస్తృతం చేస్తూ ప్రజల ప్రాణాలకు ప్రభుత్వం భరోసానిస్తున్నది. అందులో భాగంగా కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి, బాన్సువాడ దవాఖానల్లో డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేసి కిడ్నీ సంబంధిత వ్యాధిగ్రస్తులకు చేదోడు వాదోడుగా నిలుస్తున్నది. గర్భిణుల్లో రక్తహీనత తగ్గించి, హిమోగ్లోబిన్ శాతం పెంచేందుకు రూపొందించిన న్యూట్రిషన్ కిట్ పథకాన్ని ఇక్కడి నుంచే ప్రారంభించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో మెడికల్ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతోపాటు నిధులు మంజూరు చేసింది. దీంతో పనులు చకచకా జరుగుతున్నాయి. బాన్సు వాడ పట్టణంలో మాతాశిశు సంరక్షణ దవాఖానను ప్రారం భించి తల్లీబిడ్డల సంక్షేమానికి కృషి చేస్తున్నారు. వైద్య విభాగంలో కీలకమైన సేవలందించే నర్సులను తయారు చేసేందుకు బాన్సువాడలో బీఎస్సీ నర్సింగ్ కాలేజీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మంగా దళితబంధు పైలెట్ ప్రాజెక్టును జుక్కల్ నియోజకవర్గంలోని నిజాంసాగర్‌లో అమలు చేసింది. విజయవంతంగా సాగుతున్న యూనిట్ల అభివృద్ధి ఇప్పుడు పరుగులు తీస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో తొలి దశలో 100 మందికి ఈ పథకం ప్రయోజనాలు అందించడంతోపాటు నిజాంసాగర్‌లో దళిత కుటుంబాలందరికీ ఈ పథకం వర్తించింది. కామారెడ్డి జిల్లాలో దాదాపుగా 1650 మందికి లబ్ధి చేకూరింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో నిజాంసాగర్ మండలంలో 1300 మందికి లబ్ధి చేకూరింది. కామారెడ్డి జిల్లాలో 9లక్షల 72 వేల మంది మొత్తం జనాభా కాగా ఇందులో షెడ్యూల్ కులాల వారు లక్షా 53వేల మంది ఉన్నారు. వీరిలో పురుషులు 74,133 మంది, స్త్రీలు 79,169 మంది ఉన్నారు. మొత్తం జనాభాలో ఎస్సీలు 15.76 శాతంగా ఉన్నట్లుగా తేలింది. అత్యంత వెనుకబాటుకు గురైన నిజాంసాగర్‌లో దళితబంధు అందరికీ అమలు కావడంతో ఈ మండలం ఇప్పుడు రోల్‌మాడల్‌గా మారింది.
ఎగువన నిజాంసాగర్ ప్రాజెక్టు ఉన్నప్పటికీ దిగువ ప్రాంత రైతులకు ఒనగూరే ప్రయోజనం శూన్యం. మంజీర అవతలి వైపు విస్తరించి ఉన్న భూభాగంలోకి వరద నీటి మళ్లింపు లేకపోవడంతో వాన నీరు, బోరు బావులే దిక్కు. రెండు పంటలు పండించాలంటే గగనమయ్యే పరిస్థితి. అలాంటి దుస్థితికి చరమగీతం పాడేందుకు మంజీర నదిలో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌కు సీఎం కేసీఆర్ ప్రణాళికను రూపొందించారు. మంజీరలో ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తున్నది. సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఇటీవల శంకుస్థాపన చేయడంతో రైతులంతా ఆనందం వ్యక్తంచేస్తున్నారు. నాగమడుగు ఎత్తిపోతల పథకం ద్వారా ఎంతో మేలు చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రూ.476.25 కోట్లు మంజూరు చేయగా టెండర్ ప్రాసెస్ కూడా ముగిసింది. నాగమడుగుల ఎత్తిపోతల పథకంతోపాటు మంజీరా నదిపై బ్యారేజీ నిర్మాణాలను చేపట్టడంతో జుక్కల్ నియోజకవర్గంలోని 4 మండలాల్లో సుమారు 40వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు నోచుకోనుండడం విశేషం.
నిజాంసాగర్ ప్రాజెక్టుకు కాళేశ్వరం ఎత్తిపోతల పథకం వరప్రదా యినిగా కానున్నది. ఈ చారిత్రక ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 17.802 టీఎంసీలు. దీని కింద ఆయకట్టు 2.30 లక్షల ఎకరాలుండగా ఎగువ నుంచి వరద లేక ఏండ్ల నాటి నుంచి ప్రాజెక్టు పూర్తిగా నిండడం లేదు. 2017లో 10టీఎంసీల నీరు మాత్రమే చేరగా ఆ తర్వాత వరద కరువవ్వడంతో జలకళ తప్పింది. 2020, 2021, 2022లో వరుసగా భారీ వానలతో నిజాంసాగర్ నిండుకుండలా కళకళలాడింది. వచ్చే సీజన్లో ఈ తరహాలో వరద పోటెత్తుతుందా? అన్న నమ్మకం లేదు. ఈ పరిస్థితిలో నిజాంసాగర్‌కు ప్రత్యామ్నాయ మార్గాలే దిక్కు. వరద లేక బోసిపోతున్న నిజాంసాగర్ ప్రాజెక్టుకు కాళేశ్వరం నీటితో సార్థకత చేకూరబోతున్నది. మేడిగడ్డ నుంచి గోదావరి జలాలను సిద్దిపేట జిల్లా సరిహద్దులోని అనంతగిరి రిజర్వాయర్ మీదుగా శ్రీరంగనాయక సాగర్‌లోకి చేరవేస్తారు. ఇక్కడి నుంచి గోదావరి జలాలను మల్లన్నసాగర్ మీదుగా నిజాంసాగర్‌కు తరలించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే కొండపోచమ్మసాగర్ నుంచి నిజాంసాగర్‌కు నీళ్లు వచ్చి చేరా యి. మల్లన్నసాగర్ ద్వారా నీటి విడుదలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
భూగర్భ జలాల లభ్యత పెరగడంతో కామారెడ్డి జిల్లాలో పంటల సాగు సాధారణ విస్తీర్ణం కన్నా మించుతున్నది. 4లక్షల 55వేల ఎకరాల విస్తీర్ణంలో పంటలు సాగవుతాయని అంచనాలుండగా యాసంగిలో ఏకంగా 4లక్షల 70వేల ఎకరాల్లో పంటలు సాగవ్వడం ప్రాధాన్యతను సంతరించుకున్నది. జల వనరులు పుష్కలంగా అందుబాటులో ఉండడంతో యాసంగిలో రందీ లేకుండా రైతులు పంటలు సాగు చేస్తున్నారు. రైతుబంధు ద్వారా 10 విడుతల్లో ప్రతి సీజన్లో 2లక్షల 82వేల మంది వరకు రైతుల ఖాతాల్లో రూ.2100 కోట్లు జమ చేశారు. రైతుల మేలును ఆకాంక్షించి కామారెడ్డి జిల్లాలో నిర్మించిన రైతువేదికలు చక్కగా ఉపయుక్తం అవుతున్నాయి. ఇప్పటి వరకు 8,934 శిక్షణ తరగతులు పూర్తి చేయడమే ఇందుకు నిదర్శనం. 2022-23లో 627 చెరువుల్లో 2.72కోట్ల చేప పిలల్లను విడుదల చేసేందుకు లక్ష్యంగా పెట్టుకొని ప్రభుత్వం యంత్రాంగం పూర్తి చేసింది. మత్స్య కార్మికులకు లాభసాటిగా ఉండేలా నాణ్యమైన విత్తనాన్ని ఎంపిక చేసి చెరువుల్లో వదలడంతో వారికి చేతినిండా ఆదాయాన్ని సమకూర్చింది.
నిజాంసాగర్ ప్రాజెక్టు బోసిపోవడం ద్వారా దిగువన కాలువల్లో నీళ్లు పారకపోవడంతో కుచించుకుపోయాయి. నీటి సవ్వడి లేక కళావిహీనంగా మారిన కాలువలను బాగు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులను మంజూరు చేసింది. తద్వారా రైతుల పొలాలకు సులువుగా నిజాంసాగర్ నీళ్లు పారకం అయ్యేలా చొరవ తీసుకున్నది. నీటి వనరుల లభ్యత అధికం కావడంతో నిజాంసాగర్, పోచారం, కౌలాస్‌నాలా ప్రాజెక్టుల కింద ఉన్న మొత్తం ఆయకట్టుకు నీరందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. నిజాంసాగర్ ప్రాజెక్టు ముఖ్య కాలువలు, ఉప కాలువల ద్వారా ఆధునికీకరణకు రూ.276కోట్లు మంజూరు కాగా పనులు కూడా పూర్తయ్యాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ 22 కింద కామారెడ్డి జిల్లాలో 1.84లక్షల ఎకరాలకు నీరు అందించేందుకు రూ.1446కోట్లతో పనులు జరుగుతున్నాయి. ఇందులో రూ.346కోట్లు వెచ్చించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన డబుల్ బెడ్రూం ఇండ్ల పథకంలో కామారెడ్డి జిల్లా ముందు వరుసలో ఉన్నది. జిల్లాలోని బాన్సువాడ నియోజకవర్గానికి రాష్ట్రంలోనే అత్యధికంగా 11వేల ఇండ్లు మంజూరయ్యాయి. ఇప్పటికే 7వేల ఇండ్లను నిర్మించి పేదలకు అందించడంతోపాటు మరో 4వేల ఇండ్లు నిర్మాణ దశలో ఉండడం విశేషం. సొంత జాగలో ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆర్థికంగా చేయూతనందివ్వడం గమనార్హం. కామారెడ్డి నియోజకవర్గంలోని జంగంపల్లిలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లు విల్లాలను తలపించేలా ఉన్నాయి. ఇలా కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాల్లో డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి పేదలకు సొంతింటి కలను నిజం చేసిందీ ప్రభుత్వం.
కామారెడ్డి పట్టణం విస్తరించడం, జిల్లా అయిన తర్వాత అనూహ్యంగా అభివృద్ధి చెందింది. 14 చదరపు కిలోమీటర్లుగా ఉన్న పట్టణం ఇప్పుడేకంగా 61.50 చదరపు కిలోమీటర్లకు విస్తరించింది. అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం కామారెడ్డి అభివృద్ధికి కోట్లాది రూపాయల నిధులు విడుదల చేసింది. రూ.6 కోట్లతో కళాభారతి ఆడిటోరియం, రూ.4.50 కోట్లతో మోడల్ మార్కెట్, రూ.3 కోట్లతో జంక్షన్ల అభివృద్ధి, రూ.1.65 కోట్లతో సెంట్రల్ లైటింగ్, రూ.1.60 కోట్లతో నాలుగు పార్కులు, రూ.2 కోట్లతో రెండు వైకుంఠధామాల అభివృద్ధి, రూ.5 కోట్లతో పట్టణంలోని ప్రధాన రహదారుల వెంట డ్రైనేజీల నిర్మాణం, రూ.13 కోట్లతో కాలనీల్లో అంతర్గత సీసీ రోడ్లు, మురికి కాలువల ఆధునీకరణ పనులు చేపట్టారు. రూ.2 కోట్లతో హరితహారం, రూ.15 కోట్లతో టేక్రియాల్ నుంచి నర్సన్నపల్లి, నిజాంసాగర్ చౌరస్తా నుంచి లింగాపూర్ వరకు నాలుగు లైన్ల రోడ్లు వేశారు. రూ.15లక్షలతో మున్సిపల్ కార్యాలయ ఆవరణ, గంజ్‌లో స్ట్రీట్ వెండింగ్ జోన్లను ఏర్పాటు చేశారు. ఎనిమిదేండ్లలో రూ.100 కోట్లు మంజూరు చేయడంతో కామారెడ్డి పట్టణ రూపురేఖలు సుందరంగా మారాయి.
కామారెడ్డి జిల్లాలోని పల్లెలు పచ్చదనాన్ని సంతరించుకున్నాయి. పట్టణాలన్నీ మెరుస్తున్నాయి. ప్రభుత్వం నిర్వహిస్తున్న పల్లె, పట్టణ ప్రగతిని సద్వినియోగం చేసుకొని జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ మున్సిపాలిటీలతోపాటు 526 గ్రామాలు మురిసిపోతున్నాయి. వైకుంఠధామాలను సకల వసతులతో అద్భుతంగా నిర్మించారు. డంపింగ్ యార్డు, పల్లె ప్రకృతి వనాలు అందుబాటులోకి వచ్చాయి. నిరంతరం పారిశుద్ధ్య పనులు కొనసాగుతున్నాయి. హరితహారం, నాటిన మొక్కలకు నీరు పోసేందుకు, రోజూవారి చెత్తను తరలించేందుకు ట్రాక్టర్లను సమకూర్చారు.
రాష్ట్రంలో ఎంపిక చేసిన కొన్ని జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వం జిల్లా పోలీస్ భవనాలను నిర్మించింది. ఇందులో కామారెడ్డి ఎస్పీ భవన నిర్మాణం పూర్తికాగా పరిపాలన సైతం రెండేండ్ల క్రితమే మొదలైంది. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా చేపట్టారు. కామారెడ్డి పోలీస్ భవనం అచ్చంగా వైట్‌హౌస్‌ను తలపించేలా జాతీయ రహదారి 44కు ఆనుకొని నిర్మించారు. నూతన కలెక్టరేట్‌కు పక్కనే నెలకొల్పిన ఈ భవనం రాజసం ఉట్టిపడుతోంది. పోలీస్ సేవలకు ప్రతీకగా నిలిచే మూడు సింహాల చిహ్నాన్ని భవనంపై తీర్చిదిద్దారు. సుప్రీంకోర్టు భవనంపై కనిపించే గ్లోబ్ ఆకారంలోని నిర్మాణం జిల్లా ఎస్పీ కార్యాలయం ఎదుట ప్రతిబింబిస్తుంది. ఆరు భారీ స్తంభాలతో ఎస్పీ నూతన కార్యాలయం ముందటి భాగం విశేషంగా ఆకట్టుకుంటున్నది. రూ.15కోట్లతో చేపట్టిన ఈ భవనంలోనే పోలీస్ శాఖకు చెందిన అన్ని విభాగాలను ఒకే చోటికి తీసుకువచ్చారు. కొత్త జిల్లాలో అరకొర వసతులతో ఐదున్నరేండ్లపాటు నెట్టుకొచ్చిన ఖాకీలకు శాశ్వత భవనం అందుబాటులోకి వచ్చింది. జిల్లా పోలీస్ అధికారి భవనం అంటే చూసిన వారంతా వహ్వా అంటూ మురిసిపోతున్నారు.
రాష్ట్రం ఏర్పాటు అనంతరం పరిపాలన వికేంద్రీకరణకు సీఎం కేసీఆర్ అడుగులు వేశారు. ఇందులో భాగంగానే నూతన జిల్లాలను ఏర్పాటు చేశారు. 10 జిల్లాలుగా ఉన్న రాష్ట్రం 33 జిల్లాలుగా రూపాంతరం చెందింది. 2016 అక్టోబర్ 11న పురుడు పోసుకున్న కామారెడ్డి జిల్లాతో ప్రజల ముంగిటకు పరిపాలన ఆరంభమైంది. ఇక్కడ సమీకృత పరిపాలనా భవనాన్ని కలెక్టరేట్ రూపంలో అందుబాటులోకి తీసుకువచ్చారు. రూ.50కోట్లను వెచ్చించి అత్యద్భుతంగా నిర్మించిన కలెక్టరేట్ దర్పంగా కనిపిస్తున్నది. కామారెడ్డిలో ఓవైపు జిల్లా పోలీస్ అధికారి కార్యాలయంతోపాటు మరోవైపు కలెక్టరేట్ భవంతులు పక్కపక్కనే కేసీఆర్ పరిపాలన తీరుతెన్నులకు కేరాఫ్‌గా నిలుస్తున్నాయి. మొత్తం భవనం 1,59,307 చదరపు అడుగులు విస్తీర్ణంలో తీర్చిదిద్దారు. ఇందులో గ్రౌండ్ ఫ్లోర్ విస్తీర్ణం 53,940 చదరపు అడుగులు, మొదటి అంతస్తు విస్తీర్ణం 50,874 చదరపు అడుగులు, రెండో అంతస్తు 54,493 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నది. జాతీయ రహదారి 44 పక్కనే కామారెడ్డి కలెక్టరేట్ రూపుదిద్దుకున్నది.