కామారెడ్డి,జూన్ 15: పొలాల వద్ద మోటర్లకు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడంలో అధికారుల నిర్లక్ష్యం వహించడంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తంచేశారు. మూడు నెలల క్రితం డీడీలు కట్టినా పట్టించుకోవడం లేదంటూ మండిపడ్డారు. కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద తిమ్మక్‌పల్లి గ్రామ రైతులు శనివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ మూడు నెలల క్రితం వ్యవసాయ భూముల వద్ద విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల కోసం డీడీలు కట్టినప్పటికీ ట్రాన్స్ఫార్మర్లను కేటాయించలేదన్నారు.గద్దెలు కట్టారు తప్పా.. ట్రాన్స్ఫార్మర్లు కేటాయించలేదని అన్నారు. వర్షాలు కురిస్తే విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసేందుకు ఇబ్బందులవుతాయని, తమ గ్రామంలోనూ విద్యుత్ సమస్య తీవ్రంగా ఉన్నదని అన్నారు. పొలాలకు కరెంట్ లేకపోవడంతో వరి తుకం ఎండిపోయే పరిస్థితి నెలకొన్నదని వివరించారు. ఏ అధికారి వద్దకు వెళ్లినా నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని అన్నారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో కొంతమంది ఇప్పటి వరకు తుకం వేయలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి రైతులకు కష్టాలు అధికమయ్యాయని ఆరోపించారు. విద్యుత్ అధికారులు వచ్చే వరకు ధర్నా విరమించేది లేదని మెదక్-కామారెడ్డి ప్రధాన రహదారిపై సుమారు రెండు గంటలకుపైగా బైటాయించి రైతులు నిరసన తెలిపారు. ఇరువైపులా ట్రాఫిక్ స్తంభించడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రైతులను సముదాయించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.
వ్యవసాయ భూముల వద్ద విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల కోసం డీడీలు కట్టి మూడు నెలలు అవుతుంది. అయినా కూడా అధికారులు ఇప్పటి వరకు స్పందించలేదు. కనీసం ఇక్కడికి వచ్చి మా సమస్యలను పరిష్కరించలేదు. మాకు పరిహారం చెల్లించాలి.
మూడు నెలల క్రితం ట్రాన్స్ఫార్మర్ల కోసం డీడీ కట్టినప్పటికీ అధికారులు స్పందించడం లేదు. కరెంట్ లేకపోవడంతో వరి తుకం ఎండిపోయే పరిస్థితి ఉన్నది. ఇకనైనా అధికారులు స్పందించి మా సమస్యలు పరిష్కరించాలి.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకునే వారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ నాయకుడూ మా బాధను పట్టించుకోవడం లేదు.ట్రాన్స్ఫార్మర్లు లేక చాలా మంది రైతులు ఇబ్బందిపడుతున్నారు.అధికారులు, నాయకులు పట్టించుకోవడం లేదు.