నిజామాబాద్, ఏప్రిల్ 30, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో రియల్ ఎస్టేట్ రంగం కుదేలవుతోంది. గడిచిన 28 నెలలుగా పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. చేతిలో డబ్బులు ఉండి వివిధ ప్రాంతాల్లో పెట్టుబడి పెట్టిన వారంతా బేల చూపులు చూస్తున్నారు. క్రయ, విక్రయాలు లేక చేతిలో చిల్లిగవ్వ లేక కొట్టుమిట్టాడుతున్నారు. రియల్ వ్యాపారులైతే బ్యాంకుల్లో, ఫైనాన్షియర్ల వద్ద వడ్డీలకు డబ్బులు తెచ్చి నిర్మాణాలు చేపట్టారు. పరిస్థితుల్లో గందరగోళం చోటు చేసుకోవడం, కొనుగోళ్లకు ప్రజల నుంచి డిమాండ్ లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉవ్వెత్తున ఎగిసిన రియల్ ఎస్టేట్ రంగం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పాతాళానికి చేరుకోవడంతో ఈ రంగానికి చెందిన వారంతా నిట్టూరుస్తున్నారు. సుమారుగా రెండేళ్లుగా దారుణమైన దుస్థితిలో పడిపోయిన రియల్ మార్కెట్ క్రయ, విక్రయాలతో అప్పులు చేసిన రియల్ వ్యాపారులంతా చతికిల పడిపోతున్నారు. దిక్కూమొక్కూ లేకుండా పోతున్న రియల్ ఎస్టేట్ రంగంతో చాలా మంది విలవిల్లాడుతున్నారు. ప్రజల అవసరాలకు మించి నిర్మాణాలు, అడ్డగోలుగా పెంచిన ధరలు సైతం జనాలను ఆకట్టుకోకపోవడానికి కారణాలుగా నిలుస్తున్నట్లుగా పలువురు భావిస్తున్నారు. ఇష్టానుసారంగా నిర్మాణాలు చేసి సామాన్యులు కొనలేనంతగా ధరలు పెంచడం కూడా ఈ పరిస్థితికి మూలంగా తెలుస్తోంది.
హైదరాబాద్‌కు వంద కిలో మీటర్ల దూరంలో ఉన్న కామారెడ్డి జిల్లా కేంద్రంలోనూ రియల్ బూమ్ అంతా ఢాం అన్నట్లుగా మారింది. ఈ ప్రాంతంలోని జనాలంతా చాలా మంది హైదరాబాద్ శివారు కొంపల్లి, మేడ్చల్ పరిసరాల్లో ఎక్కువగా పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. రాష్ట్ర రాజధానిలోనూ ఇదే అనిశ్చితి ఉండటంతో రియల్ బ్రోకర్లు, ఏజెంట్లు విలవిల్లాడుతున్నారు. గతంలో నెలకు రెండు నుంచి నాలుగైదు క్రయ, విక్రయాలు చేసే రియల్ ఏజెంట్లు ఇప్పుడు కేవలం ఒకటితోనే బొటాబొటిన సరిపెట్టుకుంటున్నారు. ఆదాయం లేక రియల్ రంగంపై ఆధారపడిన జీవులు చితికి పోతున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఉద్యోగులు, వ్యాపారాలు చేసే వారంతా దిగజారిన రియల్ రంగాన్ని అవకాశంగా వాడుకుంటున్నట్లుగా తెలుస్తోంది. పతనమైన ధరలను ఆసరాగా చేసుకుని పెట్టుబడికి ఆసక్తి చూపుతున్నట్లుగా సమాచారం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి పదేళ్లు భారీగా పెరిగిన రియల్ రంగం ఇప్పుడు నేల చూపులు చూడటంపై ప్రజల్లో విస్తృతమైన చర్చ జరుగుతోంది. జిల్లాల విభజనతో కామారెడ్డిలో మార్కెట్ ఆకాశానికి చేరగా ఇప్పుడు నేలమట్టం కావడం కలవరానికి గురి చేస్తోంది. వ్యవసాయ భూముల్లోనూ పెట్టుబడులకు గతంలో పరుగులు తీసిన వ్యక్తులెవ్వరూ ఇటువైపే చూడటం లేదు. రూ.కోట్లు పలికిన వ్యవసాయ భూములు సైతం దిగజారుతుండటంతో పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కొత్తగా కొలువైన ప్రభుత్వం ఆశించినంతగా పనితనాన్ని చూపించకపోవడం, రైతులకు భరోసా కల్పించే స్కీములను అమలు చేయకపోవడం వంటి కారణాలు ఈ రంగంపై ప్రభావం చూపుతున్నట్లుగా నిపుణులు అంచనా వేస్తున్నారు.
నిజామాబాద్ నగరంలో అపార్ట్మెంట్ కల్చర్ భారీగా పెరిగింది. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వలస వస్తున్న వారితో పాటుగా విదేశాల్లో ఉన్న కుటుంబాలు తమ తల్లిదండ్రుల కోసం అపార్ట్మెంట్ ఇళ్లపైనే దృష్టి సారించారు. ఇందులో కుటుంబాలకు భద్రతతో పాటుగా సామాజిక సంబంధాలు పెరగడం వంటి అనుకూలతలు ఉన్నాయి. వ్యక్తిగత ఇళ్లలో భద్రత కొరవడటంతో పాటుగా పక్కింటి వారు కూడా పట్టించుకునేంత పరిస్థితులు ఇప్పుడు లేకుండా పోయాయి. దీంతో నిజామాబాద్ వంటి నగరాల్లోనూ ఇదే సంస్కృతి విస్తృతమైంది. రెండేళ్ల క్రితం వరకు విపరీతమైన డిమాండ్ ఏర్పడిన అపార్ట్మెంట్లకు ఇప్పుడు ఒక్కసారిగా డీలా పడిపోయింది. డిమాండ్ కంటే ఎక్కువగా అపార్ట్మెంట్లు నిర్మాణం జరగడం ఇందుకు ప్రధాన కారణం. బైపాస్ రోడ్డు, వినాయక్‌నగర్, మాధవనగర్, ఆర్యనగర్, మారుతి నగర్, గంగాస్థాన్ ఫేజ్ 1, గంగాస్థాన్ ఫేజ్, ముబారక్ నగర్ ఇలా నగరంలో ఏ మూలకు వెళ్లినా అపార్ట్మెంట్లు విచ్చలవిడిగా కట్టేశారు. ఒక్కో అపార్ట్మెంట్లో 45 ఫ్లాట్ల నుంచి 125, 150 వరకు ఫ్లాట్లను అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుతం 1000 ఫ్లాట్లు నగర వ్యాప్తంగా అందుబాటులో ఉండగా కేవలం 100 నుంచి 200 మంది కొనుగోలు దారులే అందుబాటులో ఉన్నారు. ఫలితంగా నిర్మాణాలు చేపట్టిన వారంతా లబోదిబోమంటున్నారు. కోకొల్లలుగా వ్యవసాయ భూములను వెంచర్లుగా మార్చిన చోట కూడా ఓపెన్ స్థలాల విక్రయాల్లోనూ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా ఉంది.