అరుదుగా కనిపించే కృష్ణ జింకలు జీవించలేకపోతున్నాయి. గోదావరి తీరాన కనువిందు చేసే జింకలు కనుమరుగవుతున్నాయి. వేలల్లో ఉండే జింకలు ఇప్పుడు వందలకు చేరాయి. ఇలాగే చూస్తూ పోతే ఈ ప్రాంతంలో పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి నెలకొన్నది. నిత్యం కుక్కల దాడులకు బలి అవుతున్నాయి. కృష్ణ జింకలు, అరుదైన పక్షులకు నెలవైన గోదావరి నదీ తీరాన్ని అందమైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని చెబుతున్న అటవీ అధికారులు.. జింకలను కాపాడేందుకు ఏమాత్రం ప్రయత్నం చేయకపోవడంతో విడ్డూరం. పర్యాటక కేంద్రం దేవుడెరుగు కనీసం ఉన్న జీవాలను కాపాడకపోవడంపై విమర్శలు గుప్పుమంటున్నాయి.
నిజామాబాద్ జిల్లా నందిపేట మండలంలో శ్రీరాంసాగర్ బ్యాక్‌వాటర్ ప్రాంతం పర్యాటకులకు ఆహ్లాదం పంచుతున్నది. పక్షుల కిలకిలరావాలు.. కృష్ణజింకల సయ్యాటలు..ఇతర వన్యప్రాణుల విహారాలు కనువిందు చేస్తాయి. గత కొన్నిరోజులుగా గోదావరి తీర ప్రాంతంలోని కృష్ణజింకలను ఊర కుక్కలు వేటాడుతున్నాయి. దప్పిక తీర్చుకునేందుకు వచ్చే క్రమంలో జింకలు బురదలో ఇరుక్కుపోతున్నాయి. ఇదే సమయంలో కుక్కలు వేటాడి చంపుతున్నాయి.
నందిపేట్, డొంకేశ్వర్, నవీపేట్ మండలాల్లోని గోదావరి నదీ తీర ప్రాంతం ఎంతో సువిశాలంగా వేలాది ఎకరాల్లో విస్తరించి ఉన్నది. వానకాలంలో గోదావరి నది నిండుగా ఉంటుంది. తర్వాత నదిలో కొంత నీళ్లు తగ్గి నేల బయటపడుతుంది. గోదావరి తీర ప్రాంతం బాసర నుంచి గాదేపల్లి వరకు సుమారు 25కిలోమీటర్ల మేర వేలాది ఎకరాల్లో పచ్చని గడ్డితో నిండిపోయి ఉంటుంది. గోదావరి నదికి ఆ పక్క ఒడ్డున ఉన్న నిర్మల్ జిల్లా లోకేశ్వర్, ముథోల్ మండలాలకు చెందిన గ్రామాల్లోనూ ఇదే విధంగాఉంటుంది. మేతకు గడ్డి దొరకడంతోపాటుగా సహజ శత్రువులు నక్కలు, తోడేళ్లు, చిరుతలు, పెద్ద పులులు ఈ ప్రాంతంలో లేకపోవడంతో నదికి రెండువైపులా కృష్ణ జింకల సంతతి వేలాదిగా పెరిగింది. అంతేకాకుండా గోదావరి తీరంలో ఉన్న పొదలు, అక్కడక్కడా ఉన్న ఎత్తయిన ప్రదేశాల్లో జీవాలు తలదాచుకోవడానికి అనువుగా ఉండడంతో జింకలు ఈ ప్రాంతంలోనే ప్రశాంతంగా జీవిస్తున్నాయి. వానకాలంలో నీటి ప్రవాహం పెరగడంతో రెండు, మూడు నెలలు కొంత ఇబ్బంది ఏర్పడినా తర్వాత ఏడాదంతా జింకలకు మంచి అనువైన పరిస్థితులే ఉంటాయి. గత రెండేండ్లుగా జింకలపై కుక్కల దాడులు పెరిగిపోయాయి. కుక్కలు గ్రామాల్లోంచి గోదావరి తీరప్రాంతానికి గుంపులుగా వెళ్లి జింకలను వెంటాడుతున్నాయి. జింకలు పరుగెత్తుతూ నది నీళ్ల దగ్గరికి వెళ్లినప్పుడు మెత్తని మట్టిలో వాటి కాళ్లు పైకి లేవకపోవడంతో కుక్కలకు సులభంగా దొరికిపోతున్నాయి. సుమారు 3వేల వరకూ ఉండే జింకలు కుక్కల దాడులతో ఇప్పుడు వందల సంఖ్యకు తగ్గిపోయాయి.
గోదావరి నదీ తీరం జింకలతోపాటు అరుదైన పక్షులకు నెలవు. ప్లెమింగో, పెలికాన్, కామన్ క్రేన్, సముద్రపు పక్షులు, ఇతరత్రా అరుదైన పక్షులు గోదావరి తీరానికి వేల సంఖ్యల్లో వస్తుంటాయి. వేసవికాలంలో వాటి సంచారం ఎక్కువగా ఉంటుంది. పచ్చనిగడ్డి పక్కన నది నీళ్లు.. గుంపులుగా పరిగెత్తే జింకలు, నెమళ్లు, నది ఒడ్డున పక్షులు చూపరులను కట్టిపడేసే ఈ అందాలను వీక్షించేందుకు ఎందరో ప్రముఖులు ఈ ప్రాంతాలకు వస్తుంటారు. పదుల సంఖ్యలో రాష్ట్రస్థాయి అధికారులు పర్యటించారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితోపాటు ఉన్నతస్థాయి అధికారులు సందర్శించారు. వేసవికాలంలో పర్యాటకులు జీప్లలో పర్యటిస్తూ పెద్దపెద్ద కెమెరాల్లో ఇక్కడి అందాలను బంధిస్తుంటారు. శని, ఆదివారాల్లో హైదరాబాద్‌తోపాటు ఆయా ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తున్నారు. ఈ ప్రాంతం అందాలు బయటి ప్రపంచానికి మొన్నటి వరకూ తెలియలేదు. రెండేండ్ల క్రితం నిజామాబాద్‌కు చెందిన వైల్డ్‌లైఫ్ ఔత్సాహిక ఫొటోగ్రాఫర్ సంతోష్ తీసిన ఫొటోలు, వీడియోలు జాతీయస్థాయి మీడియాలో ప్రచురితం కావడంతో ఈ ప్రాంతానికి పర్యాటక కేంద్రంగా గుర్తింపు వచ్చింది. కుక్కల బారి నుంచి జింకలను కాపాడేందుకు అటవీశాఖ అధికారులు ఏమాత్రం చర్యలు చేపట్టకపోవడంపై తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి.