మార్కెట్లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. వానాకాలంలో ఎండలకు దీటుగా వాటి ధరలు సైతం సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. రూ.500 వెచ్చిస్తే కానీ ఇంటికి సరిపడా కూరగాయలు రావడం లేదంటే అతిశయోక్తి లేదు. ఆకుకూరలు, కాయగూరలు ఏవి ముట్టుకున్నా రూ.100వరకు కిలో చొప్పున పలుకుతున్నాయి. దీంతో మధ్య తరగతి కుటుంబాలైతే తీవ్రంగా ఇబ్బంది పడాల్సి వస్తున్నది. బెండకాయ, వంకాయ, దొండకాయలతో మొదలుపెడితే మెంతి, పాలకూర, తోటకూర ఇలా ఏ రకమైన కూరగాయలైనా కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ముందు చూపులేనితనం, వారి వైఫల్యాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తున్నది. యాసంగి సీజన్ నుంచి పంట పొలాలకు సాగునీటి కొరతతో కూరగాయల సాగు భారీగా తగ్గింది. ప్రభుత్వాల ప్రోత్సాహం లేకపోవడం.. ఉత్పత్తి తగ్గడంతో డిమాండ్‌కు సరిపడా కూరగాయలు ప్రజల అవసరాలను తీర్చడం లేదు. దీంతో మార్కెట్లో ప్రజల అవసరాన్ని గుర్తించిన మధ్యవర్తులు రంగంలోకి దిగి హెచ్చు ధరలతో అమ్ముతున్నారు. రైతులకు అరకొర లాభాలే వస్తున్నప్పటికీ దళారులు భారీగా ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారు.
పచ్చిమిర్చి ధర రూ.100కు చేరింది. కోయక ముందే కండ్లవెంట మంట తెప్పిస్తున్నది. టమాట సైతం వందకు చేరువైంది. మార్కెట్లో కిలోకు రూ.80 వసూలు చేస్తున్నారు. నిన్నా మొన్నటి వరకు రూ.25కే కిలో ఉల్లిగడ్డలు లభించాయి. ఇప్పుడు ఏకంగా రూ.42కు చేరింది. దొండకాయ, వంకాయలు కిలోకు రూ.50, గోబిగడ్డ ఒక్కటి రూ.35 నుంచి రూ.50 వరకు లభిస్తున్నది. బెండకాయలు రూ.65, క్యాప్సికం కిలోకు రూ.100 పలుకుతున్నాయి. సోరకాయ ధర చిన్న సైజు ధర రూ.30 నుంచి రూ.40 తక్కువకు రావడం లేదు. గోరు చిక్కుడు కిలోకు రూ.80, మునక్కాడలు కట్ట(నాలుగింటికి) రూ.30 చొప్పున ధర పలుకుతున్నది. ఆకుకూరలకు సైతం అదే స్థాయిలో ధరలుంటున్నాయి. ఒకప్పుడు రూ.100తీసుకెళ్తే వారం రోజులకు సరిపడా కూరగాయలు ఇంటికి తీసుకెళ్లేది. ఇప్పుడు అది ఉట్టి మాటగానే మిగిలిపోయింది. జేబులో రూ.500 లేకపోతే ఇంటికి నాలుగైదు రోజులకు సరిపడా కూరగాయలు తీసుకెళ్లడం గగనమైంది. వారం రోజుల క్రితం వరకు కూరగాయల ధరల్లో కాసింత తగ్గుదల కనిపించింది. కానిప్పుడు అకస్మాత్తుగా ధరల్లో వ్యత్యాసం కనిపిస్తున్నది. ఒక్కసారిగా పెరిగిన ధరలతో ఏం కొనేటట్టు లేదు… ఏం తినేటట్టు లేదంటూ ప్రజలంతా నిట్టూర్చాల్చి వస్తున్నది.
ఆరుగాలం శ్రమించి కూరగాయలు సాగు చేసిన రైతులకు లాభాలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. అరకొర ధరలకే దళారులకు కూరగాయలను విక్రయిస్తున్నారు. మార్కెట్‌కు చేరిన వాటి ధరలు ఒక్కసారిగా 40 నుంచి 50 శాతం పెరుగుదలతో రిటైల్ కూరగాయల వ్యాపారుల చేతికి వస్తున్నాయి. వారి నుంచి విక్రయానికి గురవుతున్న కూరగాయలు ఒక్కసారిగా హెచ్చు ధరలతో ప్రజల ముంగిట కనిపిస్తుండడంతో ఊహించని భారం పడుతున్నది. ఓ వైపు ద్రవ్యోల్భణం ప్రభావం మూలంగా ఈ పరిస్థితిలో మార్పు నెలకొన్నది. అనుకూలించని వాతావరణంతోపాటు సాగుకు రాష్ట్రంలో ప్రోత్సాహం కరువైంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ సాగునీటికి గోస ఏర్పడింది. దీంతో బోరు బావులున్న ప్రాంతాల్లో కూరగాయల సాగు జరుగుతున్నప్పటికీ ఎదురవుతున్న ఇక్కట్లతో కూరగాయల సాగు ముళ్లబాటగా మారింది. దీంతో ఉత్పత్తి గణనీయంగా తగ్గడంతోనూ ఈ దుస్థితి నెలకొన్నట్లుగా పరిశీలకులు చెబుతున్నారు. ఉద్యానవన శాఖ అధికారులు కేవలం ఉత్సవ విగ్రహాల మాదిరిగా తయారయ్యారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆదర్శ రైతులను కూరగాయల సాగు వైపు ప్రోత్సహించడంలో వైఫల్యం చెందుతున్నారు. తద్వారా మార్కెట్లో డిమాండ్‌కు సరిపడా కూరగాయలు అందుబాటులో లేకుండా పోయాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే సామాన్యుల జీవితాలు విలవిల్లాడడం ఖాయంగా కనిపిస్తున్నది.
కోటగిరి, జూన్ 18: అంగట్లో కూరగాయల ధరలు చాలా పెరిగాయి. మొన్నటి వరకు కిలో టమాట రూ.10-20 ఉంటే ఈరోజు ఒక్కసారిగా కిలో రూ.60 నుంచి 80 పలుకుతున్నది. కిలో పచ్చిమిర్చి రూ.120 పలుకుతున్నది. చివరికి తోచింది తీసుకెళ్తున్నా. పెరిగిన ధరలను చూసి పప్పులు తింటున్నాం. ఇప్పుడే ఇలా ఉంటే రాబోవు రోజుల్లో ఇంకా ఎంత పెరుగుతాయోననే భయంగా ఉన్నది.
కూరగాయల కోసం రూ.500లు తీసుకెళ్తే చిన్న సంచి కూడా నిండడం లేదు. ఏ వంట చేసినా టమాట వేయడం తప్పనిసరి. మొన్నటి వరకు తక్కువగా ఉండగా ఇప్పుడు ఏకంగా రూ.60-80కి పెరిగింది. వారానికి రెండు మూడు కిలోలు కొనేవాళ్లం. ఇప్పుడు పావు కిలో తీసుకెళ్తున్నాం. వంటలో కూడా వేయడం లేదు. ధరలు పెరిగితే ఏం కొనలేం.. ఏం తినలేం..
అంగట్లో కూరగాయల ధరలు బాగా పెరిగాయి. మొన్నటి వరకు టమాట కిలో రూ.20-40 ఉండగా ఇప్పుడు రూ.60-80 పలుకు తుంది. రూ.500 తీసుకొని అంగడికి పోతే సంచి నిండా కూరగాయలు వచ్చేవి. ఇప్పుడు అదే 500 తీసుకొస్తే ఏం వస్తలేవు. నాలుగు రకాల కూరగాయలు మాత్రమే కొంటున్నాం. పచ్చిమిర్చి కిలో రూ.120 అయ్యింది. ప్రతి కూరగాయ ధర వందకు పైగా పెరిగింది. కిలోల చొప్పున కొనుగోలు చేసేవారు కూడా పావుకిలో, అర కిలోతో సరిపెట్టుకోవాల్సి వస్తున్నది.