మాచారెడ్డి,సెప్టెంబర్ 25 : కామారెడ్డి నియోజకవర్గం నుంచి బరిలో ఉంటానని బీఆర్ఎస్ అధినేత ప్రకటించినప్పటి నుంచి మాచారెడ్డి, పాల్వంచ, రామారెడ్డి మండలాల్లో ఏకగ్రీవ తీర్మానాలు జోరందుకున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే గ్రామాల్లో ఎన్నికల సందడి నెలకొన్నది. సీఎం కేసీఆర్‌ను కామారెడ్డి నుంచి భారీ మెజారిటీతో గెలిపించుకుంటే తమ గ్రామాలు మరింత అభివృద్ధి చెందుతాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. సారే రావాలి…కారే గెలవాలి అనే పట్టుదలతో కుల సంఘాలు ఏకగ్రీవంగా తీర్మానాలు చేస్తున్నాయి.
ఇప్పటికే 16 గ్రామాల్లో ఏకగ్రీవ తీర్మానాలు
ఉమ్మడి మాచారెడ్డి మండలంలోని ఎల్లంపేట, నడిమి తండా, నెమ్లిగుట్టతండా, బోడగుట్టతండా, అంకిరెడ్డిపల్లి తండా, మైసమ్మచెరువు తండా, గుంటి తండా, ఒడ్డెరగూడెం తండా, రాజ్‌ఖాన్‌పేట, మంథనిదేవునిపల్లిలో ఇప్పటికే తీర్మానించగా ఆరెపల్లి గ్రామంలో పది కుల సంఘాలు యేలేటి వారి, గడ్డంవారి సంఘం, వెలమ, పద్మశాలీ, ముదిరాజ్, ఎస్సీ, గొల్ల, కుర్మ, గౌడ, యూత్ సంఘాలు, లక్ష్మీరావులపల్లి గ్రామంలో అధిక సంఖ్యలో ఉన్న ముదిరాజ్ కులస్తులు సీఎం కేసీఆర్ వెంటే ఉంటామంటూ తీర్మాన ప్రతులను ఎంపీపీ నర్సింగ్‌రావు, జడ్పీటీసీ రాంరెడ్డికి ఇప్పటికే అందజేశారు. ప్రజాప్రతినిధులు తీర్మాన కాపీలను ఎమ్మెల్సీ కవితకు అందజేశారు.
తాజాగా 11 కుల సంఘాల తీర్మానం
మాచారెడ్డి మండలంలోని ఘన్పూర్ గ్రామంలో సోమవారం పర్యటించిన ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్‌కు ముదిరాజ్, యాదవ, గౌడ, విశ్వబ్రాహ్మణ, వెలమ, గంగపుత్ర, రజక, మాల సాడెం, మాల సల్ల సంఘం, మాదిగ మద్దికుంట సంఘం,మాదిగ సిరికొండ సంఘం సభ్యులు సీఎం కేసీఆర్‌కు మద్దతు ప్రకటిస్తామని ఏకగ్రీవ తీర్మాన ప్రతులను అందజేశారు. ఈ సందర్భంగా కులసంఘాల వారికి విప్ గంప ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్‌కు దీటుగా కామారెడ్డి చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు.
ప్రతి పక్షాల అడ్రస్ గల్లంతు తప్పదు
ఉమ్మడి మాచారెడ్డి మండలంలోని 17 గ్రామాల్లో కులసంఘాల తీర్మానాలను బట్టి చూస్తే ప్రతిపక్ష పార్టీల అడ్రస్ గల్లంతు ఖాయంగా కనిపిస్తున్నది. కనీసం ప్రతిపక్ష పార్టీలకు డిపాజిట్లు కూడా రాకుండా గంప గుత్తగా సీఎం కేసీఆర్ కు ఓటు వేసి కామారెడ్డి నుంచి భారీ మెజారిటీ సాధించి చరిత్ర సృష్టిస్తామని ఆయా గ్రామాల ప్రజలు అంటున్నారు. గ్రామాల్లో బీఆర్ఎస్కు లభిస్తున్న స్పందన చూసి ఓర్వలేని కాంగ్రెస్, బీజేపీ నాయకులు సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారు. వాటిని బీఆర్ఎస్ సోషల్ మీడియా సైన్యం గట్టిగానే తిప్పికొడుతున్నది.
గ్రామాగ్రామాన సీఎం కేసీఆర్‌కు మద్దతు
గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే గ్రామాల్లో తీర్మానాల జోరు కొనసాగుతున్నది. దేశంలో ఏ నాయకుడికి లభించని విధంగా సీఎం కేసీఆర్‌కు ఏకగ్రీవ తీర్మానాలతో స్వాగతం పలుకుతున్నారు. సీఎం కేసీఆర్ ఇక్కడి నుంచి పోటీ చేస్తానని చెప్పడం తమ ప్రాంతానికి దక్కిన అరుదైన గౌరవమని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. గజ్వేల్,సిరిసిల్ల, సిద్దిపేట నియోజకవర్గల కన్నా రెట్టింపు అభివృద్ధి ఇక్కడ జరగబోతుందని ఆకాంక్షిస్తున్నారు.