బడీడు పిల్లలను పాఠశాలల్లో చేర్పించడానికి ఈ నెల 6 నుంచి 19 వరకు బడి బాట కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. 6న గ్రామసభలు, 7న ప్రతి ఇంటిని సందర్శించి బడీడు పిల్లలను గుర్తించాలి. 8 నుంచి 10 వ తేదీ వరకు కర పత్రాలతో ఇంటింటి ప్రచారం, 11వ తేదీన అప్పటివరకు నిర్వహించిన కార్యక్రమాలపై సమీక్ష చేపట్టాలి. 12వ తేదీన అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ఆధ్వర్యంలో చేపట్టిన పనులను ప్రారంభించాలి. అదే రోజు విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫాంలు అందజేయాలి.13వ తేదీన సామూహిక అక్షరాభ్యాసం,16వ తేదీన ఎఫ్ఎల్ఎన్ అండ్ ఎల్ఐపీ దినోత్సవం నిర్వహించాలి. 17వ తేదీన విలీన విద్య, బాలికా విద్యా దినోత్సవం, 18న డిజిటలీకరణపై అవగాహన, మొక్కల పెంపకం ప్రాధాన్యంపై విద్యార్థులకు వివరించాలి. 19న బడిబాట ముగింపు సందర్భంగా విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించాలి.
కామారెడ్డి, జూన్ 5 : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్ది, విద్యార్థుకు నాణ్యమైన బోధనతోపాటు మెరుగైన వసతులను కల్పించారు.దీంతో ప్రభుత్వ బడులకు ఆదరణ పెరిగి ప్రవేశాలకు డిమాండ్ ఏర్పడింది. ఉమ్మడి జిల్లాలో పేద విద్యార్థుల ముంగిటకే కార్పొరేట్ విద్యను ఉచితంగా అందుబాటులోకి తెచ్చి, వారికి కొండంత అండగా నిలిచింది. అనేక సంస్కరణలు చేపట్టి విద్యా వ్యవస్థను గాడిలో పెట్టడంతో ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఉత్తీర్ణత శాతం గణనీయంగా పెరిగింది.
ఉదయం పూట అల్పాహారం,సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం,రెండు జతల దుస్తులు, పుస్తకాలు ఇలా అన్ని రకాల వసతులను పేద విద్యార్ధులకు అందజేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సర్కార్ బడులపై చిన్నచూపు చూస్తున్నది. సౌకర్యాల కల్పనలో నిర్లక్ష్యం చేస్తున్నది. విద్యార్థులకు అల్పాహారాలు లేకుండానే పాఠశాలలను నడుపుతున్నారు. దీంతో విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులకు వేసవి సెలవుల్లో విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలనే ఉద్దేశంతో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో నైనా ప్రభుత్వ పాఠశాలలు బాగుపడతాయా లేదా అనేది చూడాల్సి ఉంది.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన బడిబాట ద్వారా వేల సంఖ్యలో బడీడు పిల్లలను బడుల్లో చేర్పించారు. దీంతో ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ సంవత్సరం కూడా చేపడుతున్న బడిబాట కార్యక్రమం ద్వారా ప్రవేశాలు పెరుగుతాయని విద్యాశాఖాధికారులు భావిస్తున్నారు. గతేడాది నుంచి విద్యార్థుల సంఖ్య తగ్గుతూ వస్తున్నది. తూతూ మంత్రం గా బడిబాట నిర్వహిస్తారా లేదా విద్యార్థులను బడిలో చేర్పిస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది.
కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా రాష్ట్ర సర్కార్ ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని రకాల వసతులు కల్పిస్తున్నది. ప్రైవేట్ పాఠశాలలకు ఆకర్షితులు కావొద్దని ప్రభుత్వం ప్రతి పేదింటి బిడ్డకు కార్పొరేట్ విద్యను అందించాలనే లక్ష్యంతో పని చేస్తున్నది. ఈ నెల 6 నుంచి 19వ తేదీ వరకు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించనున్నాం.
-రాజు, డీఈవో, కామారెడ్డి