నాగిరెడ్డిపేట, జనవరి 6: నాగిరెడ్డిపేట తహసీల్ కార్యాలయానికి వరుసగా అవినీతి మరకలు అంటుతూనే ఉన్నాయి. 2024లో ఎనిమిది నెలలపాటు ఇక్కడ తహసీల్దార్‌గా విధులు చేపట్టిన లక్ష్మణ్ రెవెన్యూ పనుల కోసం కార్యాలయానికి వచ్చిన రైతుల నుంచి పెద్ద మొత్తంలో లంచాలు తీసుకుంటున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో రైతులు తహసీల్ ఆఫీస్ ఎదుట ఆందోళన చేపట్టారు. దీనిపై స్వయంగా విచారణ చేపట్టిన కలెక్టర్ వెంటనే తహసీల్దార్ లక్ష్మణ్ అదే ఏడాది ఆగస్టులో విధుల నుంచి సస్పెండ్ చేశారు.
ఆయన స్థానంలో వచ్చిన శ్రీనివాస్‌రావు 14 నెలలుగా తహసీల్దార్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన కూడా ఓ వ్యక్తి నుంచి రూ.50వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులకు పట్టుపడడం మండలంలో సంచలనం సృష్టించింది. మండలానికి వచ్చిన తహసీల్దార్లు వరుసగా అవినీతికి పాల్పడుతూ పట్టుబడుతుండ డం చర్చనీయాంశంగా మారిం ది. గత నెలలో ఎంపీడీవో అధికారిణి లలితకుమారి, ఎంపీవో ప్రభాకర్ సైతం ఎన్నికల విధు ల్లో నిర్లక్ష్యం కారణంగా సస్పెన్షన్‌కు గురైన విషయం తెలిసిందే. మండలంలో వరుసగా అధికారులపై వెల్లువెత్తుతున్న అవినీతి ఆరోపణలు, వారి వ్యవహారాల తీరుపై మండలవాసులు చర్చించుకుంటున్నారు.

రూ.50వేలు లంచం తీసుకుంటూ
నాగిరెడ్డిపేట తహసీల్దార్ శ్రీనివాస్‌రావు రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు మంగళవారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టబడ్డారు. వ్యవసాయ భూమిని తనకు అనుకూలంగా మార్చడానికి ఓ వ్యక్తి నుంచి డబ్బులు తీసుకుంటుండగా వలపన్ని పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. నాగిరెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి తన తండ్రి పేరుమీద ఉన్న వ్యవసాయ భూమిని తన పేరుమీద మార్చడానికి దరఖాస్తు చేసుకున్నాడు.
అనుకూలంగా నివేదిక ఇవ్వడానికి తహసీల్దార్ శ్రీనివాస్‌రావు రూ.50వేలు డిమాండ్ చేశారు. దీంతో దరఖాస్తుదారుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచన మేరకు దరఖాస్తుదారుడు రూ.50వేలు తీసుకొని మంగళవారం కార్యాలయంలోకి వెళ్లి అజయ్ అనే ప్రైవేట్ వ్యక్తికి ఇచ్చాడు. అజయ్ నుంచి తహసీల్దార్ శ్రీనివాస్‌రావు డబ్బులను స్వీకరిస్తుండగా అక్కడే మాటువేసి ఉన్న ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. భద్రత కారణాల దృష్ట్యా ఫిర్యాదుదారుడి వివరాలను గోప్యంగా ఉం చుతున్నట్లు డీఎస్పీ తెలిపారు. తహసీల్దార్ శ్రీనివాస్‌రావుతోపాటు అజయ్‌ను అరెస్టు చేసి హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టులో హాజరుపర్చనున్నట్లు పేర్కొన్నారు.
తహసీల్దార్ ఇంట్లో సోదాలు
తహసీల్దార్‌కు సంబంధించిన హైదరాబాద్ కూకట్‌పల్లిలో ఉన్న ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం అడిగినా, అవినీతికి పాల్పడుతున్నా ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు ఫోన్ చేసి సమాచారం అందించాలని సూచించారు.