కామారెడ్డి, మే 21 : రోజురోజుకూ భానుడు ఉగ్రరూపం దాలుస్తున్నాడు. ఉదయం నుంచే నిప్పులు కక్కుతున్నాడు. దీంతో జనం బయటికి వెళ్లాలంటేనే జంకుతున్నారు. ఇప్పటికే కామారెడ్డి జిల్లాను రెడ్ అలర్ట్‌గా ప్రకటించారు. జిల్లాలో గురువారం 45.9 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదు కావడం గమనార్హం. అత్యధికంగా బీర్కూర్, డోంగ్లీ లో 45.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. బాన్సువాడ, రామారెడ్డి లో 45.8, బిచ్కుందలో 45.3, పాల్వంచ 45, పిట్లం,బీబీపేట్,ఎల్లారెడ్డిలో 44.8, మద్నూర్ 44.4, దోమకొండలో 44.3, నస్రుల్లాబాద్‌లో 44.1, కామారెడ్డిలో 44, గాంధారిలో 43.9, నాగిరెడ్డిపేట్, మాచారెడ్డి, నిజాంసాగర్‌లో 43.8, లింగపేట్లో 43.3, సదాశివనగర్‌లో 43, భిక్కనూర్‌లో 42.9, పెద్దకొడప్గల్, తాడ్వాయిలో 42.8, మహ్మద్‌నగర్‌లో 42.7, రాజంపేట్లో 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఎండలు మండిపోతుండడంతో ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మరో మూడు నాలుగు రోజులు కూడా ఎండ తీవ్రత పెరిగే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు. అత్యవసరం ఉంటేనే బయటికి వెళ్లాలని వైద్యులు సూచిస్తున్నారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటికి రావద్దని సూచిస్తున్నారు.