HomeNizamabadThe Grain Collection Target In Nizamabad Is 9 Lakh Metric Tonnes
దండిగా ధాన్యం.. సేకరణకు సిద్ధం
దండిగా నీళ్లు.. ఫుల్లుగా కరెంట్.. ఫలితంగా యాసంగిలో పంటలు జోరుగా సాగయ్యాయి. పుట్ల కొద్దీ వడ్ల దిగుబడులు రానున్నాయి. ఇప్పటికే పలు చోట్ల పంట కోతలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ధాన్యం సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం చకచకా ఏర్పాట్లు చేస్తున్నది.
పలుచోట్ల కొనుగోళ్లు షురూ
వడ్ల కొనుగోళ్లు చేపట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశం
చకచకా ఏర్పాట్లు చేస్తున్న అధికార యంత్రాంగం
ఉమ్మడి జిల్లాలో ఏర్పాటు కానున్న 799 కొనుగోలు కేంద్రాలు
నిజామాబాద్లో ధాన్యం సేకరణ లక్ష్యం 9 లక్షల మెట్రిక్ టన్నులు
కామారెడ్డిలో 6 లక్షల మెట్రిక్ టన్నులు వచ్చే అవకాశం
దండిగా నీళ్లు.. ఫుల్లుగా కరెంట్.. ఫలితంగా యాసంగిలో పంటలు జోరుగా సాగయ్యాయి. పుట్ల కొద్దీ వడ్ల దిగుబడులు రానున్నాయి. ఇప్పటికే పలు చోట్ల పంట కోతలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ధాన్యం సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం చకచకా ఏర్పాట్లు చేస్తున్నది. ఉమ్మడి జిల్లాలో 15 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు వచ్చే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అందుకు అనుగుణంగా రెండు జిల్లాల్లో 799 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. కేంద్రాలకు వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు. గన్నీ బ్యాగుల కొరత లేకుండా చూస్తున్నారు. వచ్చిన ధాన్యాన్ని వచ్చినట్లు తూకం వేసి మిల్లులకు తరలించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. రైతులు ప్రైవేట్లో తక్కువ ధరకే వడ్లు అమ్ముకోకుండా, దళారుల చేతిలో మోసపోకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. వరి కోతలు ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్న తరుణంలో కొనుగోలు కేంద్రాలను అందుబాటులోకి తీసుకొస్తున్నది.
– నిజామాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
నిజామాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ధాన్యం కొనుగోళ్లకు సర్వం సిద్ధం అవుతున్నది. ఓ వైపు కోతలు ప్రారంభం కావడంతో పాటు మరోవైపు సీఎం కేసీఆర్ ఆదేశాలతో ప్రభు త్వ యంత్రాంగం చకచకా ఏర్పాట్లు చేస్తున్నది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో భారీగా ధాన్యం దిగుబడులు వస్తాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. రెండు జిల్లాల్లో కలిపి దాదాపు 15లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రాక తథ్యం అన్నట్లుగా కనిపిస్తున్నది. ఈ మొత్తం ధాన్యాన్ని సేకరించేందుకు ఉభయ జిల్లాల్లో 799 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు పౌరసరఫరాల సంస్థ ఏర్పాట్లు చేసింది. రెవెన్యూ, వ్యవసాయ, పోలీస్, సహకార, పౌరసరఫరాల శాఖ, పౌరసరఫరాల సంస్థ, రవాణా శాఖలు సంయుక్తంగా ఈ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసేందుకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల పరిధిలో ని బాన్సువాడ, బోధన్ నియోజకవర్గాల్లో కోతలు షురూ అయ్యాయి. పలు చోట్ల ప్రైవేటు కొనుగోలు దారులు ధాన్యం సేకరించే పనిలో నిమగ్నమయ్యా రు. వేగంగానే ప్రభుత్వం కూడా కేంద్రాలను తెరిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నది.
భారీగా దిగుబడులు…
నిజామాబాద్ జిల్లాలోనూ సాధారణ వరి విస్తీర్ణం కన్నా ఎక్కువగానే మూడున్నర లక్షల ఎకరాల్లో వరి సాగైంది. వ్యవసాయ శాఖ అంచనా మేరకు వాతావరణ పరిస్థితుల అనుకూలత మేరకు 11లక్షల 51వేల మెట్రిక్ టన్నుల మేర వరి దిగుబడులు వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. రెండున్నర లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ప్రైవేటు కొనుగోళ్లకు చేరినప్పటికీ దాదాపుగా 9లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నేరుగా ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలి వచ్చే వీ లుంది. నిజామాబాద్ పౌరసరఫరాల సంస్థ సైతం 9లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించేందుకు లక్ష్యంగా పెట్టుకున్నది. ఇందుకోసం కోటీ 22లక్షల కొత్త గన్నీ సంచులు, కోటీ 3లక్షల పాత గన్నీ సంచులు కలుపుకొని మొత్తం 2కోట్ల 25లక్షల గన్నీ బ్యాగులు అవసరం ఉంటుందని పౌరసరఫరాల సంస్థ నిర్ధారించింది. ప్రస్తుతం జిల్లాలో కోటీ 12 లక్షల గన్నీ సంచులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 458 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో ఐకేపీ ద్వారా 64, పీఏసీఎస్ పరిధిలో 347, డీసీఎంఎస్ 29, మార్కెట్ కమిటీల ద్వారా 8, మెప్మా 5, కేపీపీఎస్ఎస్ఎస్ 5 సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు.
పకడ్బందీ ఏర్పాట్లు…
2022-23 యాసంగిలో సాధారణ సాగు విస్తీర్ణం లక్షా 90వేల ఎకరాలు కాగా రెట్టింపు స్థాయిలో 2లక్షల 47 వేల ఎకరాల్లో వరి సాగైంది. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా రైతుల నుంచి 6లక్షల 18వేల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి అవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. 6లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించేందుకు పౌరసరఫరాల సంస్థ ఏర్పాట్లు చేస్తున్నది. ఇందులో ప్రైవేటు మార్కెట్లో ధాన్యం అమ్మకం కాగా దాదాపు 4లక్షల 51వేల మెట్రిక్ టన్నుల ధాన్యం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు చేరే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. దాదాపు 80వేల మంది రైతులకు ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే కొనుగోలు కేంద్రాల ద్వారా లాభం జరుగనున్నది. అంచనాల మేరకు ధాన్యం సేకరణకు కామారెడ్డి జిల్లాలోనే రూ.851 కోట్ల మేర వ్యయం కానున్నది. ఈసారి 57 మంది రైస్ మిల్లర్లకు సేకరించిన ధాన్యాన్ని మిల్లింగ్ కోసం కేటాయింపులు జరుపనున్నట్లుగా నిర్ణయించారు. మొత్తం 341 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుండగా ఇందులో ఐకేపీ ఆధ్వర్యంలో 21, పీఏసీఎస్ పరిధిలో 320 ఉన్నాయి. గన్నీ సంచుల కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొత్తవి 81లక్షలు, పాతవి 69లక్షలు కలిపి కోటీ 50లక్షల మేర గన్నీ సంచులు అవసరం కానుండగా ప్రస్తుతానికి కామారెడ్డి జిల్లాలో 41లక్షల 28వేల గన్నీ సంచులు అందుబాటులో ఉన్నాయి. ఇంకా 93లక్షల గన్నీ బ్యాగులు.. కోతలు ఊపందుకునే లోపు తెప్పించనున్నారు.
గత వానకాలం అదిరింది…
గత వానకాలం సీజన్లో ధాన్యం కొనుగోళ్లలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలు టాప్లో నిలిచాయి. రాష్ట్రంలో అత్యధిక ధాన్యాన్ని సేకరించడంలో నిజామాబాద్ జిల్లా నంబర్ వన్ స్థానంలో నిలిచి రికార్డు సృష్టించింది. కామారెడ్డి టాప్ 5లో నిలిచింది. 79వేల 77 మంది రైతుల నుంచి 5లక్షల 85వేల 661 మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరించగా రూ.1204.36 కోట్ల చెల్లింపులు జరిపారు. కామారెడ్డి జిల్లాలో 78వేల 415 మంది రైతుల నుంచి సీజన్ మొత్తంలో 4లక్షల 74వేల 189 మెట్రిక్ టన్నులు సేకరించారు. ఈ మొత్తం ధాన్యం విలువ అక్షరాల రూ.976.81 కోట్లుగా నిలిచింది. కేవలం 45 రోజుల్లోనే రైతుల నుంచి మొత్తం వరి ధాన్యాన్ని సేకరించడంలో ఇసుమంతైన ఇబ్బందులు తలెత్తలేదు.
కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలి
రైతులు పండించిన ధాన్యాన్ని సేకరించేందుకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు ముమ్మరం చేశాం. రైతులెవ్వరూ అధైర్యపడొద్దు. ప్రభుత్వం ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల్లోనే వరి ధాన్యం అమ్ముకోవాలి. తద్వారా కనీస మద్దతు ధరను పొందొచ్చు. చివరి గింజ వరకు ధాన్యాన్ని సేకరించే బాధ్యత మాది. వేసవి దృష్ట్యా కొనుగోలు కేంద్రాల్లో జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూస్తాం.
– చంద్రమోహన్, అదనపు కలెక్టర్(రెవెన్యూ), కామారెడ్డి జిల్లా
ఇబ్బందుల్లేకుండా చర్యలు…
గత వానకాలం సీజన్లో ఎలాంటి ఇబ్బంది లేకుండానే ధాన్యం కొనుగోళ్లను పూర్తి చేశాం. ఇప్పుడు కూడా అదే పంథాలో వేగంగా ధాన్యాన్ని సేకరించడంపై దృష్టి సారించాం. నిజామాబాద్లో యాసంగిలోనూ భారీగానే దిగుబడులు వస్తాయని అంచనాలున్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటికే ఆయా చోట్ల కేంద్రాలు తెరిచాం. ఒకట్రెండు రోజుల్లోనే వరి కోతలను అనుసరించి కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యాన్ని సేకరిస్తాము.
– చంద్రప్రకాశ్, పౌరసరఫరాల శాఖ అధికారి, నిజామాబాద్ జిల్లా