మోర్తాడ్/వేల్పూర్, జూలై 1: రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పబ్లిసిటీ స్టంట్లు మానేసి, హామీల అమలుపై దృష్టిపెట్టాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి హితవు పలికారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి రోజురోజుకూ దారుణంగా మారుతుంటే, సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం కేవలం ప్రచార ఆర్భాటాలకు పరిమితమయ్యారని మండిపడ్డారు. మంగళవారం శిల్పకళా వేదికలో నిర్వహించింది రైతుల ఆశీర్వాదసభ కాదని, అది అన్నదాతల శాపనార్థాల సభ అని పేర్కొన్నారు.
వేల్పూర్‌లోని తన నివాసంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్‌రెడ్డి సభల ఖర్చు చూస్తుంటే చారానా కోడికి బారాణా మసాలా అన్న చందంగా ఉన్నదని ఎద్దేవా చేశారు. గతంలో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఎలాంటి ఆర్భాటాలు, వృథా ఖర్చులు లేకుండా కేవలం ఒక ప్రెస్‌మీట్ ద్వారా ప్రకటించి 11 సీజన్లలో రూ.73వేల కోట్లు రైతుబంధు నిధులను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశారని గుర్తు చేశారు. ఒక్క రూపాయి కూడా ప్రజాధనాన్ని వృథా చేయలేదని తెలిపారు. కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు సీజన్లలో మూడు సీజన్ల రైతుబంధు ఎగ్గిట్టి దాదాపు రూ.28వేల కోట్లు రైతులకు బాకీ పడిందన్నారు. రూ.28వేల కోట్లుపాత బాకీలో నుంచి కేవలం రూ.2500కోట్లు విదిల్చి, దానికోసం వందల కోట్లతో అట్టహాసంగా సభలు ఏర్పాటు చేయడం హాస్యాస్పదమన్నారు.
ప్రజాధనం వృథా
రాష్ట్రవ్యాప్తంగా పత్రికల్లో, టీవీల్లో భారీ ప్రకటనలు ఇస్తూ హైదరాబాద్‌తో పాటు తెలంగాణ అంతటా సీఎం రేవంత్‌రెడ్డి తన ముఖచిత్రంతోకూడిన పెద్దపెద్ద హోర్డింగ్‌లు పెట్టుకుంటూ ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని వేముల విమర్శించారు. ఈ అనవసర ప్రచారాలు, సభల ఖర్చులు తక్షణమే నిలిపివేసి ఆ డబ్బులను రైతుల సంక్షేమం కోసం ఖర్చు చేయాలని సూచించారు. బాల్కొండ నియోజకవర్గంలో 52 వేల మంది రైతులకు రుణమాఫీ కావాల్సి ఉండగా కేవలం 22వేల మందిరైతులకు మాత్రమే జరిగిందని, మిగిలిన 30వేల మంది రైతులు ఇప్పటికీ బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారని తెలిపారు. రుణమాఫీ కాదు, రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకం మాఫీ అయ్యిందని అన్నారు. మంత్రి తుమ్మల ఏసీ రూముల్లో కూర్చుని యూరియా యాప్ బాగున్నదని, 90శాతం రైతులు సంతోషంగా ఉన్నారని మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. ఇదే మాట గ్రామాల్లోకి వచ్చి రైతుల మధ్య నిలబడి చెబితే రైతులు వారి గూబ గుయ్యుమనిపిస్తారని హెచ్చరించారు.
రేవంత్‌రెడ్డివి ఉత్తర కుమారుడి ప్రగల్బాలు
తాను మాట ఇస్తే తప్పను అని రేవంత్‌రెడ్డి పలికే ప్రగల్బాలు ఉత్తర కుమారుడి ప్రగల్బాలులా ఉన్నాయని, ఇది ప్రపంచంలో 8వ వింత అని ఎద్దేవా చేశారు. వందరోజుల్లో ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేస్తానని చెప్పి 900రోజులైనా ఏ ఒక్క హామీనైనా సంపూర్ణంగా అమలు చేయకపోవడం మాట తప్పడం కాదా అని నిలదీశారు.
అప్పుల ప్రచారం అబద్ధం
బీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ చేస్తున్న అప్పుల ప్రచారాన్ని వేముల ప్రశాంత్‌రెడ్డి పూర్తిగా అబద్ధమని పేర్కొన్నారు. కేసీఆర్ పదేండ్ల పాలనలో చేసిన అప్పు కేవలం రూ.3లక్షల 80వేల కోట్లు మాత్రమేనని , పార్లమెంట్లో కాంగ్రెస్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్రం స్పష్టమైన సమాధానం ఇచ్చిందని గుర్తుచేశారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కేవలం రెండు న్నరేండ్లలోనే ఏకంగా రూ.4లక్షల కోట్ల అప్పులు తెచ్చిందని, ఈ నిధులతో ఏం కట్టారో సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశా రు. అధికారంలోకి వచ్చి రెండున్నర ఏండ్లు దాటుతున్నా పాలన చేయడం చేతకాక, ఇంకా కేసీఆర్ మీద , బీఆర్ఎస్ పార్టీ మీద పడి ఏడవడం రేవంత్‌రెడ్డి మానుకోవాలని వేముల హితువు పలికారు.