Nizamabad | నిజామాబాద్, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) తెలంగాణ ఏర్పాటుకు మునుపు పల్లెల్లో కాటికాడి కష్టాలు కోకొల్లలు. మృతదేహంతో జాగారాలు, అంత్యక్రియలకు అవస్థలు అన్నీ ఇన్నీ కావు. ఊరి చివరన అంతిమ కార్యక్రమాలు నిర్వహించాలంటే బిక్కుబిక్కుమంటూ పూర్తిచేసుకునే దుస్థితి ఉండేది. ఎవరొచ్చి అడ్డుపుల్లలు పెట్టి అంత్యక్రియలను ఆపుతారేమోనన్న భయం జనాల్లో ఉండేది. ఇలా గ్రామ పంచాయతీ పరిధిలో శ్మశాన వాటికలకు స్థలాలు లేక ప్రజలు పడిన ఇబ్బందులు అనేకం. ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిన తర్వాత కాటి కష్టాలు పూర్తిగా తీరిపోయాయి. ఎలాంటి అవస్థలు లేకుండానే మనిషికి జరగాల్సిన చివరి మజిలీ సాఫీగా పూర్తవుతున్నది. ఇందుకు సీఎం కేసీఆర్ ఆలోచనల నుంచి పుట్టుకొచ్చిన ఆధునిక వైకుంఠధామాలే ప్రధాన కారణం. ప్రతి జీపీకి వైకుంఠధామాలను తప్పనిసరిగా నిర్మించడం ద్వారా నిజామాబాద్ జిల్లాలో 530, కామారెడ్డి జిల్లాలో 526చోట్ల అందుబాటులోకి వచ్చాయి. దహన వాటికలు, మరుగుదొడ్లు, నీటి వసతి, దుస్తులు మార్చుకునేందుకు గదులు వంటి సౌకర్యాలను కల్పించారు. వైకుంఠరథాలు, ఫ్రీజర్లు సైతం అనేక చోట్ల అందుబాటులోకి వచ్చాయి.
సగౌరవంగా అఖరి మజిలీ..చనిపోయిన వ్యక్తులకు తమ ఆచార, సంప్రదాయల ప్రకారం సాగనంపే ప్రక్రియ ఇప్పుడు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలోని పల్లెల్లో గౌరవంగా జరుగుతున్నది. ప్రభుత్వం నిర్మించిన వైకుంఠధామాల్లోనే అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. రోడ్డు పక్కన, కాలువ గట్లపై చితి మంటలు కంటికి కనిపించడం లేదు. కేవలం శ్మశాన వాటికల్లోనే కార్యక్రమాలు నిర్వహించేలా ప్రభుత్వం చేసిన ఏర్పాట్లతో సత్ఫలితాలు అందుతున్నాయి. గ్రామాల్లో అన్ని సామాజిక వర్గాలకు కలిపి ఒకే చోట దహన క్రియలు నిర్వహిస్తున్నారు. ప్రతి గ్రామంలో ఊరందరికీ కలిపి శ్మశాన వాటిక ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ఒక సంకల్పాన్ని తీసుకొని అమలుచేసింది. వైకుంఠధామాల పేరుతో ఊరి చివరన దహన వాటికలు నిర్మించింది. ఉమ్మడి జిల్లాలో 1056 గ్రామ పంచాయతీలున్నాయి. ఇందులో అన్నిచోట్ల వైకుంఠధామాలు పూర్తికాగా అందుబాటులోకి కూడా వచ్చాయి. వైకుంఠధామాల్లో గ్రామ పంచాయతీ పాలకవర్గాల చొరవ, స్థానికంగా సంపన్న వర్గాల చేయూత, ఎన్ఆర్ఐలు, మనసున్న మారాజుల దాతృత్వంతో వైకుంఠరథాలు, ఫ్రీజర్లు సైతం అక్కడక్కడా సమకూరాయి. నిజామాబాద్ జిల్లాలో 141చోట్ల వైకుంఠరథాలు, 48 చోట్ల ఫ్రీజర్లు సైతం ఏర్పాటు కావడం విశేషం.
రాష్ట్ర సర్కారు చొరవతో ఊరూరా వైకుంఠధామాల నిర్మాణం జరిగింది. ఇందులో మరిన్ని మౌలిక సదుపాయాల కల్పనకు పంచాయతీ శాఖ కృషి చేస్తున్నది. ఇందుకోసం స్థానికంగా గ్రామ ప్రజల సహకారాన్ని కోరుతున్నది. ముఖ్యంగా దాతల తోడ్పాటుతో వైకుంఠరథాలు, ఫ్రీజర్లను ఏర్పాటు చేసి ప్రజల ఇబ్బందులను తీర్చడం కోసం పాటుపడుతున్నది. గ్రామంలో పుట్టి పెరిగి విదేశాల్లో స్థిరపడిన కుటుంబాలు, గ్రామం నుంచి ఉన్నతస్థాయికి ఎదిగిన వ్యక్తుల సాయంతో ఏర్పాట్లు చేయాలని యోచిస్తున్నారు. దాతల సహకారాన్ని కోరుతూ గ్రామాల్లో ప్రచారం ముమ్మరం చేస్తున్నారు.
సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులతో కలిపి స్తోమత ఉన్న కుటుంబాల సహకారాన్ని పల్లెల అభివృద్ధి, గ్రామ ప్రజల మేలు కోసం భాగస్వామ్యం చేసేలా పనిచేస్తున్నారు. సంపన్నుడైనా, పేదోడైనా అందరినీ ఆరు అడుగుల జాగలోనే పూడ్చి పెట్టాల్సిందే. లేదంటే ఆరడుగుల దహన వాటికపై చితిని పేర్చి దహనం చేయాల్సిందే. రోజురోజుకూ జనావాసాలు విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం కాలక్రమేణా ఈ స్థలం కూడా కరువైపోతున్నది. కొన్ని చోట్ల ఖననం కోసం ప్రత్యేకంగా కేటాయించిన స్థలాలన్నీ రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతుల్లో, ఆక్రమణల కోరల్లో పడి కనుమరుగై పోయాయి. ఈ విషయంలో పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా పోయింది. కబ్జారాయుళ్ల భరతం పట్టిన తెలంగాణ సర్కారు… ఆక్రమిత ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకొని ఊరి బాగుకోసం కేటాయించింది. ప్రభుత్వ భూమిలో శ్మశాన వాటికలను నిర్మించింది. స్థలాలు లేని చోట ప్రైవేటు భూములను కొనుగోలు చేసి మరీ వైకుంఠధామాలను నెలకొల్పింది.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వైకుంఠధామాల నిర్మాణంతో పల్లెల్లో ఏ ఒక్కరు చనిపోయినా వారి ఆఖరి మజిలీ మాత్రం గౌరవంగా కొనసాగుతున్నది. వానకాలంలాంటి పరిస్థితిలో అంత్యక్రియల క్రతువుకు ఇబ్బంది లేకుండా ప్రత్యేకంగా నిర్మించిన వేదికలు ఉపయోగపడుతున్నాయి. అంత్యక్రియల్లో పాల్గొనే వారికి స్నాన గదులు, మహిళలకు దుస్తులు మార్చుకునే సౌలభ్యం, పచ్చిక బయళ్లను వైకుంఠధామాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. మరిన్ని సౌకర్యాల కోసం దాతల సహకారాన్ని కోరుతున్నాం. వైకుంఠరథాలు, ఫ్రీజర్లను సమకూర్చే పని.. పాలకవర్గాల ద్వారా చేపడుతున్నాం.
– జయసుధ, నిజామాబాద్ జిల్లా పంచాయతీ అధికారిణి