నమస్తే తెలంగాణ యంత్రాంగం, డిసెంబర్ 3: మొదటి విడుత స్థానిక సంస్థల ఎన్నికల పర్వం కీలక దశకు చేరింది. నామినేషన్ల ఉపసంహరణకు బుధవారంతో గడువు ముగిసింది. పలువురు అభ్యర్థులు నామినేష్లు విత్ డ్రా చేసుకోవడం, చాలాచోట్ల సర్పంచ్, వార్డు స్థానాలకు ఒక్కొక్కరే బరిలో ఉండడంతో ఆయా స్థానా లు ఏకగ్రీవమయ్యాయి. ఉమ్మడి జిల్లాలో దాదాపు 50 దాకా పంచాయతీలు ఏకగ్రీవమైనట్లు తెలిసింది. అయితే, దీనిపై అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది.
చాలా చోట్ల ఏకగ్రీవం..
కోటగిరి మండలంలో 16 జీపీలు ఉండగా, ఐదు చోట్ల ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. రాంపూర్, సుద్దులం తండా, అడ్కాస్పల్లి, దేవునిగుట్ట తండా, వల్లభాపూర్ గ్రామాల్లో సర్పంచ్ స్థానాలకు ఒక్కొక్కరే అభ్యర్థి నిలవడంతో వారి ఎన్నిక లాంఛనమే కానుంది. మిగతా 11 జీపీల్లో ఎన్నికలు జరుగనున్నాయి.
ఒకే ఇంటి నుంచి ముగ్గురు..
నాగిరెడ్డిపేట మండలం అక్కంపల్లి గ్రామ పంచాయతీ పాలక వర్గాన్ని బుధవారం గ్రామస్థులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇక్కడ సర్పంచ్ స్థానం బీసీ జనరల్‌కు కేటాయించగా, ఒకే ఇంటికి చెందిన ముగ్గురు నామినేషన్లు వేశారు. బుధవారం సమావేశమైన గ్రామస్తులు.. సర్పంచ్‌గా వెంకాగౌడ్ను, అలాగే, వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం నూతన గ్రామ పంచాయతీ పాలకవర్గాన్ని సత్కరించారు.
లింగంపేటలో 11 జీపీలూ..
లింగంపేట మండలంలో 41 పంచాయతీలకు గాను 11 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. రాంపల్లి, రాంపల్లి స్కూల్ తండా, ఎల్లారం, నల్లమడుగు పెద్ద తండా, సజ్జన్పల్లి, మెంగారం, బాణాపూర్ తండా, ముంబాజీపేట తండా, మాలోత్ సంగ్యానాయక్ తండా, అయ్యపల్లి తండా, బాణాపూర్ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. అయితే, అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.