నిజామాబాద్, సెప్టెంబర్ 02, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తుది ఓటరు జాబితా వెల్లడైంది. ఆగస్టు 28న ముసాయిదా జాబితాను జీపీ, వార్డుల వారీగా గ్రామ పంచాయతీ, మండలాభివృద్ధి కార్యాలయాల్లో ప్రకటించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు వివిధ రాజకీయ పార్టీలతో జిల్లా, మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించారు. సెప్టెంబర్ 2న తుది ఓటరు జాబితా వెల్లడికి నిర్ణయించిన మేరకు నిజామాబాద్, కామారెడ్డి జిల్లా పంచాయతీ అధికారులు తమ పరిధిలోని ఓటరు తుది జాబితాను ప్రకటించారు.
నిజామాబాద్ జిల్లాలో 545 జీపీలు, 5022 వార్డులున్నాయి. 5053 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయబోతున్నారు. నిజామాబాద్లో మొత్తం 8లక్షల 51వేల 417 మంది ఓటర్లున్నారు. కామారెడ్డి జిల్లాలో 532 గ్రామ పంచాయతీలు, 4656 వార్డులున్నాయి. 4670 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయబోతున్నారు. కామారెడ్డి జిల్లాలో మొత్తం 6లక్షల 39వేల 730 మంది ఉన్నారు. ఉభయ జిల్లాల్లో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నట్లుగా తుది జాబితా గణాంకాలు చెబుతున్నాయి.
రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఓటరు తుది జాబితా వెల్లడి కావడంతో సర్వత్రా సందడి ఏర్పడింది. జీపీల వారీగా తుది ఓటరు జాబితా వెల్లడి కాగా మరో వారం రోజుల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీలకు సైతం తుది ఓటరు జాబితా వెల్లడించేందుకు ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా గ్రామాల్లో రాజకీయ వేడి షురూ అయ్యింది. సెప్టెంబర్ నెలాఖరులోగానే స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేసేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతున్నది. ఇందులో భాగంగా చాలా మంది ప్రజల మద్ధతు కోసం పాకులాడడం మొదలు పెట్టారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు పార్టీ సింబల్స్ ఉండనుండటంతో రాజకీయ పార్టీలను ప్రసన్నం చేసుకోవడానికి ఆశావాహులు ముమ్మరంగా ప్రయత్నాలు మొదలు పెట్టారు. సర్పంచ్ ఎన్నికలకు రాజకీయ పార్టీలకు అతీతంగా జరుగుతుంది. సర్పంచ్గిరి కోసం చాలా మంది ఆశావాహులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధం అవుతున్నారు. అయితే జీపీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ వారీగా రిజర్వేషన్లు ఏ విధంగా అమలవుతాయి? అన్నది ఉత్కంఠను రేపుతోంది.