జీవన పోరాటంలో వలసవెళ్లిన ప్రవాస భారతీయులు తరచుగా పరాయి దేశంలోని తమ అనుభవాలను కథలుగా చెప్పడం చూశాం. కానీ మధు పెమ్మరాజు కథలు ఇందుకు మినహాయింపు. ఆయన పుట్టి పెరిగిన హైదరాబాద్ బాల్యాన్ని, తన గోదావరి జిల్లాల మూలాల్ని స్పర్శిస్తూ ఆ తర్వాత తన అమెరికా అనుభవాలు జోడించి ఒక అందమైన పతంగిని ఆకాశంలో ఎగరేశాడు. దానికి ‘డోరేదార్’ అని నామకరణం చేశాడు.
ఆయన స్వతహాగా ఆంధ్ర ప్రాంతానికి చెందినా, తెలంగాణ మాండలికంపై అవ్యాజమైన వాత్సల్యం ఉంది. తాను పుట్టి పెరిగిన హైదరాబాద్ సంస్కృతిని తన కథల్లో ప్రతిబింబింపజేశాడు. ముఖ్యంగా పాత పతంగుల పండుగ జరుపుకొనేటప్పుడు పరిచయమైన ఒక పారిభాషిక పదజాలాన్ని సహేతుకంగా వాడాడు. సైదాబాద్‌లో తన చిన్ననాటి జ్ఞాపకాలను డీల్, చరఖా లాంటి పదాలను గుర్తుచేస్తూ ఒక అందమైన హైదరాబాద్ పిల్లాడి పండుగ అనుభవాన్ని, సొగసైన తెలంగాణ మాండలికాన్ని జతపర్చాడు.
‘నవ్వే ఏనుగు బొమ్మ’ కథలో రిక్షా లక్ష్మయ్యకు తన కిట్టీ బాక్స్‌లోని డబ్బులను ఇచ్చి డాక్టర్‌కు చూపించుకోమని చెప్పడం హృదయాలను కదిలిస్తుంది. ఈ పుస్తకంలో మరో కథ ‘రాత్-దిన్’ నిడివి చాలా చిన్నది. కానీ అంతులేని అర్థం ఉంటుంది. రాత్రిపూట ఒక అమ్మాయి యూనివర్సిటీ ముందు ఒక అపరిచిత వ్యక్తితో చేసిన సంభాషణ విద్యావ్యవస్థలోని చీకటిపై వెలుగులను ప్రసరింపజేసి పాఠకులను ఆలోచింపజేస్తుంది. అంత గాఢమైన భావాలను కొన్ని వాక్యాలతో చెప్పడం రచయిత గొప్పతనాన్ని సూచిస్తుంది.
‘త్వమేవాహం’ కథలో పార్థుడి పాత్ర ఆకట్టుకుంటుంది. బ్రహ్మచారిగా బతుకుతూ ఊరి బాగోగులు చూసుకుంటూ ఏమీ ఆశించకుండా పరుల సేవలో నిమగ్నమయ్యే మనిషి. ఉన్నతోద్యోగి అయిన తమ్ముడు తనతో రమ్మని ఎంత బతిమాలినా తన ఊరును విడిచి రాలేనని చెప్పడం పాఠకుడికి కంట్లో నీరు తెప్పిస్తుంది.
తెలంగాణ మాండలిక సొగసుతో బాల్యస్మృతులను నెమరువేసుకున్న కథ ‘బౌండరీ దాటిన బాలు’. ఇది ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. ఆటలో పోయిన బంతిని తిరిగి పిల్లలు ఎలా పట్టుకొచ్చారు అనేది కథ సారాంశం. ఇందులో పిల్లలు ఆనాటి తల్లిదండ్రులంటే ఎంత భయపడేవారో, ఇంటర్నెట్, కంప్యూటర్ లేని కాలంలో గల్లీ క్రికెట్‌ను ఏవిధంగా ఆడేవారో, వారి అమాయక ఆలోచనలను, మాటను ఈ కథలో పొందుపర్చాడు.
ఇక అమెరికాలో జీవితాల గురించి కథలు ఉన్నాయి. భారతదేశంలో ఉన్న కులం, అమెరికాలో కూడా పోలేదు అన్న ఉదంతాన్ని ‘పాత్రాభినయం’ అనే కథలో చక్కగా వివరించాడు. ఒక పార్టీలో ‘బత్తుల’ తన ఇంటిపేరు ఉన్నందున తనవాడని ఆప్యాయంగా పలకరించడం, ఆ తర్వాత అతను మనవాడు కాదని తేలడంతో అంటీముట్టనట్టుగా వ్యవహరించడం ‘కులం’ అనే గోడను మనవాళ్లు అమెరికాలో ఎంత బలంగా కట్టారో అర్థమవుతుంది.
అమెరికా వెళ్లి, అక్కడ విద్యార్థులు పార్ట్‌టైమ్ జాబ్‌లతో పడే కష్టాలను ‘ఆడ్ జాబ్’లో చక్కగా వివరించాడు. అమెరికాలో ఉండే కార్పొరేట్ జీవితం ఎంత భయంకరంగా ఉంటుందో ‘మేరి’ పాత్ర ద్వారా చెప్పిస్తాడు. ఈ కథ చదివిన తర్వాత మనుషులందరికీ కష్టాలు ఒక్కటే అని బలంగా నమ్ముతాము. తాను గోదావరి జిల్లా వాడైనందున, అదే మాండలికంలో కోస్తా పట్టణాల్లో జరుగుతున్న రియల్ ఎస్టేట్ ఒక సెటైర్లా ‘ఇసుక మేడలు’ కథ ఉంటుంది. ‘ఎత్తరుగుల ఇల్లు’ కథలో వ్యవసాయం చేసుకుంటూ నలుగురిలో పరపతి పొందిన ఒక కుటుంబం కొత్తతరం డబ్బును సులువుగా సంపాదించాలనే ఆశలో ఎలా ఇక్కట్ల పాలైందో మనకు తెలుస్తుంది.
మధు ఈ కథల్లో మానవీయ విలువలు కలిగిన వాటిని పొందుపరిచాడు. ముఖ్యంగా తెలంగాణ, కోస్తా, అమెరికా జీవన చిత్రాలతో మూడు నదుల సంగమంగా మనకు కనిపిస్తుంది. అయితే, కొన్ని వర్ణనలు ఎక్కువై వస్తువును మింగేసే ప్రమాదం ఉంది. ఇది రచయిత సరిచూసుకోవాలి. ఏదేమైనా మధు ఫిరాయించిన పతంగి ‘షాన్‌దార్, డోరేదార్, మజేదార్’గా ఉంది.