ED raids : రాజకీయ కన్సల్టెన్సీ (Political Consultancy) ఐప్యాక్ (I-PAC) కార్యాలయాల్లో గురువారం దర్యాప్తు సంస్థ ఈడీ సోదాలు (ED Raids) చేపట్టింది. పశ్చిమ బెంగాల్ (West Bengal) బొగ్గు స్మగ్లింగ్ కేసుకు సంబంధించి ఈ తనిఖీలు నిర్వహిస్తున్నది. హైదరాబాద్ (Hyderabad), బెంగళూరు (Bengalore), ఢిల్లీ (Delhi) ల్లోని ఐప్యాక్ కార్యాలయాల్లో ఏకకాలంలో అధికారులు సోదాలు చేపడుతున్నారు.
ఈ కన్సల్టెన్సీ డైరెక్టర్లలో ఒకరైన రిషిరాజ్ సింగ్‌కు చెందిన ప్రాంగణంపై కూడా దర్యాప్తు సంస్థ దృష్టిసారించింది. బొగ్గు స్మగ్లింగ్‌కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో కొంతకాలంగా సోదాలు జరుగుతున్నాయి. కొన్ని నెలల క్రితం బెంగాల్లో జరిగిన ఈ రైడ్స్ చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. సోదాలు జరుగుతున్న సమయంలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఐప్యాక్ చీఫ్ ఇంటికి వెళ్లారు.
ఆ సమయంలో ఆయన ఇంటిపై కూడా తనిఖీలు జరగడం గమనార్హం. సోదాల సమయంలో బెంగాల్ ప్రభుత్వం నుంచి ఆటంకాలు ఎదురయ్యాయని ఈడీ ఆరోపించింది. ఆ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్నది. ఇదిలావుంటే 2019 లోక్‌సభ ఎన్నికల తర్వాత నుంచి టీఎంసీతో కలిసి ఐప్యాక్ పనిచేస్తోంది. బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఈ పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి.