గాంధారి, మే 24: ఎరువులు, విత్తనాల పంపిణీలో ప్రభుత్వ నిర్లక్ష్యంతో అన్నదాత ఆందోళన చెందుతున్నాడు. సరిపడా విత్తనాలు అందక రైతులు నానా పాట్లు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాయితీపై అందిస్తున్న జీలుగ విత్తనాల పంపిణీని గాంధారి మండల కేంద్రంతోపాటు గండివేట్ సొసైటీ పరిధిలో శుక్రవారం ప్రారంభించారు. ప్రారంభించిన కొద్దిసేపటికే విత్తనాలు అమ్ముడుపోయాయి. దీంతో చాలామంది రైతులకు జీలుగ విత్తనాలు లభించకపోవడంతో నిరాశతో వెనుదిరగగా..మరికొందరు ఆందోళన చేపట్టారు. గాంధారి మండలంలో ప్రతి ఏటా దాదాపు 17 వేల ఎకరాల్లో వరి పంటను సాగుచేస్తారు. దీనిని దృష్టిలో ఉంచుకొని వ్యవసాయాధికారులు జీలుగ, జనుము విత్తనాలను అందుబాటులో ఉంచేవారు. కానీ ఈసారి మండలానికి 822 బస్తాలు (30 కిలోలు) మాత్రమే వచ్చా యి. ఇందులో గాంధారి సింగిల్ విండోలో 333 బస్తాలు, ముదెల్లి సింగిల్ విండోలో 333, మండల కేంద్రంలోని ఆగ్రోస్ కేంద్రంలో 156 బస్తాలను వ్యవసాయ అధికారులు అందుబాటులో ఉంచారు. శుక్రవారం విత్తనాల పంపిణీ ప్రారంభించగా.. చాలా మంది రైతులకు జీలుగ విత్తనాలు లభించలేదు. కేసీఆర్ పాలనలో రైతులకు సరిపడా విత్తనాలు అందుబాటులో ఉంచేవారని రైతులు గుర్తుచేసుకున్నారు. విత్తుకునే సమయం దాటిన తర్వాత విత్తనాలు వచ్చినా ఫలితం ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు.
గాంధారి మండలంలో పంటను సాగు చేసే రైతులను దృష్టిలో ఉంచుకొని అవసరమైన జీలుగ, జనుము విత్తనాల కోసం ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించాం. అలాగే వరి పంటను సాగు చేసే రైతుల కోసం 900 క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలను అందుబాటులో ఉంచాలని నివేదించాం.