ఖలీల్‌వాడి, మార్చి 5: ఇంటర్ పరీక్షల నిర్వహణలో అధికార యంత్రాంగం వైఫల్యం కనిపిస్తున్నది. కొన్ని సెంటర్లలో జోరుగా మాస్ కాపీయింగ్ సాగుతున్నదని ప్రచారం జరుగుతున్నది. ప్రైవేట్ కళాశాలల నుంచి డబ్బులు తీసుకున్న కొందరు అధికారులు కాపీయింగ్‌ను ప్రోత్సహిస్తున్నట్లు విద్యార్థుల తల్లిదండ్రులు విమర్శిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కార్పొరేట్ విద్యాసంస్థల నిర్వాహకులు.. కొందరు ఇన్విజిలేటర్లు, సూపరింటెండెంట్లను మచ్చిక చేసుకున్నారు. అధికారులకు డబ్బులు ఇవ్వడంతో కాపీయింగ్ జరుగుతున్నా పట్టించుకోవడం లేదని విద్యార్థి సంఘాల నేతలు చెబుతున్నారు. ఫలితంగానే ఎగ్జామ్ సెంటర్లలోని కిటికీలతో పాటు పరిసర ప్రాంతాల్లో చిట్టీలు కనిపిస్తున్నాయని పేర్కొంటున్నారు. జిల్లా కేంద్రంలోని ఓ పరీక్ష కేం ద్రం వద్ద జవాబులతో కూడిన జిరాక్స్ పత్రాలు లభ్యం కావడం చర్చనీయాంశమైంది.
మరోవైపు, పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తామని ప్రకటించిన అధికారులు.. ఆ దిశగా చర్యలు తీసుకున్నట్లు కనిపించడం లేదు. మాస్ కాపీయింగ్ జరుగకుండా ఫ్లయింగ్, సిట్టింగ్ స్కాడ్ బృందాలు తనిఖీలు పెంచాలని విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి. మరోవైపు, కాపీయింగ్ జరుగుతుందన్న ప్రచారాన్ని జిల్లా ఇంటర్ విద్యాధికారి (డీఐఈవో) రఘురాజ్ ఖండించారు. మాస్ కాపీయింగ్ ఎక్కడా జరగడం లేదని చెప్పారు. ఓ సెంటర్ బయట జిరాక్స్ పేపర్లు లభ్యమైన అంశాన్ని ఆయన వద్ద ప్రస్తావిస్తే.. ఎవరైనా విద్యార్థులు తీసుకొచ్చి బయట పడేశారమో కానీ, హాల్లోనికి మాత్రం తీసుకురాలేదని బదులిచ్చారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహిస్తున్నామని, వదంతులను నమ్మొద్దని సూచించారు.
ఖలీల్‌వాడి/ కామారెడ్డి, మార్చి 5: ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో ఒకరిపై మాల్ ప్రాక్టీస్ కేసు నమోదైంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని హరిచరణ్ జూనియర్ కళాశాలలో మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతుండగా విద్యార్థిని ఫ్లయింగ్ స్కాడ్ మంగళ వారం పట్టుకొని మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు చేసినట్లు డీఐఈవో రఘురాజ్ తెలిపారు. జిల్లాలో మొత్తం 17,082 మంది విద్యార్థులకు 16,572 మంది హాజరయ్యారని, 510 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. కామారెడ్డిలో జనరల్ విద్యార్థులు 7607 మందికి 7399 మంది, వొకేషనల్‌లో 1047 మందికి 1021 మంది హాజరైనట్లు ఇంటర్ నోడల్ అధికారి షేక్ సలాం తెలిపారు. మొత్తం 234 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు.