తెలంగాణ చరిత్రకు దర్పణంగా నిలబడిన రాష్ట్ర చిహ్నాన్ని రంగుల మయం చేసి, వందల ఏండ్ల ఘనకీర్తి ప్రతీకలను కాలగర్భంలో కలిపేందుకు కాంగ్రెస్ సర్కార్ సిద్ధమైంది. తెలంగాణ రాష్ట్ర అధికారిక ముద్రలోని చిహ్నాలను తొలగించనున్నట్లు రేవంత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఉమ్మడి జిల్లాలో ఆగ్రహం వ్యక్తమవుతున్నది. కాకతీయ కళాతోరణం, చార్మినార్ చిహ్నాలను తొలగిస్తే సహించబోమని, కేసీఆర్పై కక్షతో రాష్ట్ర అధికారిక చిహ్నాలను మారుస్తామంటే ఊరుకునేది లేదని కవులు, కళాకారులు, ఉద్యమకారులు హెచ్చరిస్తున్నారు. కాకతీయుల కళాతోరణం,చార్మినార్ చిత్రాలను తొలగించడమంటే తెలంగాణ చరిత్రను చెరిపేయడమే అవుతుందని మండిపడుతున్నారు. ఆ రెండు చిత్రాలను అధికార చిహ్నంలో కొనసాగిస్తూ… అవసరమైతే తెలంగాణ చరిత్రను ప్రతిబించించే అదనపు అంశాలను జోడించుకోవచ్చని సూచిస్తున్నారు. చిహ్నాల తొలగింపుపై కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేకపోతే తెలంగాణ ఉద్యమ తరహాలో పోరాడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.
అందెశ్రీ రాసిన ‘జయ జయహే తెలంగాణ’ గీతానికి ఏపీకి చెందిన కీరవాణికి సంగీత దర్శకత్వం అప్పగించడం శోచనీయం. తెలంగాణ అధికారిక గేయానికి సంగీత దర్శకత్వం వహించడానికి తెలంగాణలో అనేక మంది సంగీత దర్శకులు ఉన్నారు. ఇక్కడ గాయకులు, సంగీత దర్శకులు, కళాకారులు లేనట్లు రేవంత్రెడ్డి సర్కార్ ఆలోచించడం సిగ్గుచేటు. ఇది తెలంగాణ కళాకారులను అవమానించడమే అవుతోంది. పరాయి రాష్ట్రం సంగీత దర్శకుడికి మన తెలంగాణ పాటను అందిస్తే తెలంగాణ ఉద్యమకారులు, కళాకారులు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎప్పటికీ క్షమించరు.
తెలంగాణ అధికారిక చిహ్నం నుంచి కాకతీయుల కళాతోరణం, చార్మినార్ చిత్రాలను తొలగించడమంటే తెలంగాణ చరిత్రను చెరిపేయడమే అవుతుంది. నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల గుండెలను కాంగ్రెస్ ప్రభుత్వం గాయపరుస్తున్నది. కాకతీయ కళాతోరణం తెలంగాణ నేలకు నిలువెత్తు రూపం.
తెలంగాణ చరిత్రలో భాగమైన ఓరుగల్లు కాకతీయుల కళాతోరణం, చార్మినార్ చిహ్నాలతో కూడిన రాష్ట్ర అధికారిక రాజముద్రనే బాగున్నది. ఇప్పుడొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం చిహ్నాలను తొలగిస్తామనడం భావ్యం కాదు. గత పాలకుల హయాంలో జరిగిందనే అక్కసుతోనే కొత్త నాటకం మొదలు పెట్టారు. ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలి. లేకపోతే తెలంగాణ ఉద్యమ తరహాలో పోరాడాల్సి వస్తుంది.
కాకతీయ కళాతోరణం, చార్మినార్ చిత్రాలను తొలగించాలని యోచించడం సరైనది కాదు. ఆ రెండు చిత్రాలను అధికార చిహ్నంలో కొనసాగిస్తూ… అవసరమైతే తెలంగాణ చరిత్రను ప్రతిబించించే అదనపు అంశాలను జోడించుకోవచ్చు. అంతే తప్ప తెలంగాణ చరిత్ర, సంస్కృతికి ప్రతిబింబంగా ఉన్న కళాతోరణం, చార్మినార్ చిత్రాలను తొలగించవద్దు. ఆ రెండు రాచరికపు పాలనకు నిదర్శనాలని చెప్పడం సమంజసం కాదు.