బాన్సువాడ టౌన్, ఏప్రిల్ 4: కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరు తారాస్థాయికి చేరింది. ఇటీవల పార్టీలో చేరిన వ్యక్తికి పదవి ఇవ్వడం హస్తంలో నిప్పు రాజేసింది. దీంతో 24 గంటల వ్యవధిలోనే అతడ్ని తొలగించడం ఉమ్మడి జిల్లాలో చర్చనీయాంశమైంది. మరోవైపు, ఆ నాయకుడ్ని పదవి నుంచి తొలగించడంపై స్పందించిన కొందరు నాయకులు స్వీట్లు పంచుకుని సంబురాలు జరుపుకోవడం కాంగ్రెస్‌లోని గ్రూపు రాజకీయాలను తెరపైకి తెచ్చింది. అసలేం జరిగిందంటే.. బాన్సువాడకు చెందిన పాత బాలకృష్ణ ఇటీవల కాంగ్రెస్‌లో చేరారు. అతడ్ని కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి జిల్లా అధికార ప్రతినిధిగా బుధవారం నియమించడం అంతర్గత వర్గ పోరుకు దారి తీసింది.
పదేండ్లుగా ప్రతిపక్షంలో ఉండి, కాంగ్రెస్ మనుగడ కోసం పోరాడిన తమను కాదని బాలకృష్ణకు పదవి ఇవ్వడంపై సీనియర్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పదవుల కోసం పూటకో పార్టీ మారే వ్యక్తిని ఎలా నియమిస్తారని, ఇలాగైతే తాము కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తామని హెచ్చరించినట్లు తెలిసింది. దీంతో అప్రమత్తమైన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ స్పందించారు. కొన్ని కారణాలతో పాత బాలకృష్ణను పదవి నుంచి తొలగిస్తున్నట్లు పార్టీ శ్రేణులకు సమాచారం పంపించినట్లు తెలిసింది. దీంతో కాంగ్రెస్‌లోని సీనియర్ నాయకులు మిఠాయిలు పంచుకుని సంబురాలు జరుపుకొన్నారు.