ఉమ్మడి జిల్లాకు కేంద్ర మంత్రులు వస్తున్నారు.. పోతున్నారు. లోక్‌సభ ప్రవాస్ యోజన పేరుతో పక్కా రాజకీయ కోణంలోనే పర్యటనలు చేస్తున్నారు. వారి పర్యటనల ద్వారా ప్రజలకు పైసా ఫాయిదా ఉండడం లేదు. వాస్తవానికి జనంతో మమేకం కావడం, కేంద్ర పథకాల ద్వారా ప్రజలకు మంచి చేద్దామన్న సోయి కూడా లేకుండా.. వచ్చామా, వెళ్లామా? అన్న రీతిలో బీజేపీ నేతల పర్యటనలు కొనసాగుతున్నాయి. గతేడాది సెప్టెంబర్‌లో నిర్మలా సీతారామన్ బాన్సువాడకు వచ్చారు. మూడు రోజులు ఉండి బీజేపీ ప్రభుత్వం ఏం ఉద్ధరించిందో చెప్పకుండా, రాష్ట్ర ప్రభుత్వంపైనే విమర్శలు చేశారు. ఇక, తాజాగా మరోకేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల కామారెడ్డికి వచ్చారు. కష్టాల్లో ఉన్న రైతులకు కేంద్రం అండగా ఉంటుందని కనీసం మాట వరుసకైనా ఆయన చెప్పలేదు. పక్కా పొలిటికల్ టూరిస్టుల్లా వచ్చి పోతున్న కేంద్ర మంత్రుల తీరుపై జనం మండిపడుతున్నారు. బీజేపీకి రాజకీయాలే పరమావధి తప్పితే రైతుల గోస పట్టదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
BJP | నిజామాబాద్, ఏప్రిల్ 28, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : భారతీయ జనతా పార్టీ తీరు నవ్విపోదురు గాక నాకేంటి అన్న తీరును తలపిస్తోంది. రాష్ట్ర పర్యనటకు వచ్చే కేంద్ర ప్రభుత్వంలోని పెద్దల్లో ప్రధాని నుంచి కేంద్ర సహాయ మంత్రుల దాకా ఉట్టి చేతులతో ఊపుకుంటూ పోవుడే తప్ప పైసా ప్రయోజనం కరువైంది. ప్రధాని హోదాలో నరేంద్ర మోదీ గత నెలలోనే సికింద్రాబాద్ సభలో పాల్గొన్నారు. అధికారిక కార్యక్రమంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిందించడం తప్ప హామీలు ఇవ్వలేదు. నిధులూ కేటాయించలేదు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేదు. ఇదే బాటలో అమిత్ షా ఇలా వచ్చి… అలా వెళ్లి పోయాడు. కామారెడ్డి జిల్లాలో లోక్‌సభ ప్రవాస్ యోజన పేరుతో కేంద్ర మత్స్య, పశు సంవర్ధక శాఖ మంత్రి పురుషోత్తం రూపాల గురువారం పర్యటించారు. ఈయనతో కూడా పైసా లాభం లేకపోయింది. ఓ వైపు అకాల వర్షం, మరోవైపు వడగళ్ల వానతో రైతులు దిగాలు చెందుతున్నారు. ఈ దశలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి ఆదుకుంటామని హామీ ఇచ్చింది. అనుకోని విపత్తులో అండగా నిలిచింది. ఇవేవి పట్టని కేంద్ర సర్కారులోని బాధ్యతాయుతమైన మంత్రులు కేవలం రాజకీయ పర్యటనలకే పరిమితం అవుతుండడం ప్రజల్లో చర్చనీయాంశమైంది. రైతులు ఎటైనా పోనీ బీజేపీకి కేవలం రాజకీయమే ప్రధానం అన్న తీరుగా వ్యవహరిస్తుండడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
గతేడాది సెప్టెంబర్ మొదటి వారంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కామారెడ్డి జిల్లాలో పర్యటించారు. బాన్సువాడ నియోజకవర్గంలో మూడు రోజుల పాటు కలియ తిరిగి కేవలం తెలంగాణ సర్కారుపై నిందలు వేయడమే పనిగా పెట్టుకున్నారు. విత్త మంత్రి హోదాలో జిల్లాకు వచ్చి ఉట్టి చేతులతోనే వెళ్లి పోయారు. కానీ ఎక్కడా ప్రజల అవసరాలను గుర్తించి నిధులు కేటాయించడం వంటి ఘటనే మచ్చుకూ జరగలేదు. కనీసం పసుపు బోర్డు అంశంపైనా స్పందించనే లేదు. నిర్మలా సీతారామన్ గత ప్రభుత్వంలో వాణిజ్య మంత్రిగా పసుపు బోర్డుకు బదులుగా స్పైసెస్ బోర్డు ఎక్స్టెన్షన్ కార్యాలయాన్ని మంజూరు చేస్తే నాడు ఎంపీగా ఉన్న కల్వకుంట్ల కవిత తిరస్కరించారు.
కేంద్ర ఆర్థిక మంత్రి దృష్టిలో ఉన్న అంశంపైనా నోరు విప్పకుండా పొలిటికల్ టూర్‌తో సరిపెట్టుకున్నారు. బాన్సువాడ పట్టణంలో ఓ రేషన్ షాపులో మోదీ ఫొటో విషయంలో రాద్దాంతం చేసి దేశ వ్యాప్తంగా అపకీర్తిని మూటకట్టుకుని వెనుదిరిగారు. ఇదే పద్ధతిలో ప్రవాస్ యోజన కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి నియోజకవర్గంలో కేంద్ర మత్స్య, పశు సంవర్ధక శాఖ మంత్రి పురుషోత్తం రూపాల పర్యటించారు. ఆయన కూడా అంతే తెలంగాణ ప్రభుత్వాన్ని నిందించడం మినహా హామీలు ఇవ్వడమో, ప్రజల కోసం ఏదైనా వరాలు కురిపించడమో చేయకుండానే వెళ్లిపోయారు.
సీఎం కేసీఆర్‌తో సహా రాష్ట్ర క్యాబినెట్‌లోని మం త్రులెవరైనా జిల్లాలకు వస్తే ఉట్టి చేతులతో వెళ్లడం గగనం. ఎవరొచ్చినా ఆ శాఖకు సంబంధించిన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసి వరాలు కురిపించడం బీఆర్ఎస్ ప్రభుత్వంలో పరిపా టి. అంతేకాకుండా సీఎం కేసీఆర్ నేరుగా పర్యటిస్తే వరాల జల్లును కురిపించడం ఖాయమన్న అభిప్రా యం ప్రజాప్రతినిధుల్లో ఉం ది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో అధికారిక కార్యక్రమాల్లో భాగంగా సీఎం వచ్చినప్పుడల్లా రూ.వందల కోట్లు మంజూరు చేశారు. మంత్రులైతే వారి శాఖల పరిధిలోని అంశాల ఆధారంగా హా మీలు సైతం ఇచ్చిన వారున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోణంలో ఆలోచన చేస్తున్నది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అందుకు పూర్తిగా వ్యతిరేకం. వారికి తెల్లారి లేచిన కాడి నుం చి రాజకీయమే పరమావధి. బీఆర్ఎస్ ప్రభుత్వా న్ని ప్రజల్లో బద్నాం చేయడమే ఎజెండా. సోషల్ మీడియాలో అవాస్తవాలను వ్యాప్తి చేయడమే పనిగా పెట్టుకున్నారు. కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల పర్యటనలో నూ కామారెడ్డిలో జరిగిన మీటింగ్‌లో కేసీఆర్ స ర్కారుపై అబద్ధాలను వల్లె వేయడం ద్వారా బీజీపీ తమ నిజ స్వరూపాన్ని మరోసారి నిరూపించుకున్నట్లయ్యిందని ప్రజలంతా అనుకుంటున్నారు.
బీజేపీకి చెందిన లీడర్లు నిత్యం సోషల్ మీడియాలో కేంద్ర సర్కారు చేయని పనులను చేసినట్లుగా, రాష్ట్ర సర్కారు పథకాలను తమ పథకాలుగా ప్రచారం చేసుకోవడానికి సమయం కేటాయిస్తున్నారు. కానీ క్షేత్ర స్థాయిలో దిగినప్పుడు మాత్రం ప్రజల కోసం ఒక్క మంచి పని చేసిన ఘటనలంటూ ఏమీ లేవు. ఇందుకు ఎనిమిది నెలల క్రితం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటన నుంచి మొదలుకుంటే ప్రస్తుతం కేంద్ర మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి పురుషోత్తం రూపాల వరకు వచ్చి వెళ్లడం తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదు. మత్స్య సంపద, పశు సంవర్ధక రంగంలో తెలంగాణ సర్కారు మేటిగా నిలిచింది. ఆ శాఖలకు చెందిన కేంద్ర మంత్రి పర్యటించిన కామారెడ్డి జిల్లాలోనూ లక్షలాది యూనిట్ల గొర్రెలు, బర్రెల పంపిణీ జరిగింది. కోట్లాది చేప పిల్లలను ఉచితంగానే రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయించి మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపింది. కాని ఎక్కడా కేంద్ర సర్కారు నుంచి పైసా మందం నిధులేవీ లేవు.
వీటిపై కేంద్ర మంత్రి రూపాలా మాట్లాడకపోగా తెలంగాణ సర్కారు గొప్ప పనులను కీర్తించకపోగా… తెలంగాణలో ఏదో నష్టం జరిగినట్లు వ్యాఖ్యలు చేసి పోవడం విడ్డూరంగా మారింది. బీజేపీ తమ స్వార్థ రాజకీయం కోసం కేంద్ర మంత్రులను అడ్డంగా పెట్టుకుని చేస్తున్న యాగిని జనమంతా గమనిస్తున్నారు.