యాప్‌ల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నదని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, బిగాల గణేశ్‌గుప్తా, ఆశన్నగారి జీవన్‌రెడ్డి, గంప గోవర్ధన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతులకు సకాలంలో యూరియా పంపిణీ చేయడంలో రేవంత్‌రెడ్డి సర్కారు ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు. పాలన చేతకాని దద్దమ్మ సీఎం రేవంత్‌రెడ్డి అని ఘాటుగా విమర్శించారు. శనివారం వారు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి, రైతుల పట్ల రేవంత్‌రెడ్డి సర్కార్ అవలంబిస్తున్న తీరును ఎండగట్టారు. యూరియా యాప్‌ను వెంటనే రద్దు చేసి, పాత పద్ధతిలోనే పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.
డిచ్పల్లి, జూన్ 20: రైతుల సంక్షేమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని, రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా సీఎం రేవంత్‌రెడ్డి స్పందించడంలేదని బీఆర్ఎస్ పార్టీ రూరల్ ఇన్చార్జి బాజిరెడ్డి జగన్ ఆరోపించారు. శనివారం ఆయన మండల కేంద్రంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. రైతుల అభ్యున్నతే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలుచేసిందని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు సక్రమంగా అమలు కావడంలేదని, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
రైతుల సంక్షేమాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డికి రైతుల సమస్యలపై అవగాహన లేదని, గ్రామాల్లో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతున్నదని ఆరోపించారు. ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యుల పేరుతో పలు గ్రామాల్లో మొరం, ఇసుక, చెరువుల మట్టి అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని తెలిపారు. కాంగ్రెస్ నాయకులు అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ దోపిడీకి పాల్పడుతున్నారని విమర్శించారు. మంచిప్ప ప్రాజెక్టు ముంపు గ్రామాల రైతులను రెచ్చగొట్టి సిరికొండ వరకు రైతులకు సాగునీరు అందకుండా చేశారని మండిపడ్డారు.