వట్టిపోయిన వాగులు జలకళను సంతరించుకున్నాయి. సీజన్ మొదలైనప్పటి నుంచి ఆశించిన మేర వర్షాలు కురవకపోయినప్పటికీ సాగునీటికి ఢోకా లేదు. అపర భగీరథుడు సీఎం కేసీఆర్ కృషి, మంత్రి వేముల పర్యవేక్షణలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు సత్ఫలితాలు కండ్ల ముందు కనిపిస్తున్నాయి. 300 కిలోమీటర్ల దూరం నుంచి ఎస్సారెస్పీలోకి చేరిన కాళేశ్వరం జలాలు.. ప్యాకేజీ 20, 21తో రైతన్న చెంతన చేరాయి. ఈ అపురూప దృశ్యం.. ఆదివారం జక్రాన్‌పల్లి మండలం చింతలూరు, భీమ్‌గల్ మండలం బడాభీమ్‌గల్‌లో ఆవిష్కృతమయ్యింది. రాష్ట్ర రోడ్లు భవనాలు, హౌసింగ్, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ కాళేశ్వరం జలాలను వాగుల్లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి వేముల మాట్లాడుతూ రైతులకు సాగునీటిని అందించేందుకు కాళేశ్వరం జలాలు జిల్లా చుట్టూ ప్రవహిస్తున్నాయని, సీఎం కేసీఆర్ ఉండగా సాగునీటికి ఢోకా ఉండదని అన్నారు.
భీమ్‌గల్, జూలై 16: వర్షాలు లేకున్నా అన్నదాతకు బాసటగా నిలువడం సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమైందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. భీమ్‌గల్ మండలం బడాభీమ్‌గల్ వద్ద కప్పలవాగులో ప్యాకేజీ 21 పైప్‌లైన్ ద్వారా కాళేశ్వరం జలాలను మంత్రి వేముల ఆదివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి, రైతులు, పార్టీ శ్రేణులతో కలిసి నీటిలో దిగి సంబురాలు చేసుకున్నారు. నీటిని చూస్తూ మురిసిపోయిన మంత్రి.. తన జన్మధన్యమైందని అన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం జలాలు రివర్స్ పంపింగ్ ద్వారా వరద కాలువ నుంచి ఎస్సారెస్పీలోకి చేరుకొని సారంగాపూర్, మెంట్రాజ్‌పల్లి పంప్‌హౌస్ ప్యాకేజీ 20, 21 ద్వారా పెద్దవాగు, కప్పలవాగులోకి విడుదల య్యాయని వివరించారు.
వాగులోకి వస్తున్న కాళేశ్వర జలాలను చూస్తుంటే మనసు పులకించి పోతున్నదని సంతోషం వ్యక్తంచేశారు. జిల్లా రైతులకు సాగునీటిని అందించేందుకు కాళేశ్వరం జలాలను జిల్లా చుట్టూ ప్రవహింపజేస్తూ అందిస్తున్నారన్నారు. బాల్కొండ నియోజకవర్గ రైతులకు ప్యాకేజీ 21 ద్వారా సాగునీరు అందించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. ఈ పథకం ద్వారా వచ్చిన నీటితో పెద్దవాగు, కప్పలవాగు ఎప్పటికీ సజీవంగా ఉంటాయన్నారు. పైప్‌లైన్ ద్వారా ప్రతి మూడు ఎకరాలకూ ఒకసాగు నీటి అవుట్‌లెట్‌ను ఏర్పాటు చేసి.. మిషన్ భగీరథ మాదిరిగా వాల్వు ద్వారా నీటిని అందించనున్నట్లు తెలిపారు. నియోజకవర్గ రైతుల పక్షాన సీఎం కేసీఆర్‌కు మంత్రి వేముల ధన్యవాదాలు తెలిపారు. ఎస్సారెస్పీ నీరందని బాల్కొండ నియోజకవర్గంలోని కొన్ని గ్రామాలు ప్యాకేజీ21 ద్వారా సస్యశ్యామలం కానున్నాయని మంత్రి ఆనందం వ్యక్తంచేశారు.
కాళేశ్వరం జలాలు అందించేందుకు తాను చేస్తున్న కృషిపై నిరాధార ఆరోపణలు, మతిలేని విమర్శలు చేస్తున్న వారికి కండ్లముందు కనిపిస్తున్న ఈ జలాలే సమాధానమని మంత్రి అన్నారు. అంతకుముందు కప్పలవాగు ఒడ్డున ఉన్న పెదంగంటి ఎల్లమ్మ ఆలయంలో మంత్రి వేముల ప్రత్యేక పూజలు చేశారు. కాళేశ్వరం జలాలు విడుదలవుతున్న జక్రాన్‌పల్లి మండలం చింతలూరులో పెద్దవాగు, భీమ్‌గల్ మండలంలోని కప్పలవాగును రైతులు సందర్శించాలని మంత్రి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ ఆర్మూర్ మహేశ్, జడ్పీటీసీ చౌట్పల్లి రవి, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు మొయీజ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు డాక్టర్ మధుశేఖర్, భీమ్‌గల్ సొసైటీ చైర్మన్ నర్సయ్య, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దొన్కంటి నర్సయ్య, పట్టణ అధ్యక్షుడు మల్లెల లక్ష్మణ్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు శర్మానాయక్ పాల్గొన్నారు.