నిజామాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కొన్ని రోజులుగా ఎండలు దంచికొడుతున్నాయి. మధ్యాహ్నం వేళ అగ్నిగుండాన్ని తలపిస్తున్నది. ఉమ్మడి జిల్లాలో ఉదయం నుంచే భానుడు ప్రతాపం చూపడంతో జనాలు బెంబేలెత్తిపోతున్నారు. భానుడి ప్రకోపానికి వడ గాల్పులు కూడా తోడవడంతో బయటికి వెళ్లాలంటే ప్రజలు జంకుతున్నారు. అత్యవసరమైతేనే తగిన జాగ్రత్తలు తీసుకొని బయటికి వెళ్తున్నారు. వీలు దొరికితే చాలా మంది ఇండ్లకే పరిమితమవుతున్నారు. ఉపశమన చర్యలతో ఎండ వేడిమి నుంచి తప్పించుకుంటున్నారు. గతంలో ఎన్న డూ లేని విధంగా నిజామాబాద్ జిల్లాలో మార్చి నెలాఖరుకే గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏప్రిల్ నెలా ఆరంభంతోనూ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.వచ్చే నెలలో మరింత తీవ్రంగా ఎండ వేడిమి ఉండనున్నదని వాతావరణ నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్లానింగ్ డెవలప్మెంట్ సొసైటీ వెల్లడించిన వాతావరణ వివరాల మేరకు ఈ సీజన్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 42డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రత దాదాపుగా 30 డిగ్రీలకు చేరిందంటే ఎండల తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. గరిష్ఠ ఉష్ణోగ్రతలు అంతకంతకు పెరుగుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
రోజురోజుకూ ఎండలు తీవ్రమవుతున్నాయి. వడ దెబ్బ తగలకుండా వృద్ధులు, పిల్లలు జాగ్రత్తలు పాటించాలి. అనారోగ్యానికి గురికాకుండా కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, మజ్జిగ వంటి ద్రవ పదార్థాలను నిత్యం తీసుకోవాలి. నీరు తాగడంతోవృద్ధుల్లో శరీర వేడి తగ్గి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. సమతుల ఆహారంతోపాటు అందుబాటులో ఉండే సీజనల్ పండ్లు తినాలి. ఎండల్లో ఎక్కువగా తిరగడంతో త్వరగా శక్తి కోల్పోతారు. అధికంగా నీటి శాతం ఉన్న ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం ఈ సమయంలో ఎంతో మంచిది.
– డాక్టర్ రాజేశ్వర్, ఛాతి వైద్య నిపుణుడు
ఎండల తీవ్రత పెరుగుతుండడంతో విద్యుత్ వినియోగం కూడా అంతకంతకు పెరుగుతున్నది. వ్యవసాయ అవసరాలకు నీటి వినియోగం తగ్గుముఖం పడుతున్నప్పటికీ, అక్కడక్కడ చివరి తడి కోసం రైతులు ప్రయత్నాలు చేస్తున్నారు. గృహావసరాలకు వినియోగం క్రమంగా పెరుగుతున్నదని ఎన్పీడీసీఎల్ అధికారులు చెబుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో ఈ యాసంగి సీజన్లో 5.20లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. చాలా చోట్ల బోరు బావుల కిందే పంటలు సాగుకు నోచుకోవడంతో మొన్నటి వరకు ప్రతి రోజు 3.09 మిలియన్ యూనిట్ల వాడకం నమోదైంది. నెలన్నర రోజుల క్రితం వరకు 9మిలియన్ యూనిట్లుగా ఉన్న విద్యుత్ డిమాండ్ ఇప్పుడు ఏకంగా 10 మిలియన్ యూనిట్లు దాటింది. మరి కొద్ది రోజుల్లోనే 12 మిలియన్ యూనిట్లను తాకే అవకాశాలున్నాయని ఎన్పీడీసీఎల్ అధికారులు చెబుతున్నారు. వ్యవసాయానికి ఇప్పుడిప్పుడే డిమాండ్ తగ్గుతుండడం, గృహ, వాణిజ్య అవసరాలకు డిమాండ్ పెరుగుతండడంతో విద్యుత్ కొరత లేకుండా, కోతల్లేకుండా సరఫరా చేయడం కోసం పని చేస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఎండ తీవ్రత పెరుగుతున్న కొద్దీ క్రమంగా ఏసీ, ఫ్యాన్లు, కూలర్ల వాడకం పెరుగుతున్నది.