వేల్పూర్/బాల్కొండ, అక్టోబర్ 28: కేసీఆర్ పాలనలో తెలంగాణ నంబర్‌వన్ స్థానంలో ఉన్నదని, కొట్లాడి సాధించుకున్న రాష్ట్రం నేడు దేశానికే ఆదర్శంగా నిలిచిందని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్, బాల్కొండ మండలాల బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశాలను శనివారం ఆయా మండలాల్లో నిర్వహించగా, మంత్రి హాజరయ్యారు. ఎన్నికల్లో ప్రచారం, అనుసరించాల్సిన వ్యూహంపై కార్యకర్తలకు సూచనలు చేశారు. సీఎం కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ మ్యానిఫెస్టో సూపర్ డూపర్‌గా ఉన్నదని వేములు తెలిపారు. సౌభాగ్యలక్ష్మి, రూ.400లకే గ్యాస్, పేద కుటుంబాలకు కేసీఆర్ బీమా తదితర కొత్త పథకాలతోపాటు పింఛన్లు, రైతుబంధు సాయం పెంచనున్నట్లు చెప్పారు. పార్టీ హామీలను కార్యకర్తలు ఇంటింటికీ తీసుకెళ్లాలని కోరారు. వేల్పూర్ మండలంలో సుమారుగా పోలయ్యే ఓట్లు 25వేలు ఉంటాయని తెలిపారు. బీఆర్ఎస్ సంక్షేమ పథకాలు అందుకున్నవారు 26,600 మంది ఉన్నారని స్పష్టం చేశారు. కార్యకర్తలు భేషజాలకు పోకుండా లబ్ధిపొందిన ప్రతి ఒక్కరి మద్దతునూ కూడగట్టి ఓటేయించాలని సూచించారు. సీఎం కేసీఆర్ సహకారంతో బాల్కొండను వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశానని తెలిపారు. అభివృద్ధితోపాటు ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలతో లబ్ధి చేకూరిందన్నారు. బీఆర్ఎస్ సైనికులు కష్టపడితే 90 శాతం ఓట్లు కారు గుర్తుకే వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. తనకు మద్దతుగా ఏకగ్రీవ తీర్మానాలు చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. అంతకు ముందు హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ మధుశేఖర్, డీసీసీబీ వైస్‌చైర్మన్ రమేశ్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు డాక్టర్ భాస్కర్‌యాదవ్, కోటపాటి నర్సింహనాయుడు తదితరులు మాట్లాడుతూ.. ఈ ప్రాంత ఎమ్మెల్యేగా ప్రశాంత్‌రెడ్డి చేసిన అభివృద్ధిని కార్యకర్తలకు వివరించారు. వేములను భారీ మెజారిటీతో గెలిపించేందుకు కార్తకర్తలు కంకణబద్ధులై పని చేయాలని పిలుపునిచ్చారు. స్థానిక మండలాల నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఒకే పార్టీ, ఒకే నాయకుడు..
పార్టీకోసం, ఉద్యమం కోసం తన తండ్రి సురేందర్‌రెడ్డి ఎన్నో త్యాగాలు చేశారని మంత్రి గుర్తుచేశారు. తన కుటుంబం 23 ఏండ్లుగా ఒకే పార్టీ, ఒకే నాయకుడిని నమ్ముకున్నదని, ఎన్నడూ పదవుల కోసం పక్కకు చూడలేని మంత్రి భావోద్వేగానికి లోనయ్యారు. కేసీఆర్ మాటను జవదాటలేదన్నారు. అందుకే అసాధ్యం అనుకున్న ఎన్నో అభివృద్ధి పనులను కేసీఆర్ దయతో సాధ్యం చేసుకున్నామన్నారు.