నస్రుల్లాబాద్, డిసెంబర్ 24: దేశంంలో ఏ రాష్ట్రంలో లేని పథకాలు కేవలం మన రాష్ట్రంలోనే ఉన్నాయని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలంలోని నాచుపల్లి గ్రామంలో 35 డబుల్ బెడ్ రూం ఇండ్లు, రూ.5 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం, రూ.12 లక్షలలో నిర్మించిన ప్రాథమిక సహకార సంఘ గోదాం, రూ.15 లక్షలతో నిర్మించిన ముదిరాజ్ సంఘ భవనం, రూ.10లక్షలతో నిర్మించిన ఎస్సీ కమ్యూనిటీ హాలును శనివారం ఆయన ప్రారంభించారు. అనంతరం రూ.5 లక్షలతో చేపట్టనున్న ఎస్సీ కమ్యూనిటీ భవన నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలకు ఏదో ఒక పథకం ద్వారా సంక్షేమ ఫలాలు అందిస్తున్నారని అన్నారు. ప్రభుత్వ పథకాలు ఎంత మందికి అందుతున్నాయని సభలోని ప్రజలను స్పీకర్ అడుగగా అందరూ చేతులు ఎత్తారు. రాష్ట్రంలో 48 లక్షల మందికి పింఛన్లు అందిస్తున్నారని, ఇందుకోసం ఏడాదికి రూ. 15వేల కోట్లు ప్రభు త్వం కేటయిస్తోందని తెలిపారు. బాన్సువాడ నియోజక వర్గంలో 43వేల మంది లబ్ధిదారులకు పింఛన్లు అందుతున్నాయని తెలిపారు.
పేదల సొంతింటి కల సాకారంచేస్తా..
బాన్సువాడ నియోజకవర్గానికి పదివేల డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరుకాగా, ఇప్పటివరకు ఐదు వేల ఇండ్ల నిర్మాణం పూర్తిచేసి గృహప్రవేశాలు చేశారన్నారు. మరో ఐదువేల ఇండ్లు నిర్మా ణ దశలో ఉన్నాయని తెలిపారు. నియోజకవర్గంలో ఇల్లు లేని పేదలందరికీ సొంతింటి కలను సాకారం చేయడమే తన లక్ష్యమన్నారు. ఇల్లు నిర్మా ణం కోసం రూ.3లక్షల పథకం త్వరలో వస్తుందని, అర్హులేన వారికి మంజూరుచేస్తామని చెప్పారు.
అనంతరం న్యూట్రిషన్ కిట్లపై అవగాహన కల్పించి, గర్భిణులకు అందజేశారు. గ్రామస్తులు వినతి మేరకు రూ.15 లక్షలతో ఎస్సీ కమ్యునిటీ హాలు, రూ.10 లక్షలు పాఠశాల అదనపు తరగతి గదులకు, రూ.5లక్షలు టాయిలెట్స్‌కు, అంగన్వాడీ భవన నిర్మాణం కోసం రూ.10 లక్షలు, మసీద్ కోసం రూ.5లక్షలు, వెటర్నరీ దవాఖాన కోసం రూ.10 లక్షలు మంజూరు చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, ఆర్డీవో రాజాగౌడ్, ఎంపీపీ పాల్త్య విఠల్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పెర్క శ్రీనివాస్, జడ్పీటీసీ సభ్యురాలు జన్నూబాయి, సర్పంచ్ విజయ, జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు మాజిద్, విండో చైర్మన్లు సుధీర్, దివిటి శ్రీనివాస్, గంగారాం, మారుతి, పార్టీ నాయకులు కిశోర్ యాదవ్, ప్రతాప్ సింగ్, హన్మాండ్లు, శ్యామల, సాయిలు, అధికారులు అదితరులు పాల్గొన్నారు.
మెనూ ప్రకారం భోజనం అందించాలి: స్పీకర్
బాన్సువాడ, డిసెంబర్ 24: మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి సూచించారు. శనివారం ఆయన బీర్కూర్‌లోని మహాత్మా జ్యోతిబాఫూలే గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల కోసం వండిన ఆహార పదార్థాలను పరిశీలించారు. మె నూ ప్రకారం పప్పు దినుసులు, మసాలాలను వంట ల్లో వాడి నాణ్యమైన, రుచికరమైన భోజనం వం డారా అని వార్డెన్ , సిబ్బందిని ప్రశ్నించారు. అన్నం కూరలు రుచిగా ఉన్నా యా, సరిపోయేంత పెడుతున్నారా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.
నాణ్యమైన సరుకులు, కూరగాయలను కొనుగోలు చేసి రుచికరమైన ఆహారాన్ని వండాలని లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామని వార్డెన్, సిబ్బందిని హెచ్చరించారు. నూతనంగా నిర్మిస్తున్న స్కూల్ భవనం త్వరలోనే పూర్తవుతుందని, ఇక్కడి నుంచి తరలిస్తామని స్పీకర్ ఈ సందర్భంగా తెలిపారు.