మోర్తాడ్, మే 23: ఢిల్లీకి మూటలు పంపడానికి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఏటీఎంగా మారిందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. నాడు పీసీసీ చీఫ్‌గా ఉన్నపుడే విరాళాల కోసం ఒత్తిడి తీసుకొచ్చారని ఈడీ పేర్కొన్నదని, ఈడీ చార్జిషీట్‌తో రేవంత్‌రెడ్డి బండారం బయటపడిందని శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
నాడు పదవుల ఆశ చూపి విరాళాలు వసూలు చేయగా, నేడు ముఖ్యమంత్రి హోదాలో కూడా అదే జరుగుతున్నదని ఆరోపించారు. కాంగ్రెస్ విరాళాల వసూళ్లు కొనసాగుతున్నాయన్నది ఈడీ చార్జిషీట్‌తో మరోమారు స్పష్టమయ్యిందని తెలిపారు. కమీషన్లు లేనిదే పనులు కావడం లేదని మంత్రి కొండా సురేఖ స్వయంగా చెప్పారని, 30 శాతం కమీషన్లు అని కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి బహిరంగంగా చెప్పారని.. రేవంత్‌రెడ్డి ఇప్పుడేమంటారని అని ప్రశ్నించారు. ఆర్ఆర్ టాక్స్ అని స్వయంగా ప్రధానమంత్రి చెప్పినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని, కేంద్రం ఇప్పటికైనా వెంటనే చర్యలు తీసుకోవాలని వేముల డిమాండ్ చేశారు.