యాసంగి పెట్టుబడికి రైతుబంధు సాయాన్ని అందించేందుకు సర్కారు సర్వం సిద్ధం చేసింది. నేటి నుంచి డబ్బులు జమ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. వానకాలం, యాసంగి పంటలకు ఎకరానికి రూ.5వేల చొప్పున ఏడాదికి రూ.10వేలు అందజేస్తున్నారు. ఈ నెల 20వ తేదీ వరకు వ్యవసాయశాఖ అధికారుల వద్ద ఉన్న వివరాల ప్రకారం రైతుబంధుకు అర్హులైన అన్నదాతల జాబితాను రూపొందించారు. ఇప్పటి వరకు తొమ్మిది విడుతల్లో పెట్టుబడి సాయం అందించగా.. ప్రస్తుతం పదో విడుత నేటి నుంచి చేయనున్నారు.
ఎనిమిదేండ్ల కిందట..(సమైక్యపాలనలో..)
పంట సీజన్ ముంచుకొస్తున్నది. రైతుల గుండెల్లో దడ పుట్టిస్తున్నది. గతంలో వేసిన పంటపై వచ్చిన ఆదాయమంతా వడ్డీలు, అప్పుల చెల్లింపులకే సరిపోయింది. మిగిలిన పైసలు కాస్తా కుటుంబపోషణకే సరిపోవు. ఇప్పుడు పంట ఎట్ల వేయాలి. బ్యాంకులకు వెళ్తే సవాలక్ష కొర్రీలు.. మిగిలింది ఒక్కటే మార్గం. మళ్లీ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించడం. రూ.2 నుంచి రూ.4 వడ్డీ రేటుతో అప్పులు తీసుకోవడమే. కాలం కలిసి రాక నష్టాలొస్తే.. రైతు చూపు ఉరి కంభంపై చూసిన గడ్డు పరిస్థితులు.
ప్రస్తుతం…(సీఎం కేసీఆర్ పాలనలో..)
పంట సీజన్ వచ్చిందంటే చాలూ… రైతుల ముఖాల్లో నవ్వులు. మద్దతు ధర పొంది లాభాలు ఆర్జించిన రైతులు.. తదుపరి పంట కోసం చేయి చాచాల్సిన అవసరం లేకుండా పోయింది. సాగు సమయంలోనే సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన రైతుబంధు ఆర్థిక సాయం వచ్చి రైతు ఖాతాల్లో పడుతున్నది. ఇంకేముంది పంటకు కావాల్సిన ఎరువులు, విత్తనాలు, ఇతరత్రా ఖర్చులన్నీ తీరుతున్నాయి. దీంతో చిన్న, సన్నకారు రైతులంతా హర్షం వ్యక్తంచేస్తూ సాగును సంబురంగా నిర్వహిస్తున్నారు.
ఖలీల్‌వాడి/ రామారెడ్డి, డిసెంబర్ 27:యాసంగి సీజన్ వచ్చేసింది. దీంతో రైతుబంధు నిధుల విడుదల చేసేందుకు సర్కారు సిద్ధమయ్యింది. రైతును రాజును చేయాలన్న ఆకాంక్షతో సీఎం కేసీఆర్ ఆలోచనలో నుంచి పుట్టిందీ రైతుబంధు. 2018వ సంవత్సరం నుంచి ప్రారంభమైన రైతుబంధు పెట్టుబడి సాయం పంపిణీ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుతున్నది. ఇప్పటి వరకు తొమ్మిది విడుతలుగా పెట్టుబడిసాయం అందజేసిన కేసీఆర్ సర్కారు.. పదో విడుత పంపిణీకి సర్వం సిద్ధంచేసింది. ఈ నెల 28(బుధవా రం) నుంచి రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం డబ్బులను వేయనున్నది.
పెరిగిన లబ్ధిదారులు…
నిజామాబాద్ జిల్లాలో రైతుబంధు ద్వారా ఈ యాసంగి సీజన్లో సుమారు 2.78లక్షల మందికి ప్రయోజనం చేకూరనున్నది. వీరందరికీ ఎకరానికి రూ.5 వేల చొప్పున రూ.2.74కోట్లకు పైగా వారి ఖాతాల్లో జమ చేయనున్నది. పట్టా పాస్‌బుక్‌లు కలిగి ఉన్న వారందరికీ రైతుబంధు అందనున్నదని అధికారులు చెబుతున్నారు. ఇటీవల కొత్తగా రిజిస్ట్రేషన్ చేయించుకొని పట్టాలు పొందిన రైతులకు కూడా లబ్ధి చేకూరేలా ప్రభుత్వం అవకాశం కల్పించింది. కొత్త అర్హత పొందిన వారు సుమారు 7,176 మంది ఉన్నట్లు సమాచారం. 2022 వానకాలంలో జిల్లాలో 2,54,155 మంది రైతుల కోసం రూ.265.45 కోట్లు నిధులు వెచ్చించారు. యాసంగిలో కూడా ఇదే ప్రాతిపదికన నిధులు విడుదలయ్యే అవకాశం ఉన్నది. పట్టాదారు పాసు పుస్తకాల్లో పేర్ల మార్పులు, ఆస్తి బదలాయింపు వంటి చర్యలతో లబ్ధిదారుల సంఖ్య, మంజూరయ్యే నిధుల్లో స్వల్పంగా తేడాలుండనున్నాయి.
దరఖాస్తు చేసుకోవాలి..
యాసంగి సీజన్‌కు సంబంధించిన రైతుబంధు పంట పెట్టుబడి సాయం నేటి నుంచి జమకానున్నది. ఈ నెల 20లోగా కొత్తగా పాసుపుస్తకం పొందిన రైతులు జనవరి 7వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలి. లబ్ధిపొందిన వారు తిరిగి పత్రాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. వారి పరిధిలో ఏఈవోలను సంప్రదించాలి. వారుఇచ్చిన వివరాలను ఈ నెలాఖరులోగా ఆన్లైన్ చేసి సర్కారుకు నివేదిస్తాం. ఈసారి కూడా అందరికీ విడుతల వారీగా ప్రయోజనం చేకూరనున్నది.
– భాగ్యలక్ష్మి, జిల్లా వ్యవసాయాధికారి, కామారెడ్డి
కామారెడ్డిలో…
రైతుబంధు పెట్టుబడి సాయం పంపిణీకి కామారెడ్డి జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తిచేసింది. ఈ నెల 20వరకు పట్టా పాసు పుస్తకాలు పొందిన రైతులతో కలిపి 2,98,870 మందిని అర్హులుగా గుర్తించారు. ఎకరానికి రూ.5వేల చొప్పున రైతుల బ్యాంకు ఖాతాలో వేయనున్నారు. మొదట చిన్న, సన్నకారు రైతుల ఖాతాల్లో వేసిన అనంతరం దశల వారీగా మిగతా అందరికీ పెట్టుబడి సాయం డబ్బులు వేస్తారు. కామారెడ్డి జిల్లాకు చెందిన రైతులందరికీ కలిపి మొత్తం రూ.260కోట్ల17లక్షలు జమ చేయనున్నారు. వానకాలం సీజన్ కన్నా యాసంగిలో మరో 9878 మందికి లబ్ధి చేకూరనున్నది.