తెలంగాణ రాష్ట్రంపై పార్లమెంట్ సాక్షిగా విషం కక్కిన ప్రధాని మోదీపై తెలంగాణ సమాజం తిరగబడింది. తక్షణమే ఆయన క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేసింది. మోదీ అనుచిత వ్యాఖ్యలకు వ్యతిరేకంగా బుధవారం ఉమ్మడి జిల్లాలో ఆందోళనలు మిన్నంటాయి. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లాలో గులాబీ శ్రేణులు పెద్దఎత్తున నిరసనలు చేపట్టాయి. నల్లబ్యాడ్జీలు ధరించి పలుచోట్ల ధర్నాలు, రాస్తారోకోలు, బైక్‌ర్యాలీలు చేపట్టిన టీఆర్ఎస్ కార్యకర్తలు.. బీజేపీ సర్కారుకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఆర్మూర్‌లో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో కేంద్రప్రభుత్వ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించారు. నిజామాబాద్ నగరంలో టీఆర్ఎస్ కార్యకర్తలు భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు.
నిజామాబాద్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియపై నోటికొచ్చినట్లు మాట్లాడిన దేశ ప్రధాని నరేంద్ర మోదీపై తెలంగాణ సమాజం తిరగబడింది. తక్షణం క్షమాపణ చెప్పాలంటూ ఆయనకు వ్యతిరేకంగా ఆందోళనలు మిన్నంటాయి. పార్లమెంట్ వేదికగా పీఎం చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్ర సమితి తీవ్రంగా మండిపడింది. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బుధవారం పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఉదయమే గులాబీ శ్రేణులంతా రోడ్డెక్కి ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. పలు చోట్ల భారీ బైక్ ర్యాలీలు, నల్ల బ్యాడ్జీలు ధరించి బీజేపీ సర్కారుకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. మోదీ… డౌన్… డౌన్… అన్న నినాదాలతో ఉభయ జిల్లాలు దద్దరిల్లాయి. ప్రధాని మోదీ నోరు అదుపులో పెట్టుకోవాలంటూ తెలంగాణవాదులంతా హెచ్చరించారు. నూతన రాష్ట్రంపై కేంద్రం చూపిస్తున్న వివక్ష, కక్షసాధింపు విధానం మోదీ మాటల రూపంలో బహిర్గతమైందని ప్రజలంతా అనుకుంటున్నారు.
నిజామాబాద్ నగరంలో ఎమ్మెల్యే గణేశ్ గుప్తా పిలుపుతో ఉదయమే వేలాది మంది కార్యకర్తలు పోగై బీజేపీకి వ్యతిరేకంగా ఉద్యమించారు. టీఆర్ఎస్ నేతలంతా నిజామాబాద్ నగరంలో భారీ ర్యాలీని నిర్వహించారు. ఇందులో దాదాపు 6వేల మంది క్రియాశీలక కార్యకర్తలతో బైక్ ర్యాలీ నిర్వహించినట్లుగా నేతలు చెబుతున్నారు. కలెక్టరేట్ గ్రౌండ్ నుంచి మొదలుకొని ఎన్టీఆర్ చౌరస్తా, రైల్వేస్టేషన్, బస్టాండ్, నెహ్రూ చౌరస్తా, ఖిల్లా, వర్ని చౌరస్తా, ఆర్ఆర్ చౌరస్తా, ఫులాంగ్ మీదుగా తిరిగి ధర్నా చౌక్ వద్దకు ర్యాలీ చేరుకున్నది. దారి పొడవునా టీఆర్ఎస్ జెండాలతో కదిలిన గులాబీ దండు… ప్రధానమంత్రి మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ముందుకు కదిలారు. రాష్ట్ర ఏర్పాటుపై అడ్డగోలుగా మాట్లాడినందుకు మోదీ దిష్టిబొమ్మను ఎన్టీఆర్ చౌరస్తా వద్ద దహనం చేసి తమ ఆగ్రహాం వ్యక్తం చేశారు. బాన్సువాడ నియోజకవర్గంలోని 8మండలాల్లో నిరసన కార్యక్రమాలు దద్దరిల్లాయి. బాన్సువాడ గులాబీ సైన్యం పెద్ద ఎత్తున మోదీకి వ్యతిరేకంగా నిరసనల్లో పాల్గొన్నది. డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి నేతృత్వంలో బాన్సువాడ, బీర్కూర్, నస్రుల్లాబాద్తోపాటు ఆయా మండలాల్లో మోదీ దిష్టిబొమ్మను ఊరేగించి దహనం చేశారు. డిచ్‌పల్లిలో ఎమ్మెల్సీ వీజీగౌడ్, డీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ ఆధ్వర్యంలో మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. కామారెడ్డిలో టీఆర్ఎస్ అధ్యక్షుడు ముజీబుద్దీన్ నేతృత్వంలో నిరసనలు మిన్నంటాయి. బాల్కొండలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశాలతో అన్ని మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. భారీగా జనం రోడ్డెక్కి ఉద్యమస్ఫూర్తిని చాటి చెప్పారు.
ఆర్మూర్ నియోజకవర్గంలో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ఆందోళనలు ధూంధాంగా జరిగాయి. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడి హోదాలో ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి స్వయంగా నిరసన కార్యక్రమాల్లో పాల్గొని శ్రేణులను ఉత్తేజ పరిచారు. జిల్లా అధ్యక్షుడిగా నియామకమైన తర్వాత జీవన్ రెడ్డి పాల్గొన్న తొలి కార్యక్రమం ఇదే కావడం విశేషం. ఆర్మూర్ పట్టణంలో వందలాది మంది టీఆర్ఎస్ శ్రేణులతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని పుర వీధుల్లో కలియ తిరుగుతూ మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నల్లదుస్తులు ధరించిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి.. తనదైన శైలిలో ప్రధాని మోదీకి నిరసన తెలిపారు. స్వర్గరథంలో మోదీ దిష్టిబొమ్మను ఊరేగించారు. పలువురు కార్యకర్తలు ఏకంగా ఏడుపులు, పెడబొబ్బలతో ప్రధాని మోదీకి నిరసన తెలిపారు. అనంతరం దిష్టిబొమ్మను దహనం చేశారు. 14ఏండ్ల ఉద్యమంతో దక్కిన స్వరాష్ట్ర ఆకాంక్షపై ఇంకోసారి నోరు జారితే ప్రధాని మోదీకి ఇంతకన్నా ఎక్కువే నిరసన ఉంటుందని నేతలు హెచ్చరించారు. అంబేద్కర్ చౌరస్తాలో జడ్పీ చైర్మన్ విఠల్‌రావుతో కలిసి బీజేపీ, ప్రధానమంత్రిపై నిప్పులు చెరిగారు. పార్లమెంట్లో నరేంద్రమోదీ వ్యవహరించిన తీరుకు దీటైన జవాబిచ్చేందుకు జీవన్‌రెడ్డి వినూత్న రీతిలో నిరసన తెలపడం ప్రత్యేకతను చాటుకున్నది.