DGP CV Anand | వినాయక్ నగర్, జూన్ 8 : పోలీస్ శాఖలో సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత సమర్థవంతంగా వినియోగించుకునేందుకు సీసీడీఎన్ఎస్ 2.0(క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టం), ఈ-సాక్ష్య అమలుపై డైరెక్టర్ జనరల్ పోలీస్ ఆఫ్ పోలీస్ సీవీ ఆనంద్ పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో నిజామాబాద్ జిల్లా పోలీస్ అధికారులు పాల్గొన్నారు. సీసీటీఎన్ఎస్ 2.0 ద్వారా నేరాలు, నేరస్తుల సమాచారాన్ని వేగవంతంగా నమోదు చేయడంతో పాటు దర్యాప్తు ప్రక్రియను డిజిటలైజ్ చేయడం, ప్రజలకు అందించే సేవలను మరింత పారదర్శకంగా/సమ్మర్థవంతంగా చేయడంపై డీజీపీ సూచనలు చేశారు.
ఈ-సాక్ష్య వ్యవస్థ ద్వారా నేర సంఘటనకు సంబంధించిన డిజిటల్ ఆధారాలు సేకరించడం, భద్రపరచడం, కోర్టు విచారణలో సమర్పించే విధానాన్ని మరింత స్పటిష్టంగా అమలు చేయాలని ఆయన సూచించారు. సంబంధిత అధికారులు ఈ వ్యవస్థల వినియోగంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. పోలీస్ వ్యవస్థను ఆధునికరించడం, దర్యాప్తు నాణ్యతను పెంపొందించడం, ప్రజలకు మెరుగైన సేవలు అందించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేయాలని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా అధికారుల నుండి డిజిటల్ వ్యవస్థ అమలు పురోగతిపై వివరాలు తెలుసుకొని, అవసరమైన మార్గదర్శకాలను జారీ చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో నిజామాబాద్ అదనపు డీసీపీ శుభం ప్రకాష్, నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, ట్రాఫిక్, సీటీసీ ఏసీపీలు ప్రకాష్ యాదవ్, వెంకటేశ్వర్ రెడ్డి, శ్రీనివాస్, మస్తాన్ అలీ, రాజశేఖర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి, మల్లేష్, సీసీఆర్బీ, సీపీఆర్ సీఐలు అంజయ్య, వీరయ్యతోపాటు సీఐలు, ఎస్ఐలు, ఐటీ కోర్స్ సిబ్బంది, స్టేషన్ రైటర్లు, రేషన్ టెక్నీషియన్స్ తదితరులు పాల్గొన్నారు.