డిచ్పల్లి/ ఆర్మూర్, అక్టోబర్ 3:జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమైన డిజిటల్ కార్డుల సర్వేను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు ఆదేశించారు. తప్పుల్లేకుండా కుటుంబ వివరాలను నమోదు చేయాలన్నారు. గురువారం డిచ్పల్లి మండలం సాంపల్లిలో, ఆర్మూర్‌లో ప్రారంభించిన డిజిటల్ కార్డుల సర్వే ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. ఫ్యామిలీ డేటాబేస్ ఆధారంగా అధికారులు సర్వే నిర్వహిస్తున్న తీరును పరిశీలించి పలు సూచనలు చేశారు.
ఎలాంటి తప్పిదాలకు అవకాశం లేకుండా అన్ని వివరాలను సక్రమంగా పొందుపర్చాలన్నారు. ఇంటి నెంబర్, చిరునామా, కుటుంబ యజమాని, కుటుంబ సభ్యులకు యజమానితో గల సంబంధం వంటి వివరాలను పక్కాగా నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు. నిర్ణీత సమయంలోగా సర్వేను పూర్తి చేయాలని, ప్రతి ఇంటిని సందర్శిస్తూ ఏ ఒక్క కుటుంబం కూడా తప్పిపోకుండా నూటికి నూరు శాతం డిజిటల్ సర్వే నిర్వహించాలని ఆదేశించారు. సర్వేను పకడ్బందీగా పర్యవేక్షించాలని సంబంధిత అధికారులకు సూచించారు. అదనపు కలెక్టర్ అంకిత్, డిచ్పల్లి ఎంపీడీవో రవీందర్, తహసీల్దార్ ప్రభాకర్, ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ లావణ్య, ఆర్డీవో రాజాగౌడ్, కమిషనర్ రాజు పాల్గొన్నారు.
కామారెడ్డి, అక్టోబర్ 3 : ఇంటింటి కుటుంబ సర్వేను పక్కాగా నిర్వహించాలని కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ ఆదేశించారు. గురువారం కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 6వ వార్డులో చేపట్టిన కుటుంబ సర్వేను ఆయన పరిశీలించారు. జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ కింద చేపడుతున్న ఇంటింటి కుటుంబ సర్వేను సమగ్ర వివరాలతో పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. ఆర్డీవో రంగనాథ్‌రావు, మున్సిపల్ చైర్పర్సన్ ఇందుప్రియ, మున్సిపల్ కమిషనర్ సుజాత, టీం సభ్యులు పాల్గొన్నారు.