ప్రజారోగ్యంపై అధికారులకు పట్టింపులేకుండా పోయింది. శుద్ధ జలాలను సరఫరా చేయాల్సి ఉండగా.. ఫిల్టర్ చేయకుండానే నీటిని సరఫరా చేయడంతో పట్టణ ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. జిల్లా కేంద్రం కామారెడ్డిలోని భారత్ రోడ్, పెద్ద బజార్ కాలనీల్లో బుధవారం ఉదయం కుళాయిల ద్వారా సరఫరా అయిన నీటిని చూసి ప్రజలు అవాక్కయ్యారు. ప్రతిరోజూ మాదిరిగానే కామారెడ్డి పెద్ద చెరువు నుంచి మున్సిపల్ అధికారులు తాగునీటిని వదిలారు. కుళాయిల ద్వారా వచ్చిన నీటిని పట్టుకున్న ప్రజలు.. వాటి రంగును చూసి కంగుతిన్నారు. నీటిని ఫిల్టర్ చేయకుండానే సరఫరా చేశారని కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తంచేశారు.
-కామారెడ్డి, జూలై 16
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇంటింటికీ మిషన్ భగీరథతో పాటు కుళాయిల ద్వారా శుద్ధ జలాలు సరఫరా అయ్యేవి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం నీటి గోస ఏర్పడుతున్నదని పట్టణ ప్రజలు అంటున్నారు. బల్దియా అధికారులు ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. నీటిని సరఫరా చేసే పైప్లైన్లు లీకేజీ అవుతున్నా పట్టించుకోవడం లేదని, పర్యవేక్షణ కూడా కరువైందని ఆవేదన చెందుతున్నారు. తమ కాలనీలకు బోర్లు అందుబాటులో లేవని, కుళాయి నీటిపైనే ఆధారపడాల్సి ఉంటుందని తెలిపారు. ఈ విషయమై కలెక్టర్ స్పందించి, తగిన చర్యలు తీసుకోవాలని, శుద్ధ జలాలు సరఫరా చేసేలా చూడాలని భారత్ రోడ్, పెద్ద బజార్ కాలనీల ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై బల్దియా కమిషనర్ రాజేందర్‌రెడ్డిని ఫోన్లో సంప్రదించగా.. ఎక్కడైనా పైప్ లీకేజీ అవుతుందో పరిశీలించి, తగిన చర్యలు తీసుకుంటామన్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని తెలిపారు.
గ్రామాల్లో పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులు సమీక్షలు నిర్వహించి.. గ్రామ స్థాయి అధికారులకు తెలియజేస్తున్నారు. కానీ క్షేత్ర స్థాయిలో పరిస్థితి ఎలా ఉన్నదనే విషయాన్ని పరిశీలిం
వానాకాలం కావడంతో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలు ఉంటాయని, ప్రజలకు అవగాహన కల్పించాలని చెబుతున్నారు. కాచి చల్లార్చిన నీరు తాగేలా అవగాహన కల్పించాలని చెబుతున్నారు. కానీ కుళాయిల ద్వారా కలుషిత నీరు సరఫరా అవుతున్నా పట్టించుకోవడం లేదు. సమీక్షలకే పరిమితం కాకుండా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎలా ఉందో ఉన్నతాధికారులు తెలుసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. పారిశుద్ధ్య లోపం, కలుషిత నీటి ప్రభావంతో కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలంలో ఒక్కరోజే 13 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి.
మా కాలనీలో బోర్లు లేవు. కుళాయి నీటినే తాగుతాం. వంటకు కూడా వీటినే ఉపయోగిస్తం. ఈరోజు నీరు బాగా మురికిగా వచ్చింది. ఈ నీళ్లు తాగితే ఆరోగ్యం దెబ్బతింటది. మున్సిపల్ అధికారులు తగిన చర్య లు తీసుకొని, శుభ్రమైన నీటిని సరఫరా చేయాలి.
– మంద శ్రావణి, కాలనీవాసి
కామారెడ్డి పెద్ద చెరువు నుంచి నీటిని శుద్ధి చేయకుండానే సరఫరా చేస్తున్నరు. అందుకే నీళ్లు ఇలా మురికిగా వస్తున్నాయి. మురికి నీరు తాగితే రోగాలు వస్తాయి. అధికారులు పట్టించుకోకపోవడంతోనే ఇలా జరుగుతున్నది. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలి.
– కుర్తి రమేశ్, కాలనీవాసి