గాంధారి, డిసెంబర్ 24: పోటీ పరీక్షకు సన్నద్ధమవుతున్న యువతి ఆత్మహత్య చేసుకోవడంతో కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలో విషాదం నెలకొంది. మండలంలోని ఆవులకుంట తండాకు చెందిన గుగ్లోత్ బావుసింగ్, లాడుబాయి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. రెండో కుమార్తె సురేఖ (25) చిన్నప్పటి నుంచే చదువులో ముందుండేది. కామారెడ్డిలో డిగ్రీ, ఓయూలో పీజీ పూర్తిచేసిన ఆమె.. జీవితంలో ఉన్నతంగా ఎదగాలనే లక్ష్యంతో పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నది.
ఈ క్రమంలో గత సంవత్సర కాలంగా హైదరాబాద్ అశోక్‌నగర్‌లోని ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నది. ఏం జరిగిందో ఏమో కానీ, సోమవారం రాత్రి హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలియడంతో కుటుంబ సభ్యులు గుండెలు బాదుకుంటూ హైదరాబాద్‌కు వెళ్లారు. ఉన్నతోద్యోగం సాధించి తండా పేరు నిలబెడుతుందనుకున్న యువతి ఇలా అకస్మాత్తుగా మృతి చెందడంతో స్థానికంగా విషాద ఛాయలు నెలకొన్నాయి.
సురేఖ కుటుంబ సభ్యులను ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దాసోజు శ్రావణ్, గెల్లు శ్రీనివాస్ పరామర్శించారు. ఆవులకుంట తండాకు చెందిన సురేఖ ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలియగానే జాజాల తదితరులు గాంధీ దవాఖానకు వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అక్కడి పోలీసులతో మాట్లాడి ఆత్మహత్యకు గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.