ఉమ్మడి జిల్లాలో శనివారం ఒకవైపు విషాదం, మరోవైపు దారుణం చోటుచేసుకున్నది. కామారెడ్డి జిల్లాలో వివిధ కారణాలతో వేర్వేరు చోట్ల ముగ్గురు బలవన్మరణానికి పాల్పడగా, నిజామాబాద్ జిల్లా బోధన్ ఆర్టీసీ డిపో వద్ద ఓ ఉద్యోగి ఆత్మహత్యా యత్నం చేశాడు. లింగంపేట మండలం శెట్పల్లిసంగారెడ్డిలో పరీక్ష బాగా రాయలేదనే తీవ్ర మనస్థాపంతో ఓ ఇంటర్ విద్యార్థి పురుగుల మందుతాగి తనువు చాలించగా, పాల్వంచ మండలం సింగరాయి పల్లిలో వ్యక్తిగత కారణాలతో ఓ వివాహిత చున్నీతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. బాన్సువాడ మండలంలోని దేశాయిపేట్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రికార్డు అసిస్టెంట్‌గా పనిచేస్తున్న కోటగిరి మండలం దోమల ఏడ్గి గ్రామానికి చెందిన షేక్ హైమద్ కళాశాల భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కోటగిరి మండల కేంద్రంలో ఓ కసాయి కొడుకు తల్లిని హతమార్చాడు. ఈ ఘటనలు బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపాయి.
రామారెడ్డి, ఫిబ్రవరి 28: వ్యక్తిగత కారణాలతో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన పాల్వంచ మండలం సింగరాయిపల్లి గ్రామంలో శుక్రవారం చోటుచేసుకున్నది. రామారెడ్డి ఎస్సై రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన తెడ్డు అనిత(22) వ్యక్తిగత కారణాలతో తన పాత ఇంటిలో శుక్రవారం సాయంత్రం దూలానికి చున్నీతో ఉరేసుకున్నది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు.
మృతురాలి మేనత్త తెడ్డు శామవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ దవాఖానకు తరలించినట్లు పేర్కొన్నారు.
వినాయక్‌నగర్, ఫిబ్రవరి 28: లండన్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ఓ విద్యార్థి మృత్యువాత పడ్డాడు. నగరంలోని శ్రీనగర్‌కు చెంది న ప్రసాద్, రేణుక దంపతుల కుమారుడు సాయి శ్రీకర్ (27) బీటెక్ పూర్తిచేసుకొని ఉన్నత చదువులు అభ్యసించేందుకు కొంతకాలం క్రితం లండన్ వెళ్లాడు. సాయిశ్రీకర్ తన మిత్రులతో కలిసి నివాసం ఉంటున్న లండన్‌లోని క్రోడియన్ డప్పాస్ హిల్స్ ప్రాంతంలో మంగళవారం అర్ధరాత్రి అనంతరం అగ్నిప్రమాదం సంభవించినట్లు తెలిసింది. ఈ ప్రమాదంలో శ్రీకర్ తీవ్ర గాయాలపాలవడంతో అక్కడి దవాఖానలో చేర్పించారు. సుమారు మూడు రోజుల వరకు కాలిన గాయాలతో మృత్యువుతో పోరాడిన సాయిశ్రీకర్ శుక్రవారం రాత్రి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు లండన్ నుంచి సమాచారం అందింది. తమ కుమారుడు ఇక లేడనే విషయం తెలియడంతో సాయిశ్రీకర్ తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సాయిశ్రీకర్ మృతదేహం కోసం కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు.
కోటగిరి, ఫిబ్రవరి 28: కోటగిరి మండల కేంద్రంలో దారుణం చోటుచేసుకున్నది. కన్నతల్లిని ఓ కసాయి కొడుకు కడతేర్చాడు. మద్యానికి బానిసై తాగడానికి డబ్బులు ఇవ్వనందుకు దారుణంగా హతమార్చాడు. స్థానిక ఎస్సై సునీల్ తెలిపిన వివరాల ప్రకారం.. కోటగిరి మండల కేంద్రానికి చెందిన భూమవ్వ(70)కు కుమారుడు మానాజీ, కూతురు మాదవ్వ ఉన్నారు. మాదవ్వ అదే గ్రామంలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నది. మానాజీ మద్యానికి బానిసయ్యాడు. శుక్రవారం రాత్రి తనకు మద్యానికి డబ్బులు ఇవ్వనందుకు ఆవేశంతో ఇంట్లో ఖాళీ సీసా, రోకలి కర్రతో తలపై కొట్టగా భూమవ్వ అక్కడికక్కడే చనిపోయింది. అనంతరం ఎవరూలేని సమయంలో అర్ధరాత్రి దీపం నూనెను భూమవ్వ ఒంటిపై పోసి నిప్పంటించగా, మెడభాగం వద్ద మోకాళ్ల వరకు కాలిపోయింది. ఉదయం విషయం తెలుసుకున్న మృతురాలి కూతురు మాదవ్వ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో వారు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై సునీల్ తెలిపారు.
బాన్సువాడ రూరల్, ఫిబ్రవరి 28 : బాన్సువాడ మండలంలోని దేశాయిపేట్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రికార్డు అసిస్టెంట్‌గా పనిచేస్తున్న షేక్ హైమద్ (52) శనివారం కళాశాల భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నస్రుల్లాబాద్ ఎస్సై రాఘవేంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. కోటగిరి మండలం దోమల ఏడ్గి గ్రామానికి చెందిన హైమద్ నాలుగేండ్లుగా డిగ్రీ కళాశాలో రికార్డు అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. రంజాన్ మాసం కావడంతో ఉపవాస దీక్షలు పాటిస్తున్నాడు. అయితే రెండు రోజులుగా కొద్దిగా మతిస్థిమితం కోల్పోయినట్లు ప్రవర్తించసాగాడు. శనివారం ఆకస్మాత్తుగా కళాశాల భవనం నుంచి కిందికి దూకగా, తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబీకులు అక్కడికి చేరుకొని బోరున విలపించారు. ప్రిన్సిపాల్ ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా అప్పటికే అతడు మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. శవ పంచనామా అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ప్రభుత్వ దవాఖానకు తరలించినట్లు తెలిపారు.
లింగంపేట, ఫిబ్రవరి 28: పరీక్ష సరిగా రాయలేదని, ఫెయిల్ అవుతాననే భయంతో ఓ ఇంటర్ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన లింగంపేట మండలం శెట్పల్లిసంగారెడ్డి గ్రామంలో చోటుచేసుకున్నది. ఎస్సై దీపక్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సంగెపు శివకుమార్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఫిబ్రవరి 26వ తేదీన మొదటి పరీక్షకు హాజరయ్యాడు. పరీక్ష సరిగా రాయకపోవడంతో ఫెయిల్ అవుతాననే భయంతో శుక్రవారం ఉదయం వ్యవసాయ పొలం వద్ద ఎవరూ లేని సమయంలో గడ్డి మందు తాగాడు. అనంతరం శివకుమార్ ఇంటి వద్ద ఉన్న తన సోదరికి సమాచారం ఇచ్చాడు. హుటాహుటిన కుటుంబీకులు పొలం వద్దకు చేరుకొని శివకుమార్‌ను కామారెడ్డి ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రైవేటు దవాఖానకు తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. మృతుడి తండ్రి పోచయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి శవ పంచనామా నిర్వహించినట్లు చెప్పారు. మృతుడికి తల్లి నిర్మల, తండ్రి పోచయ్యతో పాటు ఇద్దరులు సోదరిమణులు ఉన్నట్లు తెలిపారు.
శక్కర్‌నగర్, ఫిబ్రవరి 28: ఆర్టీసీ అధికారులు తాను కోరిన డ్యూటీ కేటాయించలేదని ఆగ్రహంతో ఓ ఉద్యోగి డిపో వద్ద శనివారం ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపగా, ఈ విషయం బయటికి పొక్కకుండా అధికారులు ఎంత జాగ్రత్త పడినా, అప్పటికే వైరల్‌గా మారింది. సదరు ఉద్యోగికి రోజుమాదిరిగానే డ్యూటీ కేటాయించారు. తాను ఆ డ్యూటీకి వెళ్లబోనని, అధికారులు ఇష్టారాజ్యంగా విధులు కేటాయిస్తున్నారని ఆరోపిస్తూ ఓ తాడుతో డిపో గేట్ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం. అక్కడే విధుల్లో ఉన్న కొందరు అతడిని అడ్డుకుని సముదాయించి పంపించారు. ఈ విషయమై డిపో మేనేజర్ విశ్వనాథ్‌ను వివరణ కోరగా తమ డిపోలో ఇలాంటి ఘటన జరుగలేదని, ఇది కర్ణాటక డిపోలో చోటుచేసుకున్నదని చెప్పారు. కాసేపటికి ఇది తమ డిపోదేనని తెలిపారు. సదరు ఉద్యోగి కోరిన విధంగా డ్యూటీ కేటాయించని కారణంగా ఆగ్రహంతో ఉన్న అతడిని విధులకు రావొద్దని, మరుసటి రోజు రావాలని సూచించినట్లు తెలిపారు.
నవీపేట, ఫిబ్రవరి 28: యూరియా కోసం మండలంలోని రాంపూర్ గ్రామంలో సొసైటీ గోదాం ఎదుట రైతులు ఆందోళన చేపట్టారు. బీఆర్ఎస్ మండల నాయకుడు, గ్రామ మాజీ సర్పంచ్ అల్లం రమేశ్ ఆధ్వర్యంలో శనివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అల్లం రమేశ్ మాట్లాడుతూ.. అప్పులు చేసి పంటలు వేసుకున్నామని, యూరియా కొరత ఆందోళనకు గురి చేస్తున్నదని వాపోయారు. గతంలో ఎన్నడూలేని విధంగా మండలంలో యూరియా కొరత రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నదని పేర్కొన్నారు. గ్రామంలో గోదాం నిర్మించిన నాటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు చూసినా స్టాక్ ఉండేదని తెలిపారు. ఇప్పటికే యూరియా కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశ పెట్టిన మొబైల్ యాప్ కొత్తగా తలనొప్పి తీసుకువచ్చిందన్నారు. యూరియా యాప్‌తో మండలంలోని పలు ఫర్టిలైజర్ దుకాణాల్లో స్టాక్ వచ్చిన క్షణాల్లో ఆన్లైన్ బుక్ చేసుకుంటున్నారని, వెంటనే నో స్టాక్ అని వస్తుందని దీంతో రైతులు చాలా ఇబ్బందులకు గురువతున్నారని పేర్కొన్నారు. సంబంధిత అధికారులు చొరవ తీసుకొని గోదాంలో యూరియా కొరత లేకుండా చూడాలని కోరారు. కార్యక్రమంలో రైతులు గైని మోహన్,కొండపల్లి గంగాధర్, పెద్దోళ్ల రాజేశ్వర్, ఎర్రోల్ల శ్రీనివాస్, అర్జంట్ గంగాధర్, శ్యామ్ పాల్గొన్నారు.