ఎడపల్లి, మార్చి 4 : విద్యార్థులు పరీక్షల కాలంలో ఒత్తిడికి గురికాకుండా ప్రణా ళికతో చదివి ఉత్తమ మార్కులు సాధించాలని జిల్లా జడ్జి సునీత కుంచాల అన్నారు. బోధన్‌కు చెందిన రిటైర్ట్ టీచర్ సరోజమ్మ తన సొంత డబ్బులతో శానిటరీ నాప్కిన్ వెండింగ్ మిషన్లు సమకూర్చగా..మండల కేంద్ర శివారులో ఉన్న బాలికల గురుకుల పాఠశాలలో మంగళవారం పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా జడ్జి హాజరై తొమ్మిది ప్రభుత్వ గురుకుల పాఠశాలల ప్రిన్సిపాళ్లకు శానిటరీ నాప్కిన్ వెండింగ్ మిషన్లను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ.. విద్యార్థులు ఓ లక్ష్యాన్ని ఏర్పర్చుకొని జీవితంలో ఉన్నతంగా స్థిరపడాలని సూచించారు.
జీవితంలో విజయం సాధించినప్పుడే పిల్లలు తల్లిదండ్రులకు ఇచ్చే గొప్ప బహుమానం అదే అని పేర్కొన్నారు. 18 ఏండ్లు నిండిన వారికి డ్రైవింగ్ వచ్చి ఉంటే తప్పనిసరిగా లైసెన్సు పొంది ఉండాలని సూచించారు. మైనర్లు వాహనాలు నడిపి పట్టుబడితే వారి తల్లిదండ్రులకు మూడేండ్లు జైలు శిక్ష, రూ. 25 వేల జరిమానా విధిస్తారని తెలిపారు. శానిటరీ నాప్కిన్ వెండింగ్ మిషన్లను అందజేసిన రిటైర్డ్ టీచర్ సరోజమ్మను అభినందించారు. కార్యక్రమంలో బోధన్ కోర్టు జడ్జి సాయిశివ, సివిల్ జూనియర్ జడ్జి పూజిత, గురుకుల ప్రిన్సిపాల్ గంగా శంకర్, బోధన్ రూరల్ సీఐ విజయబాబు, ఎడపల్లి ఎస్సై వంశీకృష్ణా రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.