లింగంపేట, నవంబర్ 6: తమ గ్రామంలో బస్సులు ఆపకపోవడంతో విద్యాసంస్థలకు సమయానికి చేరుకోలేకపోతున్నామని విద్యార్థులు ఆందోళన చేపట్టారు. వివరాల్లోకి వెళితే.. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలోని గాంధీనగర్ గ్రామానికి చెందిన పలువురు విద్యార్థులు తాడ్వాయి మండలం ఎర్రాపహాడ్ గ్రామ ప్రభుత్వ పాఠశాలతోపాటు కామారెడ్డిలోని పలు ప్రైవేటు జూనియర్ కాలేజీలకు నిత్యం వెళ్తున్నారు. ఎల్లారెడ్డి – కామారెడ్డికి తిరిగే బస్సులను గాంధీనగర్లో ఆపడం లేదని, దీంతో తాము పాఠశాల, కళాశాలలకు సమయానికి చేరుకోవడం లేదని గాంధీనగర్లో బుధవారం రాస్తారోకో చేపట్టారు.
ఆలస్యంగా వెళ్లడంతో ఉపాధ్యాయులు తరగతి గదిలోకి అనుమతించడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. బస్సు కోసం ఉదయం ఇంట్లో తినకుండానే వస్తున్నా.. బస్సులు మాత్రం ఆపడం లేదని వాపోయారు. కామారెడ్డి నిజాంసాగర్ రూట్లో 16 బస్సులను నడుపాల్సి ఉండగా.. 13 బస్సులను మాత్రమే నడుపుతున్నారన్నారు. ఆర్టీసీ అధికారులు స్పందించి బస్సుల సంఖ్యను పెంచాలని, తమ గ్రామంలో బస్సులు ఆపే విధంగా చూడాలని వారు కోరుతున్నారు.
బస్సులు ఆపడం లేదు..
మా గ్రామంలో బస్సులు ఆపకపోవడంతో కాలేజీకి సమయానికి చేరుకోవడం లేదు. దీంతో అధ్యాపకులు తరగతి గదిలోకి అనుమతించడం లేదు. చదువును మధ్యలో ఆపాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. మేము చదువుకోవాలా వద్దా..? ఆర్టీసీ అధికారులు స్పందించి మా గ్రామంలో బస్సులు ఆపేలా చూడాలి.
-సందీప్, ఇంటర్ విద్యార్థి
అన్నం తినకుండా వస్తున్నం..
బస్సులు ఆపడం లేదని, అన్నం తినకుండానే స్టాప్ వద్దకు వస్తున్నం. బస్సులో ప్రయాణికులు నిండా ఉన్నారని, వెనుక ఇంకో బస్సు వస్తుందని వెళ్తున్నారు. మరో బస్సు ఎప్పుడు వస్తదో తెలియదు. పాఠశాలకు ఆలస్యంగా వెళ్లడంతో ఉపాధ్యాయులు లోనికి అనుమతించకుండా ఆరుబయట నిలబెడుతున్నారు.
-భార్గవి, 9వ తరగతి విద్యార్థి