Banswada | బాన్సువాడ రూరల్, జులై 2 : తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపకుండా ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని బాన్సువాడ మండలంలోని బోర్లం క్యాంపు గ్రామంలో సర్పంచ్ కుంటోల్ల నర్సవ్వ గ్రామస్తులు తల్లిదండ్రులకు సూచించారు. గ్రామస్తులు, ఉపాధ్యాయులతో కలిసి గురువారం ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో కావాల్సిన అన్ని రకాల పోలిక సదుపాయాలు ఉన్నాయని, విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, నోటుబుక్కులు, స్కూల్ యూనిఫామ్ దుస్తులను అందించడంతోపాటు మధ్యాహ్న భోజన సౌకర్యం కల్పించిందని అన్నారు.
ప్రభుత్వ పాఠశాలలో అన్ని అర్హతలు కలిగిన ఉపాధ్యాయులు ఉన్నారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం కావాలంటే తల్లిదండ్రులు తమ పిల్లలను తప్పనిసరిగా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ దుర్గాప్రసాద్, ప్రధాన ఉపాధ్యాయుడు రామకృష్ణ, వార్డు సభ్యులు గణేష్, లడ్డు, గ్రామస్తులు పిర్యానాయక్, శ్రీనివాస్ రెడ్డి, విష్ణువర్ధన్, ప్రవీణ్ కుమార్, కొండమోహన్, మోసిన్, వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.