కామారెడ్డి, నవంబర్ 7: పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని విద్యార్థులు నిరసన చేపట్టారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఐక్య విద్యార్థి సంఘాల కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందన్నారు.
ప్రభుత్వం ఫీజు బకాయిలు చెల్లించక పోవడంతో కళాశాలల యాజమాన్యాలతో పాటు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా కళాశాల యాజమాన్యాలు బంద్‌ను నిర్వహిస్తున్నాయని, నాలుగు రోజులుగా కళాశాలలు మూతబడడంతో విద్యార్థులు నష్టపోతున్నారని తెలిపారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి పెండింగ్‌లో ఉన్న పూర్తి బకాయిలను చెల్లించి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలు, టీజేఎస్ జిల్లా అధ్యక్షుడు కుంబాల లక్ష్మణ్ యాదవ్, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు నాగరాజు, బీవీఎం రాష్ట్ర కార్యదర్శి విఠల్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు అరుణ్, బుల్లెట్ రాహుల్, విద్యార్థులు పాల్గొన్నారు.