కామారెడ్డి, నవంబర్ 22: కొత్తగా వచ్చిన సిబ్బందిని వెనక్కి పంపించాలంటూ దోమకొండ మండలంలోని కస్తుర్బాగాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో విద్యార్థినులు శుక్రవారం ఆందోళనకు దిగారు. బీబీపేట కేజీబీవీ నుంచి స్పెషల్ ఆఫీసర్, మరో ముగ్గురు సిబ్బందిని దోమకొండకు కేటాయించారు. అయితే, వాళ్లను చేర్చుకోవద్దని, వెనక్కి పంపించాలంటూ విద్యార్థినులు శుక్రవారం ఆందోళన చేపట్టారు.
పాఠశాల ఎదుట బైఠాయించి సిబ్బందికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొత్తగా వచ్చిన వాళ్లను పంపించే వరకూ ఆహారం తీసుకోబోమని స్పష్టంచేశారు. ఎంఈవో విజయ్‌కుమార్ వచ్చి సర్దిచెప్పినా వారు వినలేదు. డీఈవోతోపాటు ఇతర జిల్లా అధికారులతో మాట్లాడి బీబీపేట నుంచి వచ్చిన ఎస్వో, ముగ్గురు సిబ్బందిని వెనక్కి పంపిస్తామని ఎంఈవో హామీ ఇచ్చినా విద్యార్థులు వెనక్కి తగ్గలేదు. డిప్యుటేషన్‌పై వచ్చిన సిబ్బందిని వెంటనే పంపించాలని డిమాండ్ చేశారు.