నిజామాబాద్, ఏప్రిల్ 12, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఇంటర్మీడియెట్ ఫలితాల్లో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలు అట్టడుగు స్థాయికి దిగజారింది. గతం మాదిరిగానే ఈసారి కూడా ఊహించని స్థాయిలో ఫలితాలు రాబట్టలేదు. రాష్ట్ర స్థాయిలో ఉభయ జిల్లాల నైపుణ్యత తేలి పోయింది. అట్టడుగు నుంచి పోటీ పడేంత దురావస్థకు చేరింది. ఈసారైన మెరుగైన ఫలితాలు వస్తాయని అంతా ఆశించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. రాష్ట్ర స్థాయిలో నిజామాబాద్ జిల్లాకు ఇంటర్మీడియెట్ ఫలితాల్లో (ద్వితీయ సంవత్సరం) 29వ స్థానం దక్కింది. కామారెడ్డి జిల్లా మరింత దారుణంగా మారింది.
32వ స్థానానికి పడి పోయింది. ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల్లోనూ ఘోరమైన పరాభవం ఏర్పడింది. నిజామాబాద్ జిల్లాకు రాష్ట్ర స్థాయిలో 25వ స్థానం, కామారెడ్డి జిల్లాకు 33 స్థానం దక్కింది. ఫలితాల పట్టికలో దిగజారిపోవడంతో ఉభయ జిల్లాల పరువు మంటగలిసినైట్లెంది. విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు, జిల్లా కలెక్టర్లు, ఇంటర్మీడియెట్ అధికారులు ఇటువైపు సీరియస్గా దృష్టి సారించకపోవడంతోనే ఈ దుస్థితి ఏర్పడిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
ఇంటర్మీడియెట్ విద్యాబోధనలో లోపాలకు తోడుగా మౌళిక సదుపాయాల కొరత కూడా సరైన ఫలితాలు రాకపోవడానికి కారణం కావొచ్చని సంబంధిత వర్గాల్లో చర్చ నడుస్తోంది. గతంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కొనసాగినప్పుడు రాష్ట్ర స్థాయిలో నిజామాబాద్ జిల్లా ఏటా సత్తా చాటేది. ఈ మధ్య కాలంలో పేలవమైన ఫలితాలతో పట్టికలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల పేర్లు చివర్లో కొట్టుమిట్టాడుతుండటం సిగ్గుచేటుగా దాపురించింది. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో బాలురు కంటే మెరుగ్గా బాలికలు సత్తా చాటడం కనిపిస్తోంది.
ఇంటర్మీడియెట్ ఫలితాలు పరిశీలిస్తే నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో ఇంటర్ విద్య ప్రమాణాల్లో లోపాలు ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఇందుకు మౌలిక సదుపాయాల కొరతతో పాటుగా ఇంటర్మీడియెట్ విద్య శాఖ పర్యవేక్షణ లేమి కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. జూనియర్ కాలేజీలు పేరుకే బోర్డులు తగిలించుకుని అడ్మిషన్లు ఎడాపెడా చేయించుకున్నారే తప్పా సరైన రీతిలో చదువు చెప్పడం లేదన్నది స్పష్టంగా అర్థం అవుతోంది. తల్లిదండ్రుల నుంచి రూ.వేలల్లో ఫీజులు లాక్కుంటున్న ప్రైవేటు కళాశాల యాజమాన్యాలు ఈ విషయంపై నోరు విప్పడం లేదు. ఉత్తీర్ణత శాతం మెరుగుదల విషయంలో స్పందించకపోవడం విడ్డూరంగా మారింది.
ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లోనూ ఇదే నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. లెక్చరర్లు సమయానికి కాలేజీకి రాకపోవడం, విద్యార్థులపై పర్యవేక్షణ గాలికి వదిలేయడం వంటివి బలమైన కారణాలు నిలుస్తున్నాయి. ఇంటర్ ఫలితాలు వరుసగా మూడేళ్లుగా గమనిస్తే జూనియర్ కాలేజీల్లో అసలు చదువు చెబుతున్నారా? గాలికి వదిలేశారా? అన్నది అర్థం కావడం లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇంత దారుణంగా ఇంటర్ విద్య ప్రమాణాలు ఉంటే జిల్లా కలెక్టర్లు సైతం ప్రత్యేక దృష్టి పెట్టకపోవడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వచ్చే విద్యా సంవత్సరంలోనైనా ప్రత్యేక ప్రణాళికతో మెరుగైన ఫలితాలను రాబట్టేందుకు ఇప్పటి నుంచే పాటుపడాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో వేలాది మంది విద్యార్థులకు అందుతోన్న ఇంటర్మడియెట్ విద్యపై సర్వత్రా అనుమానాలు కలుగుతున్నాయి. ఫలితాల రాకను పరిశీలిస్తే తల్లిదండ్రులంతా భయాందోళనకు గురి కావాల్సి వస్తోంది. ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరంలో వచ్చిన ఫలితాల్లో కామారెడ్డి జిల్లాలో సగం మంది ఫెయిల్ కావడం ముక్కున వేలేసుకునేలా చేస్తోంది. 7231 మందికి కేవలం 49.40 శాతం అంటే 3572 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్ర స్థాయిలో 33వ స్థానంలో కామారెడ్డి జిల్లా నిలవాల్సి వచ్చింది. మొదటి సంవత్సరం ఫలితాల్లో నిజామాబాద్ జిల్లాకు 25వ స్థానం వచ్చినప్పటికీ ఫలితాల్లో దాదాపుగా 50శాతం మాత్రమే దాటింది.
15,547 మందికి 8806 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. 56.64శాతం ఉత్తీర్ణత నమోదైంది. 43.36 శాతం మంది ఫెయిల్ కావాల్సి వచ్చింది. ద్వితీయ సంవత్సరం ఫలితాలను పోలి స్తే గుండె గుభేళ్మనే దుస్థితి నెలకొంది. మొదటి సంవత్సరంలో నిజామాబాద్ జిల్లాలో 13,879 మంది విద్యార్థులుంటే 9187 మంది పాస్ అవ్వ గా 66.19 శాతం ఉత్తీర్ణత నమోదు అయ్యింది. కామారెడ్డిలో 6,129 మంది విద్యార్థులకు 3867 మంది మాత్రమే పాస్ అయ్యారు. 63.09 శాతం ఉత్తీర్ణత వచ్చింది. ఉమ్మడి జిల్లాలో దాదాపుగా 35 శాతం నుంచి 40 శాతం మంది ద్వితీయ సంవత్సరంలో ఫెయిల్ అయ్యారు.
ఖలీల్వాడి, ఏప్రిల్ 12: ఇంటర్లో ఫెయిలైన విద్యార్థులు నేటి నుంచి 20వ తేదీ వరకు సంబంధిత కళాశాలలో సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లించవచ్చని నిజామాబాద్ జిల్లా ఇంటర్ విద్యాధికారి రవికుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రీకౌంటింగ్ చేయించుకోదలుచున్న విద్యార్థులు రూ.వంద, రీవాల్యుయేషన్ స్కాన్ కాపీ పొందడానికి రూ.800ను మీసేవలో 20వ తేదీ వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు. రీకౌంటింగ్, రీవాల్యుయేషన్ ఫీజు చెల్లించే విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్ష ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుందని వివరించారు.
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు మే 13 నుంచి నిర్వహించనున్నట్లు జిల్లా ఇంటర్ విద్యాధికారి రవికుమార్ తెలిపారు. ఉదయం మొదటి సంవత్సరం, మధ్యాహ్నం రెండో సంవత్సరం విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. సప్లిమెంటరీ ప్రాక్టికల్ పరీక్షలు మే 22 నుంచి 26వ తేదీ వరకు ఉంటాయని తెలిపారు.