నస్రుల్లాబాద్, జూలై 6: బీర్కూర్‌లోని మహాత్మా జ్యోతిబాపూలే పాఠశాల, కళాశాలలో ఆదివారం రాత్రి భోజనం వికటించి 17 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని బాన్సువాడ దవాఖానకు తరలించి, చికిత్స అందించారు. 16మందిని డిశ్చార్చి చేయగా, ఒక విద్యార్థి చికిత్స పొందుతున్నాడు. పాఠశాలలో 498 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఆదివారం రాత్రి భోజనంలో అన్నం, చిక్కుడుకాయ కరీ, సాంబార్, బటర్ మిల్క్ వడ్డించారు. భోజనం అనంతరం 17 మంది విద్యార్థులకు వాంతులు, విరేచనాలు కావడంతో.. 12 మందిని వెంటనే 108 అంబులెన్సులో బాన్సువాడ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. సోమవారం ఉదయం మరో ఐదుగురు విద్యార్థులను దవాఖానకు తీసుకెళ్లారు.
16 మంది విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉండడంతో వారిని డిశ్చార్జి చేశామని, ఒక విద్యార్థి చికిత్స పొందుతున్నట్లు బీర్కూర్ పీహెచ్సీ డాక్టర్ శ్రీలేఖ తెలిపారు. పాఠశాలలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటుచేసి విద్యార్థులకు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు అస్వస్థత గురైన విషయం తెలుసుకున్న బాన్సువాడ ఆర్డీవో రవీందర్ రెడ్డి సోమవారం రాత్రి పాఠశాలను సందర్శించారు. వంట గదిలో ఆహార తయారీ, నిల్వ, పరిశుభ్రత ప్రమాణాలను పరిశీలించారు. తరగతి గదిలో విద్యార్థులు కలిసిన వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఘటనకు గల కార ణాలపై సమగ్ర విచారణ చేపట్టి, నివేదిక ఉన్నతాధికారులకు సమర్పిస్తామని తెలిపారు. ఆర్సీవో సత్యనాథ్ రెడ్డి, తహసీల్దార్ సవాయి సింగ్, ఎంపీడీవో శ్రీనిధి కూడా పాఠశాలను సందర్శించారు.
బాన్సువాడ, జూలై 6: బాన్సువాడ దవాఖానలో చికిత్స పొందుతున్న విద్యార్థులను బీఆర్ఎస్ నాయకులు పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి మెరుగైన చికిత్స అందించాలని రైతుబంధు సమితి మాజీ కన్వీనర్ అంజిరెడ్డి సూచించారు.మున్సిపల్ కౌన్సిలర్ మక్బూల్, పార్టీ నాయకులు ఫేరోజ్, ఆంజనేయులు, దేవీసింగ్, బాబురావ్, బాలకృష్ణ, సాయి, సుధాకర్ , లక్ష్మణ్, కాసుల బాబు ఉన్నారు.